Ira Singhal | వెన్నెముక లోపం.. నిటారుగా నిలబడనివ్వలేదు. అయినా లక్ష్యం దిశగా పరుగును ఆపలేదు. సమాజం.. ప్రతిభను గుర్తించలేదు. కానీ, ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. పాలన యంత్రాంగం వివక్షకు గురిచేసింది. ఇప్పుడు మాత్రం, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ పోరాటం వ్యవస్థను కదిలించింది. మొత్తానికి ఐఆర్ఎస్కు ఎంపికైనా, ఐఏఎస్ సాధించేవరకూ ఆమె విశ్రమించ లేదు. ఆమాటకొస్తే.. ఆ తర్వాత కూడా విశ్రమించ లేదు. తన కలను నిజం చేసుకోవడం నుంచి ప్రజల కలలను నిజం చేసే సమర్థ అధికారిగా పేరు తెచ్చుకొనే వరకూ ఇరా సింఘాల్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం..
ఇరా సింఘాల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టింది. అమ్మానాన్నలు అనిత-రాజేంద్ర. తండ్రి ఇంజినీర్, తల్లి బీమా సలహాదారు. పుట్టుకతోనే ఇరాకు వెన్నెముక సమస్య ఉంది. దీంతో ఒక పక్కకు వంగి నడవాల్సిన పరిస్థితి. చేతులనూ స్వేచ్ఛగా ఆడించలేని దుస్థితి. అయినా పట్ట్టుదలతో చదువుకుంది. నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో పట్టా తీసుకుంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసింది. క్యాడ్బరీ చాక్లెట్ల కంపెనీలో స్ట్రాటజీ మేనేజర్‌గా, కోకా కోలాలో మార్కెటింగ్ ఇంటర్న్‌గా కొంతకాలం పనిచేసింది. ఏడాదిపాటు స్పానిష్ బోధించింది. ఈ కొలువులేవీ సంతృప్తినివ్వలేదు. చుట్టూ ఉన్న సమస్యలు, వ్యవస్థలోని అవినీతి.. తనను ఆవేదనకు గురిచేశాయి. ఏదైనా సామాజిక బాధ్యత కలిగిన ఉద్యోగం చేయాలన్న ఆలోచన వచ్చింది. దీంతో సివిల్స్‌పై దృష్టి సారించింది.
అనేక పరిమితులను అధిగమించి మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికైంది ఇరా సింఘాల్. అంతలోనే మరో అవరోధం. శారీరక వైకల్యాన్ని సాకుగా చూపుతూ పోస్టింగ్ ఇచ్చేందుకు తిరస్కరించారు. ‘లక్షల మందితో పోటీపడి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. అన్ని దశలూ దాటుకొని, అంతిమ విజేతగా నిలిచిన తర్వాత కూడా ఈ వివక్ష ఎందుకు?’.. ఇరా పదునైన ప్రశ్నకు జవాబు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. ఇక లాభం లేదనుకొని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను (క్యాట్)ను ఆశ్రయించింది. నాటి ప్రధానికి ఘాటైన లేఖ రాసింది. దీంతో పాలన వ్యవస్థ దిగొచ్చి, పరువు నిలబెట్టుకుంది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా ఇరా సింఘాల్‌కు నియామక పత్రాలు పంపింది. అసిస్టెంట్ కమిషనర్‌గా పోస్టింగ్ కూడా వచ్చింది. తన లక్ష్యం ఆ ఉద్యోగం కాకపోవడంతో, మళ్లీ ప్రయత్నించింది. ఈసారి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికైంది. సివిల్ సర్వీసు పరీక్షలో అగ్రగామిగా నిలిచిన తొలి విభిన్న ప్రతిభావంతురాలిగా ఇరా రికార్డు సృష్టించింది. ఐఏఎస్ శిక్షణలోనూ మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని అందుకున్నది.
ఇరా సింఘాల్ పరిపాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నది. గ్రీన్ఎనర్జీ, ఖాదీ, స్వదేశీ దుస్తుల ప్రచారం, విద్య, వైకల్యం, లింగవివక్షత, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ కౌన్సెలింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నది. మహిళా సాధికారత, బాల కార్మికులు, బాల్య వివాహాల అడ్డుకట్ట.. లాంటి సామాజిక అంశాలపై అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ప్రసంగించింది. ఐఐఎంలు, ఐఐటీలలో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు ఇస్తున్నది. ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయంలో ఒక ట్రాన్స్‌జెండర్‌కు ఉద్యోగాన్ని ఇచ్చిన మొదటి ఐఏఎస్ అధికారి తనే. ప్రస్తుతం ఇరా సింఘాల్ కేంద్ర దివ్యాంగుల శాఖ బ్రాండ్ అంబాసిడర్. ఎన్నికల కమిషన్ జాతీయ ప్యానెల్లో సభ్యురాలు కూడా. వైకల్యాలున్న పిల్లలకు పరీక్షల నిర్వహణకు సంబంధించి విధివిధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తున్నది ఇరా సింఘాల్.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వైకల్యం ఉంటుంది. ప్రతి ఒక్కరికి రకరకాల సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు, మనకు లేనివాటి గురించి చింతిస్తూ కూర్చుంటే ఏదీ సాధించలేం. దానికి బదులు మనం ఏం చేయగలమో ఆలోచించాలి. ఎందుకంటే మనలో మనకే తెలియని ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. ముందు దాన్ని గుర్తించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. మనలోని మంచిని, ప్రతిభను మనమే గుర్తించ గలం. ఆ పని ఎదుటివారు చేయలేరు. ఎందుకంటే, మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచం కూడా మనల్ని అలానే చూస్తుంది. మనలోని లోపాలకు కుంగి పోతుంటే, ప్రపంచం కూడా మన లోపాలనే వేలెత్తి చూపుతుంది తప్పిస్తే, మంచిని చూడదు. కాబట్టి, ప్రపంచా నికి మనం ఎలా పరిచయం కావాలన్నది మనమే నిర్ణయిం చుకోవాలి. వైకల్యాన్ని, సమస్యలను పక్కనపెట్టి మనలోని ప్రతిభకు సానబెట్టాలి. నీ కోసం నువ్వే కలలు కనాలి. నీ కోసం నువ్వే కష్టపడాలి. అప్పుడే నువ్వు విజేతగా నిలు స్తావు. యువతకు, వైకల్యం ఉన్నవాళ్లకు ఇదే నా సూచన.
– ఇరా సింఘాల్
…? మ్యాకం రవికుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నా పాట కోసం మా నాన్న ఇంట్లో టీవీ కూడా అమ్మేసిండు
కొడుకు కోసం వెంటాడి మరి చిరుతతోనే పోరాడింది
ఇంట్లో చెప్పకుండానే నటించా.. సినిమా విడుదలయ్యాక నాన్నకు తెలిసి..
ఎక్కడ మైక్ పెట్టినా హలో హలో మైక్ టెస్టింగ్ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
custard apple | సీతాఫలాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పాలమూరు మహిళలు..
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !