కొల్లాపూర్ రూరల్, నవంబర్11 : అడవిలోని చెట్లను అక్రమంగా నరికివేస్తుండగా.. అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ శాఖాధికారులపై కాంగ్రెస్ నాయకుల అనుచరులు దాడికి దిగిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. కొల్లాపూర్ రేంజ్ పరిధి నార్లాపూర్ సెక్షన్ ఏరియా ముక్కిడిగుండం అటవీప్రాంతం వట్టిమాకులకుంట ఏరియాలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కంపార్ట్మెంట్ మంగళవారం చెట్లను నరికి నిప్పుపెట్టి చదునుచేస్తున్నారు.
విషయం తెలుసుకొన్న నార్లాపూర్ అటవీ సెక్షన్ అధికారి జయరాజుతోపాటు బీట్ ఆఫీసర్లు, వాచర్లు అక్కడకువెళ్లి వారిని అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకుల అండను చూసుకున్న దుండగులు అటవీ శాఖ సిబ్బందిపై దాడికి దిగారు. జయరాజు తీవ్రంగా గాయపడగా.. బీట్ ఆఫీసర్ నాయక్, వాచర్లు సుల్తాన్, ఈదన్న, శేఖర్, రమేశ్, నిరంజన్‌కు గాయాలయ్యాయి. దాడికి కారణమైన వారిని అధికారులు అదుపులోకి తీసుకొని కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ కార్యాలయానికి తరలించారు.