మా పాపకు మూడేండ్లు. ఏడాది నుంచి తరచూ జలుబు అవుతున్నది. బాగా దగ్గుతున్నది. గురగురా శబ్దం వస్తున్నది. బాగా ఇబ్బంది పడితే డాక్టర్‌కు చూపించాం. సిరప్ వాడమని సలహా ఇచ్చారు. అలాగే నెబులైజర్ పెట్టారు. సంవత్సరంలో మూడునాలుగుసార్లు ఇలా జరిగింది. పదే పదే నెబులైజర్ పెట్టడం సరైనదేనా? దీనివల్ల ఏమైనా హాని జరుగుతుందా?
బిడ్డ ఊపిరి తీసుకునేప్పుడు ఉండే సమస్యని బట్టి ఏ రకమైన మందు ఇవ్వాలనేది వైద్యులు నిర్ణయిస్తారు. ఒకప్పుడు సిరప్లు ఇచ్చేవాళ్లు. ఆ మందు శరీరంలోని అన్ని భాగాల్లోకి పోయి ఊపిరితిత్తులకూ పోయేది. అందువల్ల మిగతా భాగాలకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. నెబులైజర్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి మందు ఇచ్చే విధానం.
నెబులైజర్స్, ఇన్హేలర్స్ గత 30 సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నాయి. ఓ పదిహేనేళ్లుగా చాలా ప్రాచుర్యం పొందాయి. ఊపిరితిత్తుల సమస్యకు ఇవే ప్రధానమైన చికిత్స. నెబులైజర్, ఇన్‌హేలర్లలో ఏది ఎప్పుడివ్వాలనేది కూడా సమస్య తీవ్రతను బట్టే వైద్యులు నిర్ణయిస్తారు. బిడ్డకు ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు నెబులైజర్ ఇస్తారు. దీనిద్వారా శ్వాస తీసుకున్నప్పుడు ద్రవ రూపంలో ఉన్న మందు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. పిల్లలకు సమస్య తీవ్రంగా లేనప్పుడు ఇన్హేలర్ ఇస్తారు. అయితే వాళ్లు సహకరించరు. అటువంటి పరిస్థితుల్లో నెబులైజర్ ఇవ్వాల్సి వస్తుంది.
కానీ, నెబులైజర్, ఇన్హేలర్లో రెండిటినీ పోల్చితే.. ఇన్హేలర్ సరైన విధానం. ఇందులో ఎరోసోల్ రూపంలో ఉన్న మందు శ్వాస తీసుకున్నప్పుడు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్తుంది. దీనిని పెద్దవాళ్లు తేలికగా తీసుకోగలుగుతారు. పిల్లలు అలా చేయలేరు. ఆ మందు ఇవ్వడానికి అనుగుణంగా స్పేసర్ని ఉపయోగిస్తారు. మాస్క్ పెట్టుకుని స్పేసర్లోని మందుని పీల్చుకోగలుగుతారు. ఇలా మందు ఊపిరితిత్తులలోకి వెళ్తుంది.
తీవ్రత ఎక్కువగా లేని సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. కానీ, బిడ్డకు ఆక్సిజన్ తక్కువగా అందుతున్న సందర్భంలో హాస్పిటల్‌కి తీసుకుపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆక్సిజన్ ద్వారా నెబులైజేషన్ ఇవ్వాలి. తీవ్రస్థాయిలో లేనప్పుడు ఎయిర్ కంప్రెసర్‌తో ఇంట్లోనే నెబులైజర్ ద్వారా ఇవ్వొచ్చు. మూడు సంవత్సరాలలోపు పిల్లలకు ఇన్హేలర్ మాస్క్ ద్వారా, మూడు నుంచి అయిదు సంవత్సరాల లోపు పిల్లలకు (జబ్బు తీవ్రత, శ్వాస తీసుకునే విధానాన్ని బట్టి) స్పేసర్ ద్వారా ఇవ్వొచ్చు. అయిదు సంవత్సరాలు దాటిన తర్వాత డ్రై పౌడర్ ఇన్హేలర్స్ వాడొచ్చు.
నెబులైజర్స్ తరచుగా ఇవ్వాల్సిన అవసరం లేకుండా జబ్బు పోగొట్టేందుకు మందు (ఇన్హేలర్ రూపంలో) అవసరమే. ఇన్హేలర్ గురించి సమాజానికి అపోహ ఉంది. ఇది వాడటం మొదలుపెడితే జీవితాంతం వాడాలని, ఆస్తమా జబ్బు ఉందనుకుంటారని తల్లిదండ్రులు దీనిని వాడటానికి ఒప్పుకోరు. డాక్టర్లు వివరిస్తేనే అంగీకరిస్తున్నారు. ఇతర మందులు, విధానాల కంటే ఇన్హేలర్ ఉపయోగించడం చాలా ఉత్తమం. నెబులైజర్ వాడితే హాని ఉండదు. బిడ్డ ఇబ్బందిని బట్టి ఎలా ఇవ్వాలి? ఎన్నిసార్లు ఇవ్వాలి? అన్నది వైద్యులు చెబుతారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.
-డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్