Cyber crime | కంటికి కనిపించని దొంగలు ఎక్కువైపోయారు. మానసికంగా వేధించి.. వర్చువల్‌గా బాధించి, ఆర్థికంగా నట్టేట ముంచే మోసగాళ్లు మన చుట్టూ ఉన్నారు. కాబట్టే క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడానికి అవగాహనే ఆయుధం. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే.. మరింత నష్టం వాటిల్లకుండా అరికట్టవచ్చు. అసలు, సైబర్ నేరాల విషయంలో బాధితులు ఎలా స్పందించాలి? ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
సైబర్ దుశ్చర్యలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు హోంశాఖ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది. అదే https://www.cybercrime.gov.in. 1930 అనే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఉంది. వీటిద్వారా అన్ని రకాల సైబర్ నేరాల గురించీ అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ వేదిక మహిళలు, పిల్లల సమాచార గోప్యతకు ప్రాధాన్యం ఇస్తుంది. ఆర్థిక నేరాలపైనా దృష్టి పెడుతుంది. సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో, సాధారణ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆన్లైన్లో డబ్బు పోగొట్టుకుని ఉంటే మాత్రం, తక్షణం 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ఉత్తమం.
ttps://www.cybercrime.gov.in వెబ్సైట్లో మీ మొబైల్ నంబర్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. ఆ ప్రయత్నంలో ఓటీపీ ద్వారా రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత ఫిర్యాదు ఏ కేటగిరి కిందికి వస్తుందో తెలుసుకోవాలి. మహిళలు, పిల్లలకు సంబంధించిన విభాగంలో.. చైల్డ్ అబ్యూజ్, లైంగిక వేధింపులు, అసభ్యకర కంటెంట్ (ఫొటో, వీడియో ఇతరాలు) ఉంటాయి. ఇతర సైబర్ నేరాల విషయానికొస్తే.. మొబైల్, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్స్ నేరాలు, సోషల్ మీడియా నేరాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలు, సైబర్ ట్రాఫికింగ్, రాన్సమ్వేర్, హ్యాకింగ్ వంటి విభాగాలు ఉంటాయి. సంబంధిత విభాగాన్ని ఎంచుకొని ఫిర్యాదు చేయాలి. నేరాన్ని నివేదించే క్రమంలో.. నేరం జరిగిన వేదిక (ఇంటర్నెట్, వాట్సాప్) తేదీ, సమయం, సంబంధిత సాక్ష్యాలు, ఆర్థికపరమైన మోసాలకు సంబంధించిన స్క్రీన్షాట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, లైంగిక వేధింపులకు సంబంధించిన స్క్రీన్షాట్లు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు వంటివి
జతచేయాలి. వీటితోపాటుగా అనుమానితుడి వివరాలు (అందుబాటులో ఉంటే), ఫిర్యాదుదారుల వివరాలు సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
సైబర్ నేరాల విషయంలో చాలామంది ఫిర్యాదు చేయడానికి జంకుతున్నారు. ‘నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారో’ అనే భయమే ప్రధాన కారణం. దీంతో నేరగాళ్లకు ధైర్యం వచ్చేస్తున్నది. అయితే, ఇక్కడ ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. అసలు బయటపెట్టరు. అర్థంలేని భయాలతో కాలాన్ని వృథా చేయకుండా.. నేరం జరిగిన వెంటనే ఆన్లైన్లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ ఫిర్యాదు చేయడం ఉత్తమం. పరువునష్టం కలిగించినా, బెదిరించినా, మొబైల్ ఫోన్, కెమెరా ద్వారా వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించినా, సైబర్ స్టాకింగ్‌కు పాల్పడినా, డేటా దొంగిలించినా, గ్యాడ్జెట్స్ హ్యాకింగ్ చేసినా, సైబర్ టెర్రరిజానికి పాల్పడినా.. మీ దగ్గర ఉన్న సమాచారంతో ఫిర్యాదు చేయండి.
సత్వర న్యాయం, ఉపశమనం కోసం సర్కారు ప్రవేశపెట్టిన పథకం ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)’. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను చట్టబద్ధంగా అమలు చేసేఏజెన్సీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఒక తాటిపైకి తీసుకురావడానికి ‘ఐ4సీ’ని రూపొందించారు. ఇది ప్రస్తుతం ఏడు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది. ఆన్లైన్ మోసాల్లో డబ్బు కోల్పోయినప్పుడు తక్షణ రికవరీకి ఈ విభాగం తోడ్పడుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జరిగే మోసాల్ని బ్యాంకులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్తుంది. ఆన్లైన్లో బాధితులు కోల్పోయిన డబ్బును ‘డిజిటల్ ఎకో సిస్టమ్’ నుంచి బయటికి తీయకముందే.. తదుపరి మోసాన్ని అడ్డుకునే సాంకేతిక వ్యవస్థ ఇది.
డిజిటల్ మీడియా రాకతో గోప్యతకు ముప్పు వాటిల్లుతున్నది. ఇష్టారీతిన చెడు ప్రచారం చేస్తున్నారు. పరువునష్టం కలిగిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవన్నీ పంటికింద రాయిలా మారాయి. దీంతో ‘డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్-2021’ పేరుతో కొన్ని మార్గదర్శకాలను ప్రవేశ ప్రవేశపెట్టారు. వీటిని అనుసరించి సైబర్ క్రైమ్ పోలీసులు డిజిటల్ మీడియా సంస్థలు, వ్యక్తులపై వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మీరు కూడా డిజిటల్ మీడియా బాధితులైతే వెంటనే సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించవచ్చు. తక్షణం చట్టవిరుద్ధ,
అనైతిక, అశ్లీల సమాచారాన్ని, లింకులను తీసేస్తారు. సంబంధిత నోడల్ అధికారుల మద్దతుతో సత్వర పరిష్కారమూ అందిస్తారు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?
అందమైన అమ్మాయిల నుంచి రిక్వెస్ట్‌లు వస్తున్నాయా?
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా? కాపురాలే కూలిపోవచ్చు జాగ్రత్త
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?
5G Scam Alert | 5జీ అప్‌గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త