నిజామాబాద్, మార్చి 3, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు రుణమాఫీ ప్రక్రియ అసంపూర్ణంగానే కొట్టుమిట్టాడుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేలాది మంది రుణాల రద్దు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తూతూ మంత్రంగా కొద్ది మందికే రుణాల మాఫీ ప్రకటించింది. చాలా మందికి ఆర్థిక మేలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షలు రుణాలు మాఫీ చేస్తామంటూ రైతులను పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఉసిగొల్పాడు. తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సాంకేతిక కారణాలు, కుటుంబంలో ఒకరికే వర్తింపు అనే నిబంధనలతో ముప్పు తిప్పలు పెడుతున్నారు.
సాంకేతిక కారణాలను పరిష్కరించి రుణాలను మాఫీ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభు త్వం తప్పించుకుంటోంది. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో? చెప్పాలంటూ బాధితులు నిలదీస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలని ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు హోదాలో బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి చూస్తున్నారు. వ్యవసాయ సలహాదారుడిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇరువురు కీలక నేతలున్నప్పటికీ రైతులకు మేలు జరగకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
దేవుళ్లపై ఒట్టేసి.. మాట తప్పి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 28 నెలలు కావొస్తుంది. 2024లో 4విడతల్లో రైతుల రుణమాఫీ వర్తింపజేశారు. రూ.2లక్షల్లోపు రుణాలు కలిగిన రైతులకు కటాఫ్ తేదీ ప్రకారం కొద్ది మందికే వర్తించింది. గతంలో కేసీఆర్ హయాంలో జరిగినట్లు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రుణాల మాఫీ చేయడం వల్ల గందరగోళం ఏర్పడింది. ఒకే ఊరిలో సగానికి ఎక్కువ మందికి రుణాలు మాఫీ కాలేదంటే అతిశయోక్తి కాదు. కుటుంబం యూనిట్‌గా పరిగణలోకి తీసుకుని రుణాలు మాఫీ చేయడంతోనే సమస్యలు వచ్చాయి. కొద్ది మంది రైతులకు సాంకేతిక తప్పిదాలు వెలుగు చూశాయి. అసలు రుణమాఫీ ఎవరికి వచ్చిందో తెలియదు. ఎవరికి రాలేదో అర్థం కావడం లేదు.
రుణమాఫీ వర్తించని వారికి ఏ కారణం చేత నిలిపేశారో? కూడా అంతు చిక్కడం లేదు. నెలల తరబడి రుణమాఫీ కోసం చెప్పులు అరిగేలా రైతులు తిరుగుతున్నారు. వ్యవసాయాధికారులను అడిగితే సమాధానం ఇవ్వడం లేదు. 2024లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్ నవసిద్దుల గుట్ట, బాసర సరస్వతి అమ్మవార్లపై ఒట్టేసి చెబుతున్నా… రూ.2లక్షల్లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటూ చెప్పగా అరకొరగానే అమలైంది. దేవుళ్లపై ఒట్టేయడంతో రేవంత్ మాటలు నమ్మి రైతులంతా కాంగ్రెస్‌కు మద్ధతు తెలిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా ఓటేసి నిండా మునిగి పోయామంటూ రైతులు వాపోతున్నారు.
లక్షలాది మంది బాధితులు..
కాంగ్రెస్ ప్రభుత్వం మొదట జూలై 18న రూ.లక్షలోపు రుణాలను రద్దు చేసింది. రెండో విడతగా జూలై 31న రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరలోపు రుణాలను రద్దు చేసింది. మూడో విడతలో ఆగస్టు 15న రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేసింది. సాంకేతిక సమస్యలతో రుణమాఫీ నిలిచి పోయిన వారికి మరో జాబితాను నవంబర్ 30న ప్రభుత్వం విడుదల చేసింది. ఇలా నాలుగు విడతలుగా రుణమాఫీ ప్రకటనలు వచ్చినప్పటికీ ఇందులో పేర్లు లేని రైతులు లక్షల్లో ఉన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రుణాల రద్దు కాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
కేసీఆర్ హయాంలో రుణమాఫీ జరిగిన లెక్కల ప్రకారం పోల్చితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2లక్షల 3వేల 520 మంది రైతులున్నారు. వీరిలో 1లక్షా 555 మందికి రూ.781కోట్లు పంట రుణాలు రద్దు చేయబడ్డాయి. 1లక్షా 2వేల 265 మందికి రుణమాఫీ కాలేదు. కామారెడ్డి జిల్లాలో 1లక్షా 76వేల మంది రైతులు రుణాలు తీసుకోగా ఇందులో 1లక్షా 1వేయి 417 మందికి రూ.736కోట్లు రుణమాఫీ వర్తించింది. 75వేల మందికి మొండి చేయి దక్కింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1.77లక్షల మందికి రుణమాఫీ అందాల్సి ఉంది. ఉభయ జిల్లాలో చాలా మంది రుణాలు రద్దు కాలేవని వాపోతున్నారు. కాంగ్రెస్ లీడర్లు కనిపిస్తే నిలదీస్తున్నారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.