హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ‘నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయం నాకు తెలుసు. ఎవరో చెప్తే నేను పనిచేసే రకం కాదు’ అని పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో లీజుకిచ్చిన భూములను రెగ్యులరైజ్ చేశారని, టెస్సెరాక్ట్ సంస్థకు భూ కేటాయింపుల అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులకు సంబంధం లేదని పేర్కొన్నారు. సీఎం సోదరులకు భూ కేటాయింపులు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయాంలో ఎకరం రూ.90 లక్షలకు ఇస్తే, తమ ప్రభుత్వం రూ.కోటిన్నరకు ఇచ్చిందని తెలిపారు. బోర్డు నిర్ణయించిన దానికంటే రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదని అన్నారు. 32 మంది దరఖాస్తు చేసుకుంటే, అందులో ఒకటి టెస్సెరాక్ట్ కంపెనీకి నిబంధనల ప్రకారమే కేటాయించినట్టు వివరించారు. ఆ సంస్థతో సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు సంబంధం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం, ఐదు ఎకరాల్లో రూ.34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీని రూ.200 కోట్ల సంస్థగా కేటీఆర్ పేర్కొనడం ఆశ్చర్యంగా ఉన్నదని చెప్పారు. పీఎం ఏక్తామాల్ టెండర్లు పారదర్శకంగా జరిగాయని తెలిపారు.