వెయ్యి అబద్ధాలాడి అయినా ఒక పెండ్లి చెయ్యాలని పెద్దలు చెప్పారు. కానీ అధికారం కోసం కాంగ్రెస్ నానా అబద్ధాలు చెప్పింది. అందులో ప్రధానమైనది రాష్ట్ర అప్పులు. రాష్ర్టాన్ని కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారంటూ అసత్య ప్రరా కాంగ్రెస్ ఇల్లెక్కి కూసింది. అయితే, కేసీఆర్ హయాంలో చేసిన అప్పుతో నిర్మాణాత్మకంగా ఖర్చు చేసి ఉత్పాదకత పెంచారు. వ్యవసాయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయి రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చారు. సంపదను పెంచడం, ప్రజలకు పంచడం అనే విధానం అవలంబించే నేత పాలన సాధించిన విజయం అది. కానీ అప్పు చేయడమే తప్పు అన్నట్టుగా నానా యాగీ చేసినవారు రెండేండ్లలో తలకు మించిన భారం తెచ్చిపెట్టారు. అప్పు చేసి పప్పుకూడులో రికార్డులు బద్దలు కొట్టారు. కానీ చేసిన పని శూన్యం. మరి చేసిన అప్పులు ఏమయ్యాయి? అంటే సర్కార్ దగ్గర సమాధానం లేదు, రాదు. చేతకాని, చేవలేని పాలన ఫలితం ఇది. గత పదిమాసాల కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సర్కార్ నిర్వాకానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నిలువుటద్దం పట్టింది.
ప్రభుత్వం చూపుతున్న ఆదాయ లెక్కల్లో ప్రధాన వాటా అప్పులదే. బడ్జెట్లో ప్రతిపాదించిన రాష్ట్ర వార్షిక ఆదాయం రూ.2,84,837 కోట్లు. అందులో పదినెలల్లో వచ్చింది 72 శాతమే కావడం గమనార్హం. గత పది నెలల్లో రాష్ర్టానికి సమకూరిన ఆదాయం రూ.2,07,558 కోట్లు, అయితే అందులో రూ.1,26,293 కోట్లు మాత్రమే పన్నుల ఆదాయం. గత బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయంలో 60 శాతం మాత్రమే వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎంత దారుణంగా ఉన్నదో తేటతెల్లం అవుతున్నది. సమారు రూ.70 వేల కోట్ల ఆస్తులను అమ్మడం ద్వారా లేదా అప్పులు చేయడం ద్వారా సమకూర్చుకున్నారు. అంటే అప్పులు చేయందే పూటగడవని దీన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరుకున్నది. పరులు అప్పు చేస్తే తప్పు, మనం చేస్తే ఒప్పు అనేది కాంగ్రెస్ విధానంగా కనిపిస్తున్నది. ఆదాయం పెరుగకపోగా వెనుకతట్టు పట్టింది. మరోవైపు అప్పులు మాత్రం బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే 130 శాతం పెరగడమే అందుకు నిదర్శనం. ఇది భావితరాలను రుణాల వలయంలోకి నెటివేయడం తప్ప మరోటి కాదు.
హామీల అమలు ఊసు లేదు. ప్రాజెక్టుల జాడలేదు. అభివృద్ధి కుంటుపడుతున్నది. సంక్షేమం సడుగులిరిగింది. అప్పులు మాత్రం కుప్పలుతెప్పలుగా పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ రూ.75 వేల కోట్ల అప్పు తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు రూ.72,658 కోట్లే. ఇక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై అవాకులు, చవాకులు చాలానే పేలారు కాంగ్రెస్ నేతలు. రూ.6 లక్షల కోట్లు, రూ.7 లక్షల కోట్లు అంటూ ఊదరగొట్టారు. 2024 మార్చి వరకు 31 వరకు కేసీఆర్ హయాంలో చేసిన అప్పు అక్షరాలా మూడున్నర లక్షల కోట్లు మాత్రమేనని కేంద్రం పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింది. అందులో ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా సంక్రమించిన రూ.70 వేల కోట్ల అప్పు, కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పు కూడా ఉన్నదని గుర్తుంచుకోవాలి. కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన సమాధానం వీళ్ల నోళ్లు మూయించడం విశేషం. కేసీఆర్, కాంగ్రెస్ పాలనల మధ్య ఉన్న తేడా అదీ.