న్యూఢిల్లీ: ఉగ్రవాద కుట్రలో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ దవాఖానలో అరెస్టయిన డాక్టర్ ముజ్జమిల్ షకీల్ 360 కిలోల పేలుడు పదార్థాలను నిల్వ చేయడం కోసం రెండు నెలల పాటు ఒక గదిని అద్దెకు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే వాటిని నిల్వ ఉంచిన తర్వాత అతడు మళ్లీ ఆ గదికి తిరిగి రాలేదని వారు చెప్పారు. ఢిల్లీ పేలుళ్లలో ఆత్మాహుతి దాడి చేసుకున్నాడని అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ షకీల్‌కు సహచరుడని వారు వెల్లడించారు. గది యజమాని వెల్లడించిన వివరాల ప్రకారం షకీల్ సెప్టెంబర్ 13-నవంబర్ 11 మధ్య కాలానికి గాను నెలకు రూ.1200 చొప్పున అద్దె చెల్లించాడు. మూడు రోజుల క్రితం జమ్ము కశ్మీర్, హర్యానా పోలీసులు షకీల్ గదిలో సోదాలు చేసి పేలుడు పదార్థాలను గుర్తించారు.
10 రోజుల క్రితమే కారుకు పొల్యూషన్ చెక్
న్యూఢిల్లీ, నవంబర్ 11: ఢిల్లీ పేలుడు ఘటనలో ఉపయోగించిన కారుకు సంబంధించి కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. సోమవారం బాంబు పేలుడుకు కారణమైన ‘ఐ20’ కారుకు 10 రోజుల క్రితమే పొల్యూషన్ చెక్ జరిపిన సంగతి బయటకొచ్చింది. అక్టోబర్ 29న ఓ పెట్రోల్ పంప్ వద్ద కారుకు కాలుష్య పరీక్ష చేస్తుండగా రికార్డయిన సీసీటీవీ వీడియో ఫుటేజ్‌ను పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ సీట్లో ఒక వ్యక్తి ఉండగా, మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి కారులో కూర్చోవటం వీడియోలో కనపడింది. ‘హెచ్ఆర్26 సీఈ 7674’ నంబర్‌తో రిజిస్ట్రేషన్ అయిన ఈ కారును తొలుత సల్మాన్ అనే వ్యక్తి 2014లో కొనుగోలు చేశాడు. అటు తర్వాత కారును దేవేంద్ర, సోనూ.. చివరిగా తారిఖ్ కొనుగోలు చేశారు. వీరి పేర్లేవీ ప్రభుత్వ రికార్డుల్లో నమోదుకాలేదు.