shaik saleema | ఖమ్మం జిల్లా నుంచి తొలి మహిళా ఐపీఎస్‌గా, రాష్ట్రంలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా షేక్ సలీమా వార్తల్లో వ్యక్తి అయ్యారు. సాధారణ కానిస్టేబుల్ కూతురు ఐపీఎస్ స్థాయికి చేరుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన సలీమా 2007లో డీఎస్పీగా ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. సలీమా విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే..
నాన్న లాల్ బహదూర్ సాధారణ కానిస్టేబుల్. కొన్నేండ్ల కిందటే ఆయన ఎస్సైగా పదవీ విరమణ చేశారు. నా బాల్యం అంతా ఖమ్మంలోనే సాగింది. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ (బయోటెక్నాలజీ) చేశా. 2007లో గ్రూప్ 1 పరీక్షల ద్వారా డీఎస్పీ అయ్యా. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో నా మొదటి పోస్టింగ్. తర్వాత అంబర్‌పేట పీటీసీ వైస్ ప్రిన్సిపాల్‌గా చేశాను. మాదాపూర్‌లో అడిషనల్ కమిషనర్ (అడ్మిన్)గా పనిచేశా. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా విధులు నిర్వర్తిస్త్తున్నా. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన నాన్ కేడర్ ఐపీఎస్ పదోన్నతి జాబితాలో నా పేరు ఉండటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం మహిళను కావడం గర్వంగా ఉంది. 14 ఏండ్లుగా వృత్తినే దైవంగా భావించి నిబద్ధతతో పనిచేశా.
ఉద్యోగ జీవితంలో మరపురాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 2018 జూలైలో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లోని వ్యభిచార గృహాల్లో దాడులు నిర్వహించాం. 36 మందిని వ్యభిచార ఊబి నుంచి బయటికి తీసుకువచ్చాం. వీరందరి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, తప్పిపోయిన వారితో సరిచూస్తే 33 మంది బాలికల డీఎన్ఏలతో మ్యాచ్ కాకపోవడం బాధాకరం. ఈ 33 మందిని ప్రభుత్వమే దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటున్నది. 2018 నుంచి 2020 వరకు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు ఆస్పత్రుల్లో దాడులు నిర్వహించాం. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న అనేక ఆస్పత్రులను సీజ్ చేశాం.
నాన్న లాల్ బహదూర్, అమ్మ యాకూబ్‌బీ నాకు ఆదర్శం. మేం నలుగురం. ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు ఉన్నారు. అందరిలో నేనే పెద్ద. నేను ఐపీఎస్ స్థాయికి చేరుకున్నాను. ఒక సోదరి జరీనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పాస్ అయింది. ఇంటర్వ్యూలోనూ విజయం సాధిస్తే ప్రభుత్వ సర్వీస్‌లో చేరుతుంది. మరో సోదరి గ్రూప్స్‌కు ఎంపికై ఖైరతాబాద్ ఎంవీఐగా పని చేస్తున్నది. తమ్ముడు ఖాసీం హైదరాబాద్‌లో కేర్ ఆస్పత్రిలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. మమ్మల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. వారి నుంచి నేను స్ఫూర్తి పొందాను. నాన్న ఎన్నో వ్యయప్రయాసలు పడి మమ్మల్ని చదివించాడు. అమ్మ మా వెన్నంటి ఉండి నడిపించింది. నేను ఈ స్థితికి చేరడానికి వాళ్లిద్దరే కారణం.
మనం గ్రామీణ ప్రాంతాల్లో పుట్టామా, పట్టణంలో పుట్టామా అన్నది ముఖ్యం కాదు. పక్కా ప్రణాళికతో చదివితే ఎలాంటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. యువత ఎదగడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. సన్మార్గంలో ముందుకెళ్లి నిబద్ధతతో పనిచేసుకుంటూ వెళ్తే విజయాలు కోరి వరిస్తాయి.
✍ ఈలప్రోలు కృష్ణారావు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
పుష్పలో సామీ సామీ పాట పాడే అవకాశం మౌనిక యాదవ్‌కు ఎలా వచ్చిందంటే..
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..