ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను చైర్మన్‌గా ఎన్నికైనందున వెంటనే తనను చైర్మన్‌గా ప్రకటించాలని ఇప్పటికే సుదర్శన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు ఇబ్రహీంపట్నం ఎన్నికల అధికారి కూడా హాజరు కావాలని ఆదేశించగా.. వారు తమ వాదనలు వినిపించాల్సి ఉన్నది. మరోవైపు మున్సిపల్లో 19వ వార్డు నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి తనను బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ఇబ్బందులకు గురిచేశారని కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసుపై కూడా విచారణ జరుగుతున్నది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు 23వ వార్డు కౌన్సిలర్ నీలం శ్వేత, 21వ వార్డు కౌన్సిలర్ చిలుకల బుగ్గరాములుపై కూడా పలు ఆరోపణలు చేస్తూ ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకుగానూ 13 వార్డులు గెలుచుకున్న బీఆర్ఎస్కు ఓ బీజేపీ, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా ఉన్నది. అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా అధికార పార్టీ అడ్డు తగులుతుండటంతో అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నారని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ నెల 16న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అధికారులు నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి హాజరు కాలేదు. దానిని సాకుగా తీసుకొని కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కుటుంబసభ్యులు ఎన్నికల నిర్వహణకు అడ్డుతగలడంతోపాటు.. మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి కూడా జరిగింది. దీంతో ఎన్నిక 17న నిర్వహిస్తామని ఎన్నిక వాయిదా వేశారు. 17న ఎన్నిక జరుగుతుండగానే.. ఆకుల యాదగిరి కుమారుడు హైకోర్టులో ఏబీఎస్ కార్పస్ పిటిషన్ వేయడంతో కోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చింది. అప్పటికే చైర్మన్ ఎన్నిక నిర్వహించడంతో 14 మంది బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే హైకోర్టు నుంచి స్టే రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు.
బీఆర్ఎస్పార్టీ కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరి ఆ పార్టీ కౌన్సిలర్లతో కలిసి క్యాంపునకు వెళ్లారు. 16న నిర్వహించిన ఎన్నికకు ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు హైకోర్టులో ఏబీఎస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో న్యాయమూర్తి ఆకుల యాదగిరిని కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. అప్పటికే ఆకుల యాదగిరి కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లిపోయాడు. ఆయన నేరుగా కోర్టుకు వెళ్లి తనను మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డిలు కిడ్నాప్‌చేసి ఇబ్బందులకు గురిచేశారని కోర్టులో వాంగ్మూలమిచ్చారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం పూర్తిగా నిరాధారమైందని.. మిగతా కౌన్సిలర్లతో కలిసి ఆయన ఇష్టంతోనే వెళ్లారని బీఆర్ఎస్ తరపున న్యాయవాది వాదించారు. అయినప్పటికీ ఆకుల యాదగిరి వ్యవహారంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున చైర్మన్‌గా తనను ప్రకటించాలని సుదర్శన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వైస్ చైర్మన్ ఎన్నికను కూడా వెంటనే నిర్వహించాలని కోర్టును కోరారు. ఎలాగైనా చైర్మన్ ఎన్నికను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తుండగా.. బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసింది. ఇప్పటికే 17న మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన చైర్మన్ ఎన్నికకు సంబంధించిన వీడియోలను కోర్టుకు సమర్పించింది.