సారంగాపూర్, మార్చి 3 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ నిరంకుశత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం నిజామాబాద్‌లోని తన నివాసం ప్రాంగణంలో బాజిరెడ్డికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపా రు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ..రెండున్నరేండ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నదని విమర్శించారు. హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డు తీరంలో ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న నిరుపేదల ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకొని, వారి బతుకులను బజారుకీడ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యమంటే నిరుపేదల ఇండ్లను కూల్చడమేనా అని మండిపడ్డారు. ఒక పక్కన ఇండ్ల కూల్చివేతకు గురైన బాధితులు తీవ్ర ఆందోళనకు గురై దిక్కుతోచని స్థితిలో తల్లడిల్లిపోతున్న సమయంలో, మరోపక్క కాంగ్రెస్ నాయకులు హోలీ సంబురాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని బాజిరెడ్డి తెలిపారు. ఎలాంటి ఇండ్లు కూల్చకుండానే త్వరితగతిన ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయడం అందరూ గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా, సీఎం రేవంత్‌రెడ్డి కాలయాపనతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన కొనసాగుతుందన్నారు. రైతు భరోసా మూడు దఫాల నుంచి ఎదురు చూస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మళ్లీ వచ్చేది కేసీఆర్ పాలనే..
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నా రు. ఇప్పటి పాలన తీరును చూస్తున్న ప్రజలు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశామనే బాధను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. మరో రెండేండ్లు ఓపికతో ఆత్మైస్థెర్యంతో ఉండాలని అన్ని వర్గాల ప్రజలు, రైతులకు విజ్ఞప్తి చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తంచేశారు.