Kamareddy : కామారెడ్డి జిల్లాలో ఇద్దురు చిన్నారులు అనుమానాస్పద విధంగా మరణించారు. ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు శనివారం ఉదయం అదృశ్యమవ్వగా.. వారిలో ఇద్దరు స్థానిక చెరువులో శవమై తేలారు. చెరువులోంచి అయాత్(7), మరియం(5)ల మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు. స్థానికులందరినీ షాక్కు గురి చేసిన చిన్నారుల మరణంపై తండ్రిని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆర్బీనగర్కు చెందిన ముగ్గురు చిన్నారుల అదృశ్యంపై వారి తండ్రి మాత్రం పొంతనలేని విధంగా పోలీసులకు సమాధానమిస్తున్నాడు. ఆటో డ్రైవర్ అయిన అతడు.. ఉదయం తన ఆటోలో పిల్లలను షాపు వద్ద దింపేసి.. కిరాయికి వెళ్లినట్టు చెబుతున్నాడు. చిన్నారుల్లో ఇద్దరూ చెరువులో విగత జీవులుగా కనిపించడంపై అతడిని ప్రశ్నించగా.. పిల్లలు ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడి ఉంటారని అంటున్నాడు. దాంతో.. అతడిని మరింత విచారిస్తే చిన్నారుల మృతి మిస్టరీ వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.