హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీ చేయబోమని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు ఉప ఎన్నిక నిర్వహించబోమని గురువారం ధర్మాసనానికి నివేదించింది. ఎన్నికల పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ‘క్యాజువల్ వెకెన్సీ’గా పరిగణించడానికి వీల్లేదని, ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. ఈసీ వైఖరిని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు పీ విజయారెడ్డి 2024 జనవరి 20న ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనపై బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దానం నాగేందర్ విజయం సాధించినట్టు ప్రకటించడాన్ని ఆమె సవాలు చేశారు. దానం ఎన్నిక చెల్లదని ప్రకటించి, తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తీర్పు మేరకు ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్టు నోటిఫికేషన్ కూడా వెలువడింది. అయితే, ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించే ప్రతిపాదనను విజయారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆమె గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, దానం నాగేందర్, ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తన ఎన్నికల పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడకముందే ఉపఎన్నిక నిర్వహించడం చట్టప్రకారం సమంజసం కాదని ఆమె వాదిస్తున్నారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు 2011లో ఇచ్చిన తీర్పును తన వాదనలకు ఆధారంగా చూపుతున్నారు. గతంలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఖాళీ అయినట్టు పరిగణించడానికి వీల్లేదని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు ఖైరతాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయబోమని స్పష్టం చేశారు. ఈసీ ఇచ్చిన హామీని అఫిడవిట్ ద్వారా అధికారికంగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.