నకిరేకల్, నవంబర్ 11 : నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో భూతగాదా గొడవలో ఓ పెద్దమనిషి రూ.63 లక్షలు సుపారీ ఇచ్చి రౌడీషీటర్‌తో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు వెల్లడించారు. నకిరేకల్‌కు చెందిన ముద్దం బాలరాజుకు నోముల గ్రామానికి చెందిన సామ విక్రమ్‌రెడ్డితో పరిచయం ఉంది. విక్రమ్‌రెడ్డి కుటుంబానికి అదే గ్రామానికి చెందిన సామ సురేందర్‌రెడ్డితో భూ తగాదాలున్నాయి.
ఈ విషయంలో విక్రమ్‌రెడ్డి తండ్రి లింగారెడ్డిని బాలరాజు బెదిరించి రూ.23 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొద్దిరోజుల తరువాత డబ్బులు ఇవ్వాలని లింగారెడ్డి బాలరాజును నిలదీశాడు. దీంతో తన చిన్నమ్మ కొడుకైన నిడమనూరు మండలం ముకుందాపురానికి చెందిన దుంప సాయికృష్ణతో కలిసి లింగారెడ్డిని కలిసి ‘నీ కొడుకు విక్రమ్‌రెడ్డిని చంపేయాలని నల్లగొండ రౌడీషీటర్ మెంటల్ రాజేశ్‌కు రూ.40 లక్షలు సుపారీ ఇచ్చాడు.. మీరు రూ.60 లక్షలు ఇస్తే విక్రమ్‌రెడ్డిని వదిలేస్తా’ అని చెప్పడంతో భయపడిన లింగారెడ్డి తనకున్న 3 ఎకరాల నిమ్మతోటను అమ్మి రూ.63 లక్షలు ఇచ్చాడు.
కొద్ది రోజులకు మెంటల్ రాజేశ్ జైలులో ఉన్నాడని తెలుసుకుని, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాలరాజును ఒత్తిడి చేయడంతో రాజేశ్ కాదు ‘నేనే మిమ్మల్ని చంపేస్తా’ అని లింగారెడ్డిని బెదిరించాడు. ముద్దం బాలరాజు తనను బెదిరించి డబ్బులు తీసుకుని మోసం చేశాడని నాలుగు రోజుల క్రితం లింగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిరేకల్ పోలీసులు ముద్దం బాలరాజును అదుపులోకి తీసుకుని అతడి తమ్ముడు సాయిని అరెస్ట్ చేసి వారి నుంచి రెండు సెల్ఫోన్లు, మూడు కార్లు స్వాధీనపర్చుకుని రిమాండ్‌కు తరలించారు.