Swashakti products | సంపాదన అంటే ఉద్యోగం ఒక్కటే కాదు! ఇంటిపట్టునేఉంటూ స్వయం ఉపాధితో డబ్బు సంపాదిం చడం కావచ్చు. తనతోపాటు మరో పదిమందికి ఆదాయ మార్గం చూపించడమూ కావచ్చు. అలాంటి ఓ మహిళా సంఘం.. స్వశక్తి ప్రొడక్ట్స్ . ప్రతి ఇల్లాలూ అన్నపూర్ణమ్మ అంశే! ఆ చేతితో గంజి కాచినా అమృతమే! ఇక అమృతాన్ని తలపించే మిఠాయిలో, నాలుకకు ఉత్తేజాన్నిచ్చే పచ్చళ్లో వండితే.. తిరుగే ఉండదు! ‘స్వశక్తి’ విజయ రహస్యమూ ఇదే.
కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి. ‘స్వశక్తి ప్రొడక్ట్స్’ పేరుతో అక్కడొక స్టాల్ ఉంది. ఓ పది మంది మహిళలు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుంటారు. వీళ్లంతా వివిధ స్వయం సహాయక బృందాలకు చెందినవారు. పొద్దున తొమ్మిది గంటలకే తలుపులు తెరుచుకుంటాయి. కొందరు కారం దంచుతారు. కొందరు మసాలాలు నూరుతారు. కొంతసేపటికి చికెన్, మటన్ కూరలు ఘుమఘుమలాడుతాయి. పక్కా తెలంగాణ రుచితో నాన్‌వెజ్ పచ్చళ్లు పెట్టి మార్కెట్‌కు పంపుతారు. ఏ కార్తిక మాసమో అయితే భక్ష్యాలను బల్క్ ఆర్డర్లో డెలివరీ చేస్తారు. కరీంనగర్‌కే పరిమితం కాకుండా.. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, ఢిల్లీ తదితర నగరాలతోపాటు దుబాయ్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకూ తెలంగాణ రుచులను పంపుతారు. అంతా వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినవాళ్లే. ఒక్కొక్కరిది ఒక్కో స్వయం సహాయక బృందం. దీప్తి, స్వప్న రాజశ్రీ స్వశక్తి సంఘానికి చెందినవారు. రేష్మది శ్రీబాలాజీ సంఘం, భాగ్యశ్రీది భువనశ్రీ స్వశక్తి సంఘం, మాధవిది శ్రీతులసి సంఘం. సరోజ, మాధవి, రమ, రజిత, అరుణ కూడా రకరకాల బృందాలకు చెందినవారే. అంతా కలిసి ‘ఉమాదేవి స్వశక్తి ప్రొడక్ట్స్’ అనే మహిళా స్వయం ఉపాధి సమాఖ్యను ఏర్పాటు చేశారు.
స్వయం సహాయక సంఘాల నుంచి తీసుకున్న రుణాలను, పొదుపు మొత్తాలను ఆర్థిక అభివృద్ధి కోసం కాకుండా వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటారు చాలామంది. అలా చేస్తే వడ్డీల భారం తప్పించి, ఎలాంటి ప్రయోజనమూ ఉండదని గ్రహించారు ఆ మహిళలు. పొదుపు మొత్తాన్ని వ్యాపార పెట్టుబడి కోసం మాత్రమే వినియోగించాలని తీర్మానించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌గా ఈ బృందానికి మార్కెటింగ్ ఆర్గనైజర్ అయిన దీప్తి కటకం ‘అతివ ఉమెన్ ఆర్గనైజేషన్’ అనే ఎన్జీవోను నడిపిస్తున్నది. మహిళలకు కుట్టుపని, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మాస్క్‌ల తయారీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నది. ఐకేపీ, మెప్మా వంటి ప్రభుత్వ అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఉపాధి మార్గాలు చూపుతున్నది. తన విధి నిర్వహణలో భాగంగా రోజూ ఏదో ఒక గ్రామం వెళ్లేది దీప్తి. స్వయం సహాయక బృందాల సభ్యుల్లో చాలామంది రుణంగా తీసుకున్న మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది. అలాకాకుండా, ఏదైనా వ్యాపారం మొదలుపెడదామని సలహా ఇచ్చింది. అందరూ సరేనన్నారు. ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చింది.. స్వశక్తి ప్రొడక్ట్స్ ప్రారంభమైంది. కుట్టుపని, మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, శారీ రోలింగ్, డ్రై వాషింగ్‌తో ప్రారంభమైన స్వావలంబన ప్రస్థానం రుచుల వ్యాపారం వరకూ వచ్చింది.
ఇంటివంట.. స్వశక్తి ప్రొడక్ట్స్ ప్రత్యేకత. శాకాహార, మాంసాహార చిరుతిండ్లు, పచ్చళ్లు చాలాచోట్ల దొరుకుతాయి. కానీ నాణ్యత, రుచి నాసిరకంగా ఉంటాయి. బిజీ జీవితాల్లో కమ్మని వంటలు చేసుకునే అవకాశం లేనివాళ్లకు అమ్మచేతి రుచి అందించాలన్నది వీరి సంకల్పం. అవసరమైన కారం, నూనె, ఉప్పు, మసాలాలు సహజ పద్ధతిలో ప్రాసెస్ చేస్తారు. నాణ్యత విషయంలో రాజీపడరు. దీంతో ప్రారంభించిన నెల రోజులకే భారీ ఆర్డర్లు వచ్చాయి. ఆ ఫలితాలను చూసి మహిళల ఉత్సాహం రెట్టింపు అయింది. తమ ఉత్పత్తులను కొరియర్, ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా డెలివరీ చేస్తున్నారు.
‘స్వశక్తి ప్రొడక్ట్స్’ కోసం సభ్యులు మొదట్లో ఒక్కొక్కరు ఐదువేల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టారు. చిన్నగా ప్రారంభించి ఆదరణను బట్టి పెద్దగా విస్తరించాలన్నది ఆలోచన. శాకాహార పచ్చళ్లతో ప్రారంభమైన వ్యాపారం క్యాటరింగ్ సేవలకు విస్తరించింది. నలుగురి ఆకలి తీరుస్తూ తమ కుటుంబాల ఆర్థిక అవసరాలూ తీర్చుకుంటున్నారీ మహిళలు. లాభాల్లో సభ్యులందరికీ సమాన వాటా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా స్వశక్తి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు వస్తున్నారు. ఈ మహిళా సమాఖ్యను ప్రోత్సహించాలని అనుకునేవారు 7989765351, 9700357708 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. ‘మీ ప్రోత్సాహమే మాకు బలం’ అంటారు స్వశక్తి నారీమణులు అనంతమైన ఆత్మ విశ్వాసంతో.
ఆలోచన రాగానే తలా కొంత డబ్బు సేకరించాం. అతితక్కువ సమయంలోనే అనుకున్నది సాధించాం. స్వయం సహాయక బృందం సభ్యులుగా మా ప్రయత్నానికి ఐకేపీ, మెప్మా అధికారులు అండగా నిలుస్తున్నారు. అడిషనల్ కలెక్టర్, ఇతర అధికారుల ప్రోత్సాహం మరువలేనిది. మహిళా చైతన్యానికి మా బృందమే నిదర్శనం. కొవిడ్ కష్టకాలంలో కూడా మేం నిలదొక్కుకొని దర్జాగా బతుకుతున్నాం. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాం.
– దీప్తి కటకం
✍ దాయి శ్రీశైలం
ఫొటోలు: అవుర్నేని బాలకిషన్ రావు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
Kattula lakshmi | అప్పుడు తుపాకి పట్టి అక్కగా మారింది.. ఇప్పుడు అనాథలకు అమ్మ అయింది
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..