మన దేశంలో చాలామంది భోజనాలు పిండి పదార్థాల చుట్టే అల్లుకుని ఉంటాయి. అన్నం, ఇడ్లీలు, దోసెలు, ఊతప్పం, రోటీ వంటి ఆహార పదార్థాలు కడుపు నింపుతాయి. కానీ, మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను అంతగా అందించలేవు. కండరాల పెరుగుదలలో అవసరమయ్యే స్థూల పోషకాల్లో ప్రొటీన్ అత్యంత కీలకమైంది.
కానీ, చాలామంది తమకు తెలియకుండానే కార్బోహైడ్రేట్లు ఎకువగా, ప్రొటీన్లను చాలా తకువగా తింటున్నారు. కానీ, రోజువారీ ఆహారంలో మాంసం, గుడ్లు, జున్ను, పనీర్, పాలు, పెరుగు లాంటివి తప్పకుండా ఉండాలి. ఈ చిన్న మార్పు మీ భోజనాన్ని సమతుల్యం చేస్తుంది. అప్పుడు మీకు అవసరమైన ప్రొటీన్ సహజంగానే అందుతుంది. అందుకోసం మీ డైట్‌ని ఇలా ప్లాన్ చేసుకోండి.
అల్పాహారం: ప్రతిరోజు ఉదయం నాలుగు ఇడ్లీలు, చట్నీ తీసుకుంటున్నారని అనుకుందాం. దాన్ని రెండు ఇడ్లీలకు పరిమితం చేయండి. చట్నీ పరిమాణం తగ్గించండి. దీనికి ఇప్పుడు రెండు గుడ్లను జోడించండి. లేదంటే ఒక ప్రొటీన్ షేక్‌ను అదనంగా తీసుకోండి.
మధ్యాహ్న భోజనం: మీరు లంచ్ లో రెండు కప్పుల అన్నం, సాంబారు, ఒక కూర తీసుకుంటున్నారని అనుకుందాం. అన్నం ఒక కప్పు తీసుకోండి. అందులోకి కొద్దిగా చికెన్ లేదా పనీర్ కర్రీ యాడ్ చేయండి. లేదా ప్రొటీన్ రిచ్ కూరలు ఉండేలా ప్లాన్ చేయండి.
రాత్రి డిన్నర్లో: నాలుగు రోటీలు, ఒక కూర తీసుకునే వారనుకుంటే.. దాన్ని రెండు రోటీలకు పరిమితం చేయండి. ఎగ్ కర్రీ గానీ, టోపు, కాలె కర్రీలు గానీ తీసుకోండి. మష్రూమ్స్లోనూ ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్లాన్ చేసుకుంటే.. మీరు తినే ఆహారం మీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది.