e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News మూడేండ్ల క్రితం దాకా టీ పెట్ట‌డం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్ట‌ర్ చెఫ్‌

మూడేండ్ల క్రితం దాకా టీ పెట్ట‌డం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్ట‌ర్ చెఫ్‌

master chef krishna tejaswi
master chef krishna tejaswi

master chef krishna tejaswi | నిన్నమొన్నటి వరకూ వంటిల్లే మహిళ ప్రపంచం. ఇప్పుడు, ప్రపంచంతో పాటు వంటిల్లూ ఆమెదే. నలుగురికి వడ్డించిన చేతులతోనే నలభైమంది జిహ్వ చాపల్యం తీరుస్తున్నది. పాకశాస్త్ర ప్రయోగాలు చేస్తున్నది. కొత్త రుచులు ఆవిష్కరిస్తున్నది. నలభీముల సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోతున్నది. జెమిని టీవీ ‘మాస్టర్‌ చెఫ్‌ తెలుగు’ సీజన్‌ వన్‌ విజేత కృష్ణ తేజస్వి కథ కూడా ఇలాంటిదే. చదివింది ఇంజినీరింగ్‌ అయినా, అభిరుచి కొద్దీ రుచుల రంగంలోకి ప్రవేశించింది. ఆ ప్రయాణమంతా ఆమె మాటల్లోనే..

అమ్మ స్వర్ణ కుమారి రక్షణశాఖలో ఉద్యోగి. చెల్లి శ్రావణి ఇంకా చదువుతున్నది. నేను బీటెక్‌ చేశాను. హైదరాబాద్‌లోని మీర్‌పేటలో ఉంటాం. ఇంజినీరింగ్‌ నాలుగో ఏట వంటల పట్ల ఆసక్తి కలిగింది. కారణం, యూట్యూబ్‌లో నేను చూసే కుకింగ్‌ వీడియోలే. ఆ ఇష్టం కొద్దీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ప్రవేశ పరీక్ష రాశాను. మంచి ర్యాంకు వచ్చింది. కానీ, అమ్మ ఎందుకో వద్దని చెప్పింది. తనను బాధపెట్టడం ఇష్టం లేక.. దారి మార్చుకున్నాను. నేను ఫస్ట్‌క్లాస్‌ స్టూడెంట్‌ను కాకపోయినా, పట్టుపడితే మాత్రం ఏదైనా సరే సాధించి తీరుతాను. ఆ పట్టుదలతోనే ఆర్‌సీఐలో జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం సంపాదించుకున్నాను. అక్కడ అగ్ని-4, అగ్ని-5 రాకెట్స్‌ ప్రాజెక్టులో పాలుపంచుకున్నాను. అది కూడా సంతృప్తిని ఇవ్వలేదు. తర్వాత జపనీస్‌ నేర్చుకుందామని వెళ్లాను. ఆ కోర్సులో అడ్మిషన్లు పూర్తికావడంతో ఫ్రెంచ్‌ నేర్చుకున్నా. మళ్లీ మరో ఉద్యోగం. అది కూడా నాలుగు గోడల మధ్య కంప్యూటర్ల కొలువే. వాటి మధ్య నేనూ ఓ యంత్రంగా మారిపోవడం ఇష్టంలేక రాజీనామా చేశాను.

master chef krishna tejaswi
master chef krishna tejaswi

బేకింగ్‌ వైపు అడుగులు..

- Advertisement -

కంప్యూటర్లతో కాలక్షేపం కంటే, కిచెన్‌లో కుస్తీ పట్టడమే నయమని అనుకున్నా. ఈసారి అమ్మ అయిష్టంగానే సరేనంది. నైపుణ్యం పెంచుకోవడానికి వంటలకు సంబంధించిన కోర్సులు చేశాను. అందులోనూ హోమ్‌ బేకింగ్‌ ఆసక్తికరంగా అనిపించింది. నా గురించి తెలిసిన స్నేహితులు, బంధువులు పుట్టిన రోజులకు, పెండ్లిరోజులకు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. కొత్త రుచులతో, కొత్త డిజైన్లలో అందించేదాన్ని. క్రమంగా బిజినెస్‌ పెరిగింది. కేక్స్‌తో పాటు వంటలపై దృష్టిపెట్టా. వంటిల్లునే ప్రయోగశాలగా మార్చుకున్నా.

మాస్టర్‌ చెఫ్‌ కోసం..

ఏదో ఒకరోజు ‘ఇండియన్‌ మాస్టర్‌ చెఫ్‌’లో పాల్గొనాలని నా కోరిక. ఆడిషన్‌కు వెళ్లాను. కానీ ఎంపిక కాలేదు. కొన్నాళ్ల తర్వాత ‘తెలుగు మాస్టర్‌ చెఫ్‌’ కోసం కేక్స్‌, ఇతర వంటల ఫొటోలు పంపాను. నిర్వాహకులకు నచ్చడంతో షో కోసం బెంగళూరు ప్రయాణమయ్యాను. కాకలు తీరిన చెఫ్‌లు జడ్జీలుగా ఉన్నారు. ఎంతోమంది పోటీదారులు. నా వంటలే నన్ను ఒడ్డునపడేస్తాయన్న నమ్మకమే ధైర్యంగా అడుగు ముందుకు వేయించింది. మాస్టర్‌ చెఫ్‌లోకి అడుగుపెట్టే సమయానికి నేనేం ప్రొఫెషనల్‌ కుక్‌ కాదు. నా మొదటి వంట కుబానీ ఎక్లేర్‌ నుంచి చివరి ప్రయోగం పినోకొలాడ ఫ్లేవర్స్‌తో చేసిన ‘లబ్‌ లాష్‌’ వరకూ ప్రతి రౌండ్‌లోనూ ఓ కొత్త పాఠం నేర్చుకున్నా. పోటీదారుల నుంచీ కొంత నేర్చుకున్నా. రెండు నిమిషాల్లోనే దినుసులు ఎంచుకోవాలి. వంటకు గంట సమయమే ఇస్తారు. అందుకే ఎప్పుడూ ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు. టాస్క్‌ను బట్టి అప్పటికప్పుడు ప్రయోగాలు చేశాను. ప్రతి సవాలూ కష్టంగానే ఉంటుంది. అక్కడే మొదటిసారి సీఫుడ్‌ వండాను. వండటమే కాదు, ఆ వంటకు ఓ పేరు కూడా పెట్టాలి. అదొక సృజనాత్మకమైన కసరత్తు.

master chef krishna tejaswi
master chef krishna tejaswi

మిక్సీ రాలేదు కానీ..

మాస్టర్‌ చెఫ్‌ హౌస్‌లో అంతా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్‌ గ్యాప్‌లో గ్రూప్‌ డిస్కషన్స్‌ పెట్టుకునేవాళ్లం. ప్రతివారం ఒక్కొక్కరు ఎలిమినేట్‌ అయ్యేవారు. వీడ్కోలు సమయంలో గుండె బరువెక్కేది. అంతా ఒక కుటుంబంగా ఉన్నాం. ఈ షోలో నాకు చివరి వరకూ ఒక్క మిక్సీ కూడా రాలేదు. కానీ, ఫైనల్స్‌లో ఎవరికీ దక్కని గౌరవం అందింది. ‘గోల్డెన్‌ ఏప్రాన్‌’ నా సొంతమైంది. టైటిల్‌ అందుకున్న తర్వాత నా బాధ్యత మరింత పెరిగింది. చెఫ్‌లు మహేశ్‌ పడాల, చలపతి, సంజయ్‌ తుమ్మ చాలా ప్రోత్సహించారు. ఖాళీ సమయాల్లో పెన్సిల్‌ స్కెచ్‌లు వేస్తుంటా. ఆర్ట్‌ వర్క్‌ కూడా వచ్చు. చరిత్ర అంటే ఇష్టం. చారిత్రక ప్రదేశాలంటే మరీ ఇష్టం. అవకాశం వస్తే
ట్రావెలర్‌గా మారి, విభిన్న వంటకాలను పరిచయం చేయాలనుంది. మూడేండ్ల క్రితం టీ పెట్టడం కూడా రాని నేను టైటిల్‌ గెలువడానికి కారణం నా పట్టుదలే.

పాతిక లక్షలతో..

మాస్టర్‌ చెఫ్‌ తర్వాత నా ప్రయాణం మారింది. మా ఇంట్లో ఇప్పటివరకూ నాకు ఎలాంటి బేకింగ్‌ సెటప్‌ లేదు. కొన్ని సామాన్లు మాత్రమే ఉన్నాయి. పాతిక లక్షల ప్రైజ్‌ మనీతో ఆధునిక కిచెన్‌ డిజైన్‌ చేసుకుంటాను. నా కంటూ సొంత బ్రాండ్‌ సృష్టించుకుంటాను. నావైన వంటకాలను ప్రచారం చేసుకుంటాను. ఇప్పటి వరకూ వంట నా అభిరుచి మాత్రమే. ఇక నుంచి ఇదే నా వృత్తి, నా సర్వస్వం. మీకు వెరైటీ కేక్స్‌, డిజెర్ట్స్‌ కావాలంటే నా ఇన్‌స్టా పేజీ www.instagram.com/baking_by_krishna/, ఫేస్‌బుక్‌ పేజీ www.facebook.com/krishna.teja.98096/లో సంప్రదించండి.

✍ డప్పు రవి

ఫొటోలు : గడసంతల శ్రీనివాస్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

sheela bajaj | 78 ఏండ్ల వ‌య‌సులో వ్యాపారం మొద‌లుపెట్టిన బామ్మ‌

Kattula lakshmi | అప్పుడు తుపాకి ప‌ట్టి అక్కగా మారింది.. ఇప్పుడు అనాథ‌ల‌కు అమ్మ అయింది

వైక‌ల్యం వారి ప్ర‌తిభ‌కు అడ్డం కాలేదు.. మోడ‌లింగ్‌లో దూసుకెళ్తున్న కేర‌ళ యువ‌తులు

పిల్ల‌ల‌ను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్‌ప‌ర్సన్ స్వీయ అనుభ‌వం ఏంటంటే..

అత‌ని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశ‌మంత‌..

Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్‌స్పిరేష‌న్‌.. ఐఏఎస్ సాధించ‌డ‌మే కాదు..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement