komala | ఇద్దరు పిల్లలూ బాగా చదువుకున్నారు. జీవితాల్లో స్థిరపడ్డారు. ఆర్థిక సమస్యలు కూడా లేవు. ఇక, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కోమలాదేవి మాత్రం ప్రయోగాలు చేయడానికైనా, కొత్త వ్యాపారం ప్రారంభించడానికైనా ఇదే సరైన సమయమని భావించారు. హెర్బల్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ఐదు పదుల వయసులో ఆంత్రప్రెన్యూర్‌గా అవతరించిన కోమలను ‘జిందగీ’ పలకరించింది.
మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. నా ఆరేండ్ల వయసులోనే మా కుటుంబం ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడింది. నలుగురు అన్నయ్యల ముద్దుల చెల్లిని నేను. బాల్యం నుంచీ నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఇంట్లో కూడా ప్రోత్సహించారు. కొన్నేండ్లు కథక్ నేర్చుకున్నాను. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే మంచి సంబంధం వచ్చిందని పెండ్లి చేశారు. తర్వాతే, ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేశాను. ఆయనతోపాటు ఇరాన్ వెళ్లిపోయాను. అక్కడ ఆరేండ్లు ఉన్నాం. అప్పుడే, బ్యుటీషియన్ కోర్సు చేశాను. అదే నాకు, భవిష్యత్‌లో దారి చూపిస్తుందని ఆరోజు ఊహించలేదు. ఇరాన్లో సౌందర్య చికిత్స పద్ధతులను చూసి ముచ్చటేసేది. ఆయుర్వేదాన్ని ఆధునిక జీవితాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడంలో మనం వెనుక బడ్డామేమో అనిపించేది.
ఇద్దరు కొడుకుల చదువు కోసం ఇరాన్ నుంచి ఇండియా వచ్చేశాను. జీవితంలో ఎదురైన ఒక్కో సంఘటనా నన్ను ఒక్కోలా ప్రభావితం చేసింది. అన్నీ కలిసి నన్ను వైరాగ్యంలో పడేశాయి. అప్పుడే ధ్యానంపై మనసు మళ్లింది. నేను అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాను. డ్యాన్స్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండటంతో దూరదర్శన్‌లో చేరాను. ఈటీవీలోనూ కొన్ని సీరియల్స్‌లో నటించాను. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చేశాను. అయితే, ఎదుగుతున్న పిల్లలతో తగినంత సమయం గడపలేకపోతున్నానని అర్థమైంది. అప్పుడే, ఒక పర్షియన్ కాస్మొటాలజిస్ట్ దగ్గర బ్యూటీ థెరపీలో అడ్వాన్స్డ్ కోర్సులు చేశారు. మొదట ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో బ్యూటీ క్లినిక్ ప్రారంభించాను. తర్వాత బేగంపేట్‌కు విస్తరించాను. 2005లో వాటిని అమ్మేసి, కొంతకాలం కెనడాలో ఉన్న పెద్దబ్బాయి దగ్గర ఉన్నాను. ఈ పదమూడేండ్ల కాలంలో వందల మంది ఆడపిల్లలను బ్యుటీషియన్స్గా తీర్చిదిద్దాను. పేద పిల్లలకు ఉచితంగా బోధించాను.
‘వెనికా హెర్బల్ ప్రొడక్ట్స్’ నా కలల పంట. ఆయుర్వేద మూలికలైన ఉసిరి, కుంకుడు, బృంగరాజ్, దవనం, మందారం, జాపత్రి, జాజికాయ, కర్పూరం, గులాబి రేకులు, వేప మొదలైన 21 మూలికలను మా ఉత్పత్తులలో ఉపయోగిస్తాను. వాటితో హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్, షాంపూ, హెన్నా తయారు చేస్తున్నాను. ఛాయా పసుపు, ఫేస్‌ప్యాక్ కమ్ ఫేస్‌వాష్ కూడా చేస్తున్నాను. వీటన్నిటికీ ఆయుష్ నుంచి గుర్తింపు లభించింది. మా ఉత్పత్తులను పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. ‘శాంపిల్‌గా వాడండి. 100 శాతం మీకు నచ్చుతాయి. అప్పుడు మళ్లీ మీరే కావాలని తీసుకుంటారు’ అని కస్టమర్లకు చెబుతాన్నేను. అనుకున్నట్టే మళ్లీ వస్తారు. ఆ సంతృప్తి నాకు ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తుంది. మల్కాజ్‌గిరిలోని మా ఇంట్లోనే తయారీకి తగిన ఏర్పాట్లు చేశాను. మా దగ్గర ఉండే మహిళలే అన్ని పనులూ చూసుకుంటారు. అకౌంట్స్ వ్యవహారాలు నా భర్తకు అప్పగించాను. మార్కెట్లో రసాయనాలతో కూడిన సబ్బులు, షాంపూలు, నూనెలు అనేకం వస్తున్నాయి. వాటితో ప్రయోజనం కంటే, కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమే ఎక్కువ. కాబట్టే, 100 శాతం నాణ్యమైన ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగించమని నా సలహా. నా కృషికి గుర్తింపుగా ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్స్- ఇండియా’ నుంచి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాను. ‘వీ హబ్’ ఎంపిక చేసిన అత్యుత్తమ ఉత్పత్తులలో మా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మేం మరింతమందికి చేరువ కావాలంటే మా సంస్థను ఇంకొంత విస్తరించాలి. ఆ ప్రయత్నమూ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు, భాగస్వాములను ఆహ్వానిస్తున్నాం. నాతో పాటు, నా చుట్టూ ఉన్న నలుగురూ మంచిగా బతకాలనే నేనెప్పుడూ కోరు కుంటాను. ఒక్క ఆంత్రప్రెన్యూర్‌షిప్ వల్లే అది సాధ్యం. అందుకే, పరిమితులను లెక్కచేయకుండా ఓ సంస్థను స్థాపించాను.
మా పెద్దబ్బాయిని ఇంటర్ కాగానే కెనడా పంపాను. అక్కడే చదివించాను. తను అక్కడే స్థిరపడ్డాడు. చిన్నబ్బాయి ఇక్కడ ఇంజినీరింగ్ చదివి, లండన్‌లో మాస్టర్స్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలంతా స్థిరపడినా ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. మొదట్నించీ ఏదో ఒక పని చేయడం అలవాటైంది. అందుకే ఓ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకొన్నా. ఈ వయసులో ఇదంతా అవసరమా? అని నవ్వుకోవచ్చు మీరు. జీవితంలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఇదే సరైన సమయమని నా విశ్వాసం.
…? నిఖిత నెల్లుట్ల
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
custard apple | సీతాఫలాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పాలమూరు మహిళలు..
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళన చేశారు.. కానీ..
మీ పెంపుడు జంతువులు..ఇక తప్పిపోవు!