హైదరాబాద్, ఆగస్టు5 (నమస్తే తెలంగాణ): ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండబోదని ఆయనకు వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి పాటిల్‌ను ఆయన కార్యాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం బుధవారం ప్రత్యేకంగా కలిశారు.
తమ్మిడిహట్టి అంశంలో ప్రధానికి తాను రాసిన లేఖ, దానిపై పీఎంవో స్పందన అంశాలను ప్రస్తావించారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్ర్టాల మధ్య జరిగిన ఒప్పందాన్ని, ప్రస్తుతం బరాజ్ ఎత్తును 152 మీటర్ల ఎత్తులో నిర్మించే అంశంపై పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ నిర్వహించిన అధ్యయనాలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా కావాల్సినంత నీటిని వినియోగించుకోలేమని, 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. తొలుత కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి, ఆ తర్వాత రాష్ర్ర్టాల అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి పాటిల్ ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు.
ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌ను కూడా సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. సీఎం వెంట ఎంపీలు డాక్టర్ మల్లు రవి, వేంనరేందర్‌రెడ్డి, రామసహా యం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, గడ్డం వంశీకృష్ణ, అనిల్‌యాదవ్, కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదలశాఖ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ , నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు ఉన్నారు.