హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత బాగా పెరిగిపోవడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి ధర్మరాజు వెల్లడించారు. వచ్చే నాలుగైదు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరి గే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లిం గాపూర్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపారు. పొగ మంచు, శీతల గాలుల కారణంగా రాత్రి పూట చలి ఎకువగా ఉంటుందని వివరించారు.
ఈ నెల వాతావరణ నివేదిక ప్రకారం.. పగటి ఉష్ణ తీవ్రత తగ్గి.. రాత్రి సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించారు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గినప్పటికీ.. కనిష్ఠ తీవ్రత కొంచెం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెలలో పొడి వాతావరణం ఉంటుందని భావించినప్పటి కీ.. 1నుంచి 3 రోజులు చలి అధికంగా ఉం టుందని తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో చలి తీ వ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.