Dark Chocolate | డార్క్ చాక్లెట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. రుచిని మాత్రమే కాకుండా డార్క్ చాక్లెట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే గుండెను, కాలేయాన్ని రక్షించడంలో కూడా డార్క్ చాక్లెట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా. డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు సమృద్దిగా ఉంటాయి. ఈ మొక్క ఉత్పన్న అణువులు ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని కూడా మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరగడం వల్ల రక్తనాళాలు బలంగా తయారవ్వడంతో పాటు ధమనుల గోడలు సడలి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఈ జీవరసాయన చర్యల వల్ల గుండె సంబంధిత వ్యాధులు, కొవ్వు పేరుకుపోయే కాలేయ వ్యాధుల ప్రమాద కారకాలపై ప్రభావం చూపవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అయితే రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, రక్తనాళాల స్పందన వంటి వాటిల్లో మెరుగుదల కనిపించనప్పటికీ ఇవి ప్రధానంగా చిన్న స్థాయి నియంత్రిత అధ్యయనాలపై ఆధారపడి ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాల్స్ నైట్రిక్ ఆక్సైడ్ విడుదలను ప్రేరేపించి రక్తనాళాలను సడలింపజేస్తాయి. దీని ద్వారా రక్తపోటు తగ్గుతుంది. అలాగే డార్క్ చాక్లెట్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగినట్టు కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కోకోలో ఉండే ప్రతి ఆక్సీకరణ పదార్థాలు రక్తనాళాల గోడలను, కొవ్వు అణువులను ఆక్సీకరణ నష్టానికి గురికాకుండా రక్షిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. గుండెకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.
అలాగే డార్క్ చాక్లెట్ లో ఉండే ప్రతిఆక్సీకరణ పదార్థాలు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్ ను తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి సూచికలు, కాలేయ ఎంజైమ్ స్థాయిలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు పేరుకుపోయే కాలేయ వ్యాధుల్లో కాలేయ కణాలను రక్షించడంలో కూడా ఈ చాక్లెట్ సహాయపడుతుంది. అయినప్పటికీ దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల చికిత్సలో భాగంగా ఈ డార్క్ చాక్లెట్ ను వినియోగించవచ్చా లేదా అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
డార్క్ చాక్లెట్ గుండె , కాలేయ ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీనిని మితంగానే తీసుకోవాలి. అన్ని రకాల చాక్లెట్లు ఒకేలా ఉండవు. అధిక కోకో శాతం ఉన్న చాక్లెట్ లలో ఫ్లేవనాల్స్ ఎక్కువగా, చక్కెర తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల చాక్లెట్ లల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. చక్కెర, క్యాలరీలు, కొవ్వు ఉండే చాక్లెట్ లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మేలు కంటే హానే ఎక్కువగా కలుగుతుంది. కనుక వీటిని వైద్యుడి సలహా మేరకు మితంగా తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.