హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులపై విద్యారులకు ఆసక్తి తగ్గుతున్నది. ఒకప్పుడు తీవ్ర డిమాండ్ ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రభ ఈ సారి అమాంతం పడిపోయింది. ఈ ఏడాది ఎంబీఏలో 57% సీట్లు మాత్రమే నిండాయి. ఎంసీఏ కోర్సు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ఈ కోర్సులో కేవలం 39% సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఐసెట్ మొదటి విడత సీట్లను మంగళవారం కేటాయించారు. ఈ సారి సీట్ల భర్తీ గణాంకాలు చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
రెండు కోర్సుల్లో కలిపి 36 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉంటే.. 19 వేల్లోపే సీట్లు భర్తీ కావడం ఈ రెండు కోర్సులకు గల డిమాండ్‌కు అద్దం పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 309 విద్యాసంస్థల్లో ఎంబీఏ కోర్సు నిర్వహిస్తుండగా.. మొత్తం 29,457 సీట్లకు 16,896 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 12,561 సీట్లు ఖాళీగా మిగిలాయి. మొత్తంగా 57% సీట్లు మాత్రమే నిండాయి. యాజమాన్యాలవారీగా పరిశీలిస్తే 280 ప్రైవేట్ కాలేజీల్లో 27వేల సీట్లకు 15వేలు భర్తీ కాగా, 12వేలు ఖాళీగా ఉన్నాయి. మొదటి విడతలో సీట్లు పొందిన వారు ఈ నెల 14లోపు ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.
ఎంబీఏతో పోల్చితే ఎంసీఏ కోర్సు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నది. రాష్ట్రంలోని 92 కాలేజీల్లో 6,784 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేవలం 2,630 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 39% సీట్లు మాత్రమే నిండాయి. ఏకంగా 4,154 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఎంసీఏ కోర్సు నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజీలు రాష్ట్రంలో 18 ఉండగా వీటిలో 1,076 సీట్లుంటే ప్రస్తుతం 753 సీట్లు నిండాయి. 323 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేట్ కాలేజీలు 74 ఉంటే వీటిలో 5,708 సీట్లకు కేవలం 1,877 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏకంగా 3,831 సీట్లు నిండలేదు. ఈ సారి ఐసెట్‌లో 46వేల మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో సగం మంది కూడా వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. 36,241 సీట్లుంటే కేవలం 21,097 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 20,469 మాత్రమే వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. అంటే ఉన్న సీట్ల సంఖ్య కంటే 15,772 మంది తక్కువగా కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అభ్యర్థులు తక్కువ.. సీట్లు ఎక్కువ అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది.
