Sree Vishnu | శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంటోంది. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో నయన్ సారిక హీరోయిన్గా నటించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమా సందర్భంగా నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్లో శ్రీవిష్ణు సంచలన విషయాన్ని బయటపెట్టారు. సినిమా విడుదలకు దాదాపు రెండు నెలల ముందే ‘విష్ణు విన్యాసం’ లీక్ అయిందని ఆయన వెల్లడించారు. మొదట ఈ చిత్రాన్ని ‘మృత్యుంజయ్’తో ఒక్క రోజు గ్యాప్‌లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, ఆ తర్వాత వారం రోజుల తేడాతో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి ఓటీటీ ఒప్పందాలే కారణమని అందరూ భావించినా, అసలు కారణం సినిమా లీక్ అవడమేనని ఆయన స్పష్టం చేశారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ… “డిసెంబర్లో మా సినిమా పూర్తి కాకముందే లీక్ అయింది. ఎలా జరిగిందో తెలియదు కానీ అప్పటి వరకు షూట్ చేసిన భాగం అంతా బయటకు వెళ్లిపోయింది. వెంటనే కంప్లెయింట్ చేశాం. అప్పటికే కొన్ని క్లిప్స్ వైరల్ అయ్యాయి. దీంతో టీమ్ అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యాం. మిగిలిన షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి, తక్కువ సమయంలోనే సినిమా రెడీ చేయాల్సి వచ్చింది” అని తెలిపారు. హ్యాకర్లు నిర్మాతను బ్లాక్మెయిల్ చేశారని, ప్రతి రీల్‌కు డబ్బు డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు. “రిలీజ్‌కు ముందు వరకూ బెదిరింపులు వచ్చాయి. అయితే మా నిర్మాత ధైర్యంగా నిలబడ్డారు. జరిగినది చాలా సున్నితమైన విషయం. అయినా కూడా టీమ్ అందరూ కలిసి పని చేసి సినిమాను సమయానికి విడుదల చేయగలిగాం” అని అన్నారు.
సినిమా టాక్ గురించి మాట్లాడుతూ… “మార్నింగ్ షోకు మిక్స్డ్ టాక్ వచ్చినా, తర్వాతి షోల నుంచి మంచి గ్రోత్ కనిపించింది. ఫస్టాఫ్ యూత్‌కు, సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చుతోంది. యూఎస్‌లో నా కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు” అని చెప్పారు. నిర్మాత సుమంత్ నాయుడు కూడా లీక్ ఘటనపై స్పందిస్తూ… “మా యూనిట్ నుంచే తెలియకుండా సీన్స్ లీక్ అయ్యాయి. లీక్ చేసిన వ్యక్తులు వరుసగా వీడియో క్లిప్స్ పంపుతూ బ్లాక్మెయిల్ చేశారు. నెంబర్ ట్రేస్ చేసి ఛాంబర్లో కంప్లెయింట్ చేశాం. పరిస్థితి తీవ్రంగా మారడంతో మిగిలిన షూటింగ్ వేగంగా పూర్తి చేసి సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. ఇది ఎలాంటి పోటీ నిర్ణయం కాదు” అని తెలిపారు.మొత్తానికి విడుదలకు ముందే లీక్ సమస్యను ఎదుర్కొన్నప్పటికీ, టీమ్ సమన్వయంతో ‘విష్ణు విన్యాసం’ను సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషంగా చెప్పుకోవాలి.