ఖలీల్‌వాడి, ఆగస్టు 5: మాజీ మంత్రి హరీశ్‌రావు చేతబడి చేశారని తాను అనలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేతబడి చేశారని అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే.
దీనిపై స్పందించిన మహేశ్‌గౌడ్.. అలా తాను అనలేదని స్పష్టంచేశారు. 70-80 సంవత్సరాల క్రితం చేతబడుల గురించి ప్రచారం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు సైన్స్‌తో పాటు అక్షరాస్యత పెరిగిందని తెలిపారు. బాంకీపూర్ ఓటమి బీజేపీకి చెంపపెట్టు అని, ఇది మోదీ పతనానికి నాంది అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నేతలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.