Katha – 2022 | మండల హెడ్‌క్వార్టర్ పోచారంలో.. ఆరోజు పొద్దున్నే ఊరంతా మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. కాటన్ జెండాలు, బైకులకు పెట్టే చిన్నపాటి జెండాలు, ఊరంతా ఆకుపచ్చ రంగు జెండాలు కడుతూ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
బర్రెల పాలు పితికి క్యాన్లలో పోస్తున్న ఉస్మాన్ దగ్గరికి, ఏడేళ్ల కొడుకు తబీర్ పరిగెత్తుకొచ్చాడు.
“అబ్బూ! రేపు మిలాదున్నబీ పండగంట. నేను గూడా జెండాలు పట్టుకొని నా దోస్తుల ఎంట పోతా!” అంటున్న కొడుకు బుజ్జి మాటలు విని.. చివుక్కుమంది ఉస్మాన్ మనసు. తన ఉత్సాహం చూసి ‘వద్దు!’ అనలేక, ‘అవునూ!’ అనలేక పాల క్యాన్లు పక్కన పెట్టి తర్జనభర్జన పడుతున్నాడు!?
‘పసితనం! ఏది వాస్తవం? ఏది అవాస్తవం? అని ఎలా చెప్పాలి? చెప్పినా తనకు అర్థం చేసుకునేంత పరిపక్వత లేదాయె. మిలాదున్నబీ అంటే మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు. కానీ, జెండాలు పట్టుకొని ‘నారే తక్బీర్ అల్లాహు అక్బర్’ అంటూ మూకుమ్ముడి నినాదాలు ఇచ్చుకుంటూ.. ఊరేగడం ఎంతవరకు కరెక్ట్?’ అనేది అతణ్ని తొలుస్తున్న ప్రశ్న?
ముప్ఫై ఏళ్ల అనుభవంలో మిలాద్-ఉన్-నబీని ఇంత ఘనంగా జరపడం అతను చూళ్లేదు. ఇప్పుడు తను వద్దని వారిస్తే.. చిన్ని హృదయం గాయపడుతుంది. తన తోటి పిల్లలంతా వెళ్తుంటే.. వాళ్లతో తనూ వెళ్లి, పండుగను మరింత కన్నుల పండుగ చేసుకోవాలనే పసి కుతూహలం అది.
కానీ, అదే వాస్తవం అనుకొని.. ఆ అబద్ధాన్ని అతను ప్రతీ సంవత్సరం వేడుకలా చేసుకుంటూ.. దాన్ని తన తర్వాతి తరాలకు మోసుకుపోతే? ఇప్పుడు ఖండించకపోతే తండ్రిగా తప్పు తనదే అవుతుందని అనుకున్నాడు? ‘లేనిదాన్ని ఉందని భ్రమించి బతకడం కన్నా, వాస్తవం ఎంత మస్క మస్క ఉన్నా.. దాంతోని నడుసుడే కరెక్ట్. కానీ, నా కొడుక్కు ఎట్లా చెప్పాలె? వద్దంటే వాడు అలుగుతడు. ఎట్లా?? అవునంటే.. ఆ పైత్యాన్ని లైఫంతా మోస్తే!’ అనుకుంటూ ఎంతోసేపు ఆలోచించాడు.
“బచ్చేకి ఖ్వాయిష్ కో మత్ మారో!” అంటూ అక్కడికొచ్చి అంటున్న సబీనా మాటతో.. అన్యమనస్కంగానే ఏకీభవించి, కొడుకు మాటకు పచ్చజెండా ఊపాడు.
ఉదయమే.. చేతిలో పచ్చజెండా! చెంపలకు అరబ్బీ అక్షరాలతో ఉన్న పచ్చని మెరుపు స్టిక్కర్లు! తల చుట్టూ పచ్చని బట్ట. మెడలో పచ్చని కండువాతో ఇంటికొచ్చాడు కొడుకు.. తన స్నేహితులతో! ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందం వాడిలో. అలా చూసి నిట్టూర్చి.. నవ్వలేక నవ్వి, కొడుకు తల నిమిరాడు.
“మేరే సోనేకా పోతా” అంటూ బానోబీ మనుమణ్ని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకుంది.
తల్లి కూడా కొడుకును ఆ గెటప్‌లో చూసి, తెగ ఆనందిస్తూ.. ఫోన్లో ఫొటోలు తీసుకుంటున్నది.
ఆ ఉదయం ఊరంతా పచ్చని బైరాగులు.. బైకుల మీద, సైకిళ్ల మీద పచ్చని జెండాలతో యాత్ర తీశారు. నినాదాలతో హోరెత్తించారు.
ఉస్మాన్ ప్రతి సంవత్సరం అందరితో కలసి ‘జగ్నేకి రాత్’ సందర్భంగా మసీదులో ప్రార్థనలతో మిలాద్- ఉన్-నబీని జరుపుకొనేవాడు. కానీ, దాన్ని రానురానూ ఊరేగింపుగా మార్చేశారు. అరుపులు, కేకలే.. ప్రవక్తకు ఇచ్చే కానుక అనుకుంటున్నారు. ఈ విషయంలో ఖురాన్ ఏం చెబుతున్నదని చూశాడు. విజ్ఞుల ద్వారా వాస్తవాలు ఏంటో గ్రహించాడు. దిఖావా, జులూస్లను ఇస్లాం ఏమాత్రం అంగీకరించదనే నిజాన్ని తెలుసుకున్నాడు. వేడుకగా సాగుతున్న ఆ ఉత్సవానికి అలా అలా దూరం అవసాగాడు ఉస్మాన్. తనకు తెలిసిన వాస్తవాన్ని ఊరందరికీ చెబితే.. ఇలాంటివి ఇక ముందు చేయరని భావించాడు. మరునాడు రాత్రి పోచారం మైనార్టీ వాట్సాప్ గ్రూపులో ఓ మెసేజ్ ఫార్వార్డ్ చేశాడు.
‘ఇస్లాంకు సంబంధంలేని ఈద్.. మిలాద్-ఉన్-నబీ! అంటే రబీవుల్ అవ్వల్ నెల 12వ తారీఖున ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు పేరిట కొందరు సోకాల్డ్ ముస్లింలు రోడ్లపై పచ్చ జెండాలు పట్టుకుని.. ఊరేగింపులతో సంబురాలు చేసుకుంటూ, పండుగలా నిర్వహించే తంతు.. ఇస్లాంతో ఏమాత్రం సంబంధం లేని ఆచారం అన్నది ముస్లిములే కాదు ముస్లిమేతరులు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అసలే ఆ తారీఖున ప్రవక్త జన్మించారనడానికి ఎక్కడా కూడా ఒక్క సరైన ఆధారం లేదు. ‘కొత్తగా కల్పించబడే విషయాల పట్ల చాలా జాగ్రత్త వహించండి. అలాంటి ఆచారాలేమైనా ప్రవేశించినట్లు కనుగొంటే మీరు నా సున్నత్‌ను మరియు సరైన మార్గనిర్దేశనం చేసే నా ఖలీఫా సంప్రదాయాన్ని మాత్రమే అనుసరించాలి- (తిర్మిదీ 2676). ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రోడ్లపై పచ్చ జెండాలు పట్టుకుని ఊరేగింపులు చెయ్యడం, రాత్రిళ్లు మసీదులను లైట్లతో వెలిగించేసి ఆయన పేరుతో ఖవ్వాలీలు పాడేసి గందరగోళం చెయ్యడం లాంటి పనులు.. ప్రవక్త కాలంలో ఆయన శిష్యులు (సహాబాలు) ఎప్పుడూ చెయ్యలేదు’ అని టైప్ చేసి.. ఆ గ్రూపులో పెట్టాడు.
కానీ, అతని అంచనా తలకిందులైంది! ఆ మెసేజ్ చదివి ఆ గ్రూపులోని వారంతా వీరావేశంతో ఊగిపోసాగారు. ‘హుజూర్ పే గుస్తాఖీ కర్నేవాలా ఇబ్లీస్’ అని అతనికి పేరు పేట్టేశారు. మరికొందరు ‘పకోడా’ అని అన్నారు. అందరూ తెగ తిట్టేస్తున్నారు.
‘ఈ విషయంలో ఆలోచించాలి!’ అని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. విపరీతంగా యాంగ్రీ ఎమోజీలు పంచుకుంటున్నారు. కానీ, ఉస్మాన్ ఏ సంఘాన్నీ నమ్మడు. ప్రామాణిక గ్రంథాల ఆధారంగా నడుచుకోవడమే అతని నైజం. ఆ మెసేజ్ వెంటనే డిలీట్ చెయ్యాలని ఉస్మాన్‌కు ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. కానీ, ఉస్మాన్ తన మాట మీద నికార్సుగా నిలబడ్డాడు. డిలీట్ చేయలేదు. దీంతో గ్రూప్ అడ్మిన్ మీద డిమాండ్ పెరిగింది. అడ్మిన్ వెంటనే ఉస్మాన్ మెసేజ్ డిలీట్ చేసి.. అతణ్ని గ్రూప్‌లోంచి తొలగించాడు.
* * *
ఉదయాన్నే ఉస్మాన్ ఇంటికి అతని బాబాయ్ షర్ఫొద్దీన్ చిర్రుబుర్రులాడుతూ వచ్చాడు.
“క్యారే మియా క్యా కర్రా తూ? దిమాక్ ఉందా నీకు. ఊరందరినీ నారాజ్ చేసినవ్. ఏది ఎట్లుంటే నీకెందుకోయ్? నలుగురుతోని నారాయణ అనక ఏంది గ్రూపుల నీ ఉల్లిగడ్డ లొల్లి గాకపోతే” అంటూ గదమాయించాడు.
“ఉన్నదే చెప్పిన చాచా! మనం నడుస్తున్న తొవ్వ గలత్. సక్కటి తొవ్వల నడవాలని సలహా ఇచ్చిన” నింపాదిగా అన్నాడు ఉస్మాన్.
“ఏందిరా గలత్? పెద్దమన్సులు ఏది చేసినా మన మంచికే చేస్తరు”.. బానో బీ కూడా కొడుకు మీద విరుచుకుపడింది.
“అయినా నీకెందుకే గవన్నీ. నీకిష్టం లేకపోతే పోకపోనుంటివి. అంతేగానీ ఇట్ల ఊరందరి మనసు ఇరగొడ్తవా? నీకు పనేం తోస్తలేనట్టుంది”.. భార్య కూడా అటునుంచే సైడ్ తీసుకుంది.
ఉస్మాన్ హతాశుడయ్యాడు!?
“చాచా! గా పార్టోళ్లు హనుమాన్ జయంతి వేడుకలు చేసి మనలను తిడుతున్నరు. మనంగూడ వాళ్లను మండియ్యనీకి మన మిలాదున్నబీ జులూస్ ఘనంగ జెయ్యాల్నని జాకీర్గాడు వాని దోస్తులతోని అనంగ నేనిన్న. ఒక వేడుకను అందరు సూశి సంబురవడాలె గానీ, బాధ పడొద్దే! అయినా ఒకర్ని మండియ్యాల్నని మనం మన హుజూర్ పండుగను వాడుకోవాల్నా? తప్పు గదా? గందుకే దీన్ని ఎటో తీస్కపోయేటట్టు ఉన్నరని.. అథెంటికల్గా బాగా రీసెర్చ్ చేసి, రాసిన మెసేజ్ గ్రూపుల పెట్టిన.. గంతే! మనది గాని ఆచారాన్ని మల్ల మీదికెల్లి ఇంకొకర్ని మండియ్యాల్నని మనం వేడుక చేసుకునుడు మంచిది గాదని చెప్పిన”.. ఉస్మాన్ స్వరంలో నికార్సు.
“ఆ చెప్పినవ్ తియ్. ఇప్పటికే గా పార్టోళ్లు మన మీద లేనిపోని నిందలేస్తున్నరు. పచ్చి బూతులు తిడుతున్నరు. మనూర్ల గూడ జమై ఊరోళ్ల మనసులల్ల మన మీద ఇసం వెంచుతున్నరు. గిసుంటి యాల్ల మనం ఒకటై ఉండాలె గనీ, నువ్వు గూడా గా పార్టోళ్లు మాట్లాడినట్టే మాట్లాడినవురా!” షర్ఫొద్దీన్ కూడా స్వరం పెంచాడు.
“వాళ్లు అడ్వ పని జేశిర్రని వాళ్లను సూశి లేనిదాన్ని ఉన్నదని కల్పిచ్చుకొని మనం ఎల్లాడుడు ఎట్ల కరెక్ట్ అయితది?”.
“ఎహె పోరా! నీతోని మాట్లాడుడు నా తప్పే. వాళ్లు అన్నట్టు నువ్వు ఇబ్లీస్ గానివే!” అంటూ అక్కడి నుంచి రపరపా వెళ్లిపోయాడు షర్ఫొద్దీన్.
“నువ్వు జేసిన పనికి నాకు ఈ ఇంట్ల, ఈ ఊర్ల గూడ ఉండబుద్ధి అయితలేదురా. అల్లా నాకు సావిచ్చినా బాగుండు” అంటూ కోపంగా కళ్లెర్రజేసింది బానోబీ.
సబీనా కూడా ఉస్మాన్‌ను కోపంగా చూస్తూ విసవిసా లోపలికి వెళ్లిపోయింది. లోకం తెలియని తన కొడుకు మాత్రం మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో తెచ్చుకున్న పచ్చజెండాను చూస్తూ మురిసిపోతూ ఆడుకుంటున్నాడు.
కొడుకును అలా రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.
‘మతం మత్తు ముందు సరదాగనే మొదలైతది. అది ముదిరితేనే మతోన్మాది అయితడు. ఒక మతోన్మాది ఈ ప్రజాస్వామ్య దేశానికి శానా ప్రమాదం. ఇసుంటి ప్రమాదకారుల్ని పార్టీలు మంచిగ వాడుకుంటై. నా కొడుకు అట్ల కావొద్దు. నాలెక్క అంబేద్కర్ ఆశయాలను ఫాలో గావాలె. ప్రజాస్వామ్య బద్ధంగా మెలగాలె. పుట్టినం గావట్టి సచ్చిందాక మతాన్ని నామ్కేవాస్తే.. వితౌట్ పైత్యంతోని ఫాలో అయితే సాలు!’ అనుకొని అలా కుర్చీలో కూలబడ్డాడు.
‘భ్రష్టాచారాలను ఫాలో అయి ఇన్సాన్లను కష్టపెట్టేటోళ్లు గదా అసలైన ఇబ్లీస్లు. నేను సచ్చా ఇన్సాన్‌ను!’ మనసులోనే ధీమాగా అనుకున్నాడు.
ఆ రాత్రంతా తన వాట్సాప్ నంబర్‌కు కులపోళ్లు వరుసగా తిడుతూ టెక్ట్స్ మెసేజులు, వాయిస్ మెసేజులు పంపుతున్నారు. చూస్తున్నాడు కానీ, ఎవరికీ జవాబు ఇవ్వలేకపోతున్నాడు.
మర్నాడు జుమా నమాజ్ అనంతరం ఉస్మాన్ కుటుంబాన్ని బహిష్కరిస్తూ ఫత్వా జారీ చేశాడు సదర్ మీరాంసాబ్.
“ఉస్మాన్ ఇంటికి ఈరోజు నుంచి డోలా బంద్, దావత్ బంద్. ఎవరు గూడ వాళ్లకు దావతులు ఇయ్యద్దు. శుభకార్యాలు, సావులకు పోవద్దు, రావద్దు. మసీద్, కబ్రస్తాన్, గడ్డమీదున్న సయ్యద్ షాదుల్లా హుస్సేనీ బాబా దర్గాకు రావొద్దు. వాళ్లింటికి మసీద్ చందా గూడ అడగొద్దు. ఉనో మాఫీ చాహేతో సోంచేంగే!’ అని ఊరందరికీ వినిపించేలా మైకులో అనౌన్స్ చేశారు. అప్పటికే మసీదులో నమాజ్ చదివిన ఉస్మాన్‌కు తీవ్ర అవమానంగా అనిపించింది. అందరూ తనవైపే గుడ్లురిమి చూస్తున్నారు. అక్కడ ఏం మాట్లాడకుండా గమ్మున ఇంటికి వచ్చేశాడు.
* * *
జరిగినదాని గురించి బాధపడుతూ తన పనులను వాయిదా వేసుకోవడం మంచిది కాదనుకున్నాడు ఉస్మాన్. వంద గజాల స్థలంలో తాతల కాలంనాడు కట్టి, శిథిలావస్థకు చేరిన తమ పెంకుటిల్లును కూల్చేసి.. అక్కడే ఒక కొత్తిల్లు కట్టాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. తన సంపాదనతో కొత్తిల్లు కట్టుకోవాలనేది అతని జీవిత లక్ష్యాల్లో ఒకటి. కానీ, అమ్మ బానోబీ అందుకు అస్సలు అంగీకరించలేదు.
“నేను ఈ ఇంట్లకు కోడలుగ వచ్చిన. ఇద్దరు మర్దులు, ముగ్గురు మర్దన్లు, ఉన్న ఒక్క కొడుకువు నీది, నీ ఇద్దరు చెల్లెండ్ల లగ్గాలు చేసిన. ఈ ఇంట్ల సావులు, శుభకార్యాలు ఎన్నో చేసి.. ఈ ఇంట్లనే ముసల్దాన్ని అయిన. మీ నాయిన గూడ ఈ ఇంట్లనే జీవిడ్శిండు. నేను గూడ ఇన్లనే జీవిడుస్త. అప్పుడే నా బతుక్కు ఒక అర్థం పరమార్థం!”.. ఖరాఖండిగా చెప్పింది కొడుకుతో.
ఇంటి విషయంలో తల్లిని ఒప్పించడం కత్తిమీద సామే అయ్యింది అతనికి.
“ఇల్లు బందవస్తు ఉండుంటే దాని జోలికి పోతనమ్మా! దాంతోని మనకు జోకం ఉన్నది. మీదికెల్లి పాతవడి లుకలుక అయింది. అయినా నేను జాగ అమ్ముతలేను గదా. పాతిల్లు కూలగొట్టి.. కొత్తిల్లు కడ్తనంటున్న గంతే! మనకు మంచిది కానప్పుడు ఏదైనా ఇడ్సవెట్టుకోవాలె గానీ, దాని సూరు వట్టుకొని యాలాడద్దు!” అని సర్ది చెప్పాడు.
తన మాట ఇంక కొడుకు వినేలా లేడని తన పంతం విరమించుకుంది బానోబీ. తన కలల పొదరిల్లును కూల్చితే తన అంతరం కూడా కూలిపోతుందనే ముభావంలో పడిపోయిందామె. ఆ ఇంటితో అల్లుకున్న తన జ్ఞాపకాలు అభివృద్ధి పాదం కింద పడి నలిగిపోతాయని, ఇంకా కొత్తింటి పని మొదలవకుండానే అంతా కోల్పోయినదానిలా ఉండసాగింది. అలా అమ్మ అయిష్టంతోనే పాతింటి స్థానంలో కొత్తిల్లు కట్టాలని నిర్ణయించుకున్నాడు ఉస్మాన్.
* * *
మరునాడు ఉదయం చాయి తాగి.. బయటికి వెళ్లడానికి సిద్ధమవుతున్నది బానోబీ. ఆమెను చూస్తూ.. “నేను సంపాదిస్తున్న గదనే! ఇంకా గా అంగన్వాడీల వంటపని ఎందుకు జేస్తవ్? మానెయ్యరాదు. కొడుకు గంజి పోస్తలేడని, తల్లి ఇంకా రెక్కలు వంచి కష్టం జేసుకొని బతుకుతున్నదని నన్ను బద్నాం జెయ్యనీకా?”..
ఈ మాటను ఉస్మాన్ తల్లితో చాలాసార్లు అన్నాడు. కానీ, బానోబీ అస్సలు వినలేదు. కొడుకు వైపు మిర్రున చూసింది.
“కొడుకు తెచ్చిపెడ్తే కూసుండి తినేదాన్ని గాదు నేను. నేను రేపు సస్త అనంగ గూడ ఇయ్యాల్ల పని జేస్తరా. నాకు పని లేకపోతే ఏం తొయ్యది. ఎప్పటికి రెక్కలు ఆడుతనే ఉండాలె. మీ నాయిన పోయినంక ఈ రెక్కలతోనే చెల్లెండ్లను, నిన్ను సాదిన. పనికి ఇలువ ఇయ్యాలే బేటా. ఇల్లు కూలుతున్నది గావట్టి కొత్తిల్లు కడ్త అంటే ఊకున్న గనీ.. నా రెక్కలు ముడిసి బుర్కల కూసుండ వెడ్తనంటే నేనస్సలు ఇనరా!” ఎప్పటిలానే తన మాటే శాసనంలా చెప్పేసి, అంగన్వాడీ స్కూలుకు బయల్దేరింది.
అంగన్వాడీలో ఆయాగా వంటపని చేస్తుంది బానోబీ. డబ్భు ఏళ్ల వయసుకు దగ్గర్లో ఉంది. అయినా తరగని ఆత్మవిశ్వాసం ఆమెలో. అంగన్వాడీ పనైపోగానే పొలంలోకి వెళ్లి ఏదో ఒక పని చేసి వస్తుంది.
దురదృష్టవశాత్తూ ఆరోజు స్కూల్లో వంట చేస్తున్న బానోబీకి అకస్మాత్తుగా బీపీ పెరిగి పక్కన పడిపోయింది. దీంతో కటి ఎముక విరిగి పూర్తిగా మంచానికే అంకితం అయింది. హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రుల్లో చూపించాడు ఉస్మాన్. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దానికి తోడు షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలు.. ఆ వృద్ధ ప్రాణాన్ని మరింత వేధించసాగాయి. తల్లి అనారోగ్యంతో కొండే కూలినట్టయ్యింది ఉస్మాన్‌కు. దాంతో కొత్తింటి పనిని పూర్తిగా మరిచిపోయాడు.
* * *
ఎంబీఏ చేసిన ఉస్మాన్‌కు హైదరాబాద్‌లో ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ, ఊళ్లో అమ్మను చూసుకునేవారు ఎవరూ లేరని ఊరికే వచ్చేశాడు. వ్యవసాయంతోపాటు పశువులతో పాల వ్యాపారం చేసుకుంటూ.. ఊళ్లోనే హాయిగా ఉండసాగాడు. మేనమామ కూతురైన సబీనాను ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఒక కొడుకు, కూతురు పుట్టారు. హాయిగా సాగిపోతున్న అతని పల్లె జీవితంలో అనుకోని కుదుపులు! అమ్మ అనారోగ్యం, కులపోళ్ల అసుర్లు విసుర్లను అంత ఈజీగా మర్చిపోలేక పోతున్నాడు. సంఘంలో ఒంటరివాణ్ని చేశారనే వాస్తవం పదేపదే గుర్తొచ్చి మానసికంగా నలిగిపోతున్నాడు.
‘పాత ఇంటి విషయంల అమ్మను అప్డేట్ చేసిన. అట్లాంటి బూజుపట్టిన ఆచారం విషయంల వీళ్లెందుకు అడ్జస్ట్ అయితలేరు? మతాచారాలు అప్పటి కాలానుగుణంగా ఏర్పరుచుకున్నయి. అవి ఈ కాలానికి నప్పయి గదా?’.. అతని మనసు పదేపదే తననే బలపరుస్తున్నది.
చీకటి పడుతుండగా ఇంటికెళ్లేసరికి.. తనదైన ప్రపంచంలో ఉన్నాడు కొడుకు.
“అబ్బూ!” అని పిలుస్తున్నా పలక్కుండా, మంచంలో జీవచ్ఛవంలా నిద్రిస్తున్న అమ్మను చూస్తూ లోపలి అర్రలోకి వెళ్లాడు.
కొడుకు తర్వాత ఆలస్యంగా పుట్టిన ఆరు నెలల తన కూతురు చాప మీద బోర్లా పడుకొని ఆడుకుంటున్నది. కరెంట్ పోవడంతో చిమ్నీ వెలిగించింది సబీనా. గిన్నెలో అన్నం పెట్టింది. రుచించడం లేదు. కరిచినట్టు నాలుగు ముద్దలు తిన్నాడు. పక్కమీద వాలిపోయి పైన దూలాలను చూస్తున్నాడు. రెండు చిట్టెలుకలు దూలాల మీద అలికిడి చేస్తున్నాయి.
అప్పుడే పిల్లలిద్దరినీ తీసుకుని పక్కమీదికి వచ్చింది సబీనా. తబీర్ పడుకున్నాడు. పాప.. తల్లి పక్కలో పాలు తాగుతున్నది. పాపను జోకొడుతూ భర్తను చూసింది.
“మనకు ఎవలతోనీ లొల్లులు, పంచాదులు వద్దు. గాడ ఝాన్సి లింగాపూర్ల చెట్ల మందు పోస్తరట. అత్తమ్మను ఆడికి కొంటవోయి మందు పోపిచ్చుకద్దాం. ఇరిగిన బొక్కలు అతుకుతయట!” అంటున్న భార్య ముఖంలోకి చూసి..
“సరే!” అంటూ తలూపాడు.
సబీనా పిల్లల వైపు మరలి పడుకుంది. ఉస్మాన్‌కు ఎంతకూ నిద్ర రావడంలేదు. కొడిగట్టిన చిమ్నీ మసక వెలుగులో అతణ్ని మళ్లీ ఆలోచనలు ముసురుకున్నాయి. కులపోళ్లు తన కుటుంబాన్ని బహిష్కరించడం గుర్తొచ్చి అతని కాలేయం కదిలిపోసాగింది.
‘తప్పు చేసిన్నా నేను? మరి నేను వాళ్లను వీళ్లను అన్ననా.. తమ ఆస్తిగా, స్వర్గానికి రూటుగా భావించే ప్రవక్తను గదా అన్న. ప్రవక్త మీద ఎవరు నోరు జారినా.. తల్కాయలు లెపేస్తమంటున్నరు. అసుంటాయిన జోలికి పోతినని వాళ్లకు కోపమా? నన్ను సంపుతం, నర్కుతం అనైతే అనలేదు వాళ్లు. అయినా నేను ప్రవక్తను తిట్టిన్నా ఏంది? లేదుగదా.. ఆ పెద్దమన్షిని వట్టుకొని వాళ్లు జేస్తున్నది తప్పు అని చెప్పిన గంతే గదా? అయినా మీ రూపాలే లేనప్పుడు గీ ఊరేగింపులేంది కథ గాకపోతే? ఒకోళ్లను సూశి ఇంకొకలు పోటీలువడి ఓవరాక్షన్లు చేస్తున్నరు’.. ప్రవక్తను తలుచుకొని మనసులో అనుకున్నాడు.
తను చేసిన పనికి ఇంట్లో అమ్మా, భార్య మూడీగా ఉండటం, కులపోళ్లు కోపంగా ఉండటం, పైగా అమ్మ అనారోగ్యంతో ఉస్మాన్ మనసు ఇంకా ఇంకా కకావికలం అవసాగింది. అలాగని రాజీపడి వారికి క్షమాపణ చెప్పి అబద్ధాన్ని బలపరచలేడు! తర్జనభర్జన పడుతున్నాడు. మనసులో గందరగోళం, దిగులు తిష్ఠవేశాయి. ఎంత మరిచిపోదాం అనుకున్నా.. మనుషుల ముఖాలు చూడగానే గుర్తొచ్చి గుండె చివుక్కుమనడం, వరదకు చేపలు ఎదురీదినట్టు శ్వాస పైకే వెళ్తున్నది కానీ బయటికి రావడం లేదు! తన పక్కన నిద్రపోతున్న భార్యాపిల్లలను చూసి భారంగా నిట్టూర్చాడు. ఎంతో సేపటికి అతని కనురెప్పలు వాలాయి.
ఓ గురువారం అమ్మను తీసుకొని ఝాన్సి లింగాపూర్‌లో మందు పోయడానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎముకలు విరిగిన వారికి పసరు మందు పోస్తారు. మందు పోసుకొచ్చాక అమ్మను కూతురిలా చూసుకోసాగాడు. అలా రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి అతనికి..
* * *
కాలం గడుస్తున్నా ఊళ్లో అతనితో కులపోళ్లు ఎవరూ మాట్లాడటం లేదు. తనకు తానుగా ‘సలాం’ చేసినా.. ‘వాలెకుమస్సలాం’ అనడంలేదు! అమ్మ అనారోగ్యం గురించి కూడా అడగడం లేదు. ఊరోళ్లంతా అతణ్ని కొట్టాలని, మతం నుంచి బహిష్కరించాలని భావించారు. కానీ, అంత పని చేయకుండా కొంత వెసులుబాటుగా బట్టలో రాళ్లు చుట్టి కొట్టినట్టు శిక్షించారు.
ఈ విషయం తెలిసి శంకరన్న, రాజన్న, మల్లన్న, సంతోష్, రాజు వచ్చి ఉస్మాన్‌ను పలకరించి.. అసలు విషయం తెలుసుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు.
“ఉస్మాన్ భాయ్! నువ్వు తప్పు చేసినవే! కులంతోనే బలం. ఎందుకే లేనియి మీదేసుకుంటవ్!. సప్పుడు జెయ్యక మసీద్‌లకు పోయి మీవోళ్లందరికి తప్పైందని చెప్పి చెంపలేసుకో.. సల్లవడిపోతది అంతా!” పక్క పొలం శంకరన్న సలహా ఇచ్చాడు.
“మీ కులపోళ్లు తప్పు జేశిర్రు. వాళ్లు నిన్ను దూరం జేశినా, ఊరందరం నీకు తోడుంటం ఉస్మాన్ భాయ్. నువ్వు మా ఊరోనివి. వాళ్లు కోపం జేస్తే మేము ప్రేమను పంచుతం. మనుషులం మనం.. వాళ్ల కోపాలు ఎన్నొద్దులో సూద్దాం తియ్!” అని ఎదురింటి కొమటూరు సిద్ధిరాములు అన్నాడు. ఊరంతా ఉస్మాన్‌ను తమవాడు అనుకుంటున్నారు. కులపోళ్లే పరాయివాడనుకొని వెలేశారు.
* * *
అలా కులపోళ్ల వెలివేతకు గురై, పొలంలో లేదంటే ఇంట్లో జుమా నమాజ్, పండుగ నమాజ్ చదువుతూ ఏడాది గడిచిపోయింది. అయినా వాళ్లలో ఏ మార్పూ లేదు. అతని మీద అదే గుర్రు కంటిన్యూ చేస్తున్నారు. బక్రీద్, రంజాన్ ఈద్ నమాజులు కూడా ఇంట్లోనే చదువుకుంటున్నాడు. తనమీద ఇంత జరుగుతున్నా కనపడని ఆ అల్లా ఏం చేస్తున్నాడనే ప్రశ్న అతనిలో!?
ఈద్గాకు కూడా రావొద్దనడంతో తాత, నానమ్మ, నాన్న సమాధుల మీద పూలు వేసి.. దురూద్ సమర్పించే అవకాశం లేకుండా అయింది. ఎవరితోనూ గుండెకు గుండె ఆన్చి.. ఈద్ ముబారక్ చెప్పి అలాయ్ బలాయ్ తీసుకోవడం తనవరకు రద్దయ్యింది. దీంతో పండగలు వచ్చి నరకం అంటే ఇదే అని చూపించినంత పనైంది. పండగలు చాలా భారంగా గడిచాయి. కానీ, ఈ విషయంలో ఉస్మాన్ తన పంతం నెగ్గించుకుని తీరాడు.
‘మసీదు, దర్గాలకు రావొద్దని తనను నిషేధించినా ఫరక్ పడదు’ అనుకున్నాడు. కానీ, కబ్రస్తాన్ విషయంలో మాత్రం అతను రాజీపడలేదు.
‘యాడాదికి రెండుసార్లు సచ్చిన మనోళ్ల బొందల మీద పూలు ఏస్తం. సచ్చిపోయిన మన పెద్దమన్సులకు పండుగ్గోలె గూడ పూలు ఎయ్యకపోతే ఎట్ల?’ అనుకొని రాత్రి పది గంటల సమయంలో ఊరంతా నిద్రిస్తుండగా ఒక్కడు కబ్రస్తాన్‌కు వెళ్లి తన వాళ్ల సమాధుల మీద పూలు వేసి దరూద్ సమర్పించి వచ్చాడు.
* * *
నానాటికీ క్షీణిస్తున్న అమ్మ అనారోగ్యం అతణ్ని మరింత వేధిస్తున్నది. రెండ్రోజుల నుంచి తనకు అస్సలు నిద్రపట్టడం లేదని చెబుతున్నది. మనసంతా గాబరాగా ఉంటున్నదని, ఆకలి వేయడంలేదని అంటున్నది. వెంటనే సాయిలుకు ఫోన్ చేసి ఓమ్నీ వ్యాన్ తెప్పించాడు. అందులో అమ్మను తీసుకొని హైదరాబాద్ వెళ్లాడు. డాక్టర్లు రెగ్యులర్ చెకప్‌లు చేస్తున్నారు. ఆసుపత్రిలో అటూఇటూ భయంగా చూస్తున్నదామె.
“నాకంత గావరైతున్నది బేటా! నేనెందుకో ఇగ బతక అనిపిస్తున్నది. పా ఇంటికి పోదాం. ఇంట్లనే నేను జీవిడుస్త!” అంటున్న బానోబీ నోటికి చేయి అడ్డం పెట్టింది సబీనా.
“అమ్మీ! నీకేం గాదు.. ఊకో!” అని డాక్టర్ సూచించిన ఒక మాత్ర వేసి నీళ్లు తాపింది.
స్కానింగ్ అయ్యాక ఆ రిపోర్ట్ తెచ్చిన డాక్టర్ ఉస్మాన్‌తో ఏదో మాట్లాడుతున్నాడు.
“బేటా మై జారింవ్. జత్తన్ సోబ్!”.. అంటూ మెడలు వాల్చేసింది బానో బీ.
“అమ్మీ అమ్మీ!” అంటూ అదిరిపడ్డాడు ఉస్మాన్.
డాక్టర్ నాడి చూశాడు. అప్పటికే శరీరం చల్లబడ్డది.
“షీ ఈజ్ నో మోర్.. కార్డియాక్ సమస్య ఉంది!” అని చెప్పాడు.
అదే ఓమ్నీలో శవాన్ని ఇంటికి తెచ్చారు. బానోబీ చనిపోయిందని ఊరందరికీ తెలిసిపోయింది. అందరూ వచ్చి చూస్తున్నారు. ఆమె తోటివారొచ్చి శోకాలు పెట్టి.. వారి జ్ఞాపకాలను తలుచుకొని ఏడుస్తున్నారు. ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయనే సిద్ధాంతాన్ని కులమతాల మీద ఆపాదించారు. ఆ సమయంలో అది కూడా అబద్ధం అనిపించసాగింది. ఏ ఒక్క ముస్లిం వ్యక్తి ఇటువైపు రావడం లేదు. పంతాన్ని, ఫత్వాను వారంతా కఠినంగా ఫాలో అవుతున్నట్టున్నారని అనుకున్నాడు.
‘కబ్ యాడ కొట్టిద్దాం? జాగ సూశొద్దాం, కఫన్కు ఒకోళ్లు పోర్రి! మసీద్‌ల కెల్లి డోలా, కూలింగ్ బాక్స్ తెచ్చి కడిగి పెట్టుర్రి. సుట్టాలు పట్టాలకు అందరికీ ఫోన్లు జేశి చెప్పుర్రి. దూరం నుంచి వచ్చెటోళ్లుంటే ఇశా నమాజుల కలుపుదాం. లేదంటే మగ్రీబ్ నమాజుల కలుపుదాం. టెంట్ హౌసుకు ఫోన్ జేసి ఇంటి ముంగట రెండు టెంట్లు ఏపియ్యుర్రి. వంద కూర్చీలు, ఒగ డేకిసా తెప్పియ్యుర్రి. మసీదుల మొల్సాబ్కు చెప్పి ఖురాన్ బక్ష్ మని చెప్పుర్రి. ఇంట్ల ఆడోళ్లను ఏడ్వనియ్యకుంట సూడుర్రి. వాళ్లను ఖురాన్ తిలావత్ చెయ్యుమని చెప్పుర్రి’.. ఇలా సర్వం పనులు.. ముందు కులపోళ్లే వచ్చి చేస్తారు. ఊళ్లో ఉస్మాన్ ఎందరి సావులకో వెళ్లి ఈ పనులు చేశాడు. కానీ, ఇప్పుడు వాళ్లంతా వస్తరా? మనసులో ఆ మాట అతణ్ని మెరమెర మేస్తున్నది.
వాళ్లందరికీ బానోబీ చనిపోయిందని, తాము వెళ్లి అక్కడి పనులు చెయ్యాలని తెలుసు. కానీ, ‘హుజూర్ కీ గుస్తాఖీ కర్నేవాలా ఇబ్లీస్’ అనే మాట వారిని గడప దాటనివ్వడం లేదు. బయట వ్యాపారాలు చేసుకునేవారు కూడా షాపులు మూసేసుకొని వెళ్లి ఇళ్లలో తలుపులు పెట్టుకొని ముఖం చాటేశారు. దూరం నుంచి ఒక్కరొక్కరుగా బంధువులు వస్తున్నారు. ఇద్దరు చెల్లెండ్లు, బావలు వచ్చారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.
అత్తయ్య శవం మీద ఈగలు తోలుతూ.. బయట కూర్చీలో కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న భర్తను దీనంగా చూస్తున్నది సబీనా.
‘అయ్ అల్లా!’ అనుకొని పదేపదే పైకి చూస్తున్నది.
శంకర్, సాయిలు, రాజేశ్, మెస్సీ, రాములు, నాగవ్వ, బాయమ్మ.. అక్కడ ఏం జరుగుతున్నదో గమనిస్తున్నారు. ఉస్మాన్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేశారు.
“గిసొంటి కష్టకాలంల కులపోళ్లు నీ ఎంబట లేకపోతే ఏంది!? ఊరోళ్లం మేము నీ ఎంబట లేమా బిడ్డా! నువ్వేం కుదెంవడకు. మేమంత కలిసి బానో సందం జేస్తం. అదీ, నేను ఒకటేసారి ఈ ఊరికచ్చిన కోడండ్లం! నా శెల్లె అది. దాని పీన్గు ముర్గిపోంగ సూస్తనా కొడ్కా! నీ పెద్దమ్మను నేను. అరేయ్ సాయిలూ.. మీరు వోయి వీళ్ల నాయిన బొంద యాడుందో సూశి పక్కపొంటే బొంద గొట్టుపోర్రి. ఉస్మాన్.. నువ్వూ, రాజేష్ గాడు వోయి తెల్లబట్ట తేపోర్రి. మేము జేశే అన్ని పన్ల మీద నీ నజర్ ఉంచు బిడ్డా! ఎందుకంటే నాకు మీ ఆచారాలు జరజరన్నే తెలుసు” అంటున్న నాగవ్వ వైపు ఉద్విగ్నంగా చూశాడు ఉస్మాన్.
అతని స్వరం వణుకుతున్నది. రూపాయి బిళ్లంత కుంకుమ బొట్టు, చెవులకు వేలాడుతున్న గెంటీలు, మెడలో మెరుస్తున్న గుండ్లు.. అచ్చం గ్రామ దేవతలా పనులు చేయిస్తున్న ఆమె నిలువెత్తు రూపానికి అప్రయత్నంగానే అతని చేతులు లేచి దండం పెడుతున్నాయి. వద్దన్నట్టు రెండు చేతుల్ని పట్టుకుందామె. అందరూ తలా ఓ పని చేస్తున్నారు. ప్రతి విషయాన్నీ ఉస్మాన్‌ను అడిగి తెలుసుకుని చేస్తున్నారు. వాళ్లందరినీ, అటుపక్క నుంచి కనిపిస్తున్న అమ్మ శవాన్ని మార్చి మార్చి చూస్తూ ఉబికొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతున్నాడు.
డేకిసాలో నీళ్లు పెట్టి అందులో నేరేడు ఆకులు వేసి పొయ్యిలో మంట పెట్టింది బాయమ్మ. టెంట్ వేశారు. బంధువులు వచ్చేస్తూ వారితో కలిసి తలా ఓ చేయి వేస్తున్నారు. కొందరు వెళ్లి వెదురు బొంగులు తెచ్చి కంపురం కట్టారు. బంధువులతో కలిసి నీళ్లు పోశారు, కఫన్ చుట్టారు. కంపురంలో పడుకోబెట్టారు. భుజం ఇచ్చారు. ఆ నలుగురే మసీదు వైపు వెళ్తున్నారు.
“ఒగయాల్ల వాళ్లు మసీదులకు రానియ్యకపోతే.. తాళాలు పలగొడ్దాం. ఎవరు అడ్డమస్తరో సూద్దాం!” రోషంగా అంది నాగవ్వ.
తమ పనులన్నీ వదులుకొని ఊరంతా తన వెనుక రావడం చూసి ఉస్మాన్‌లో ఎక్కడలేని ధైర్యం కూడగట్టుకుంటున్నది. ‘నాకు ఈ మానవత్వం గల మనుషుల తోడు చాలు!’ అనుకొని, బాధను మరిచి మరింత నిబ్బరంగా, నికార్సుగా నడుస్తున్నాడు.
ఈ వార్త వాళ్లందరికీ తెలిసింది.
“ఇప్పుడు గూడా మన పంతం ఇడువకపోతే మనం ఇన్సాన్లం గాము! ఇబ్లీస్లం అయితం. ఊరందరు ఊస్తరు మన మీద” అని ఒకరికొకరు చెప్పుకొన్నట్టు ఉన్నారు. తలుపులు తీసుకొని బయటకొచ్చి వీధిలోంచి వెళ్తున్న శవయాత్రకు భుజం అందిస్తున్నారు. అలా ఒక్కొక్కరుగా.. అందరూ వచ్చారు.
ఆశ్చర్యంగా చూస్తున్నాడు అందర్నీ!? మసీదులో జనాజా నమాజ్ చదివాక.. శవాన్ని డోలాలోకి మార్చుదామన్నాడు మౌల్వీ.
“కంపురంలనే ఉండనియ్యుర్రి!” అని ఉస్మాన్ చాలా ఖరాఖండిగా అన్నాడు.
మగ్రీబ్ నమాజులో కబ్రస్తాన్ మట్టిలో కలిపారు. తర్వాత ఎవరిళ్లకు వారు వెళ్లారు.
నాగవ్వ మాత్రం రాత్రంతా ఇంటి దగ్గరే ఉంది. ఉస్మాన్‌కు ఎంతో ధైర్యం చెప్పింది. తన దోస్తులు శంకర్, యాదగిరి, మెస్సీ కూడా ఉన్నారు. వాళ్లను చూసి గౌస్ వచ్చాడు. అతను చెడ్డీ దోస్తే గానీ.. మతం అడ్డొచ్చి, ఆచారం కట్టేసి అప్పటివరకూ రాలేకపోయాడు.
‘ఊరోళ్లను సూశి కదిలిర్రు తప్పితే.. వాళ్లల ఇన్సానియత్ లేదు. కదలకపోతే ఊరందరు ఊస్తరని వచ్చిర్రు’ అని ఉస్మాన్‌కు తెలుస్తున్నది.
మునుపటి మాదిరే అంటీ ముట్టనట్టు ఉంటున్న వారి వ్యవహారశైలి.. ఉస్మాన్‌ను మరింత బాధపెట్టింది. ఇంకా వాళ్ల దృష్టిలో తను ఇబ్లీసే. తనను క్షమించి ఏదో దయ తలచినట్టు వ్యవహరిస్తున్నారని అర్థమవుతున్నది అతనికి. జ్యారత్, దహుమ్, బీస్వా, చాలీస్వా వరకు కార్యక్రమాలన్నిటిలో ఊరందరూ భాగం పంచుకున్నారు. కులపోళ్లు నామ్‌కే వాస్తేగానే వస్తూ పోతున్నారు.
* * *
నలభై దినాల తర్వాత ఉస్మాన్ చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు.
‘మనవాళ్లను మార్చుకోవచ్చేమో గనీ.. మతాచారాలను మార్చలేం. అవ్విటిని మోసుకుంట కులమతాలు మలినం అయినయి. ఆ మలినంతోని మనిషిని చంపేస్తున్నరు. అదొక ఆచారవ్యవహారాల గుంపు. ఆ గుంపు ఎప్పుడూ నైతికతను మర్చిపోతూ, మానవత్వాన్ని మసి చేయాలని చూస్తది. ఇస్లాం మతం ఎడారిల పుట్టిండచ్చు గనీ.. మనం ఇక్కణ్నే పుట్టి మతాన్ని ఆచరిస్తున్నం గావట్టి తడి ఆరిపోతే ఎట్ల? గందుకే నేను మనిషిగా బతకాలె అనుకుంటున్నా. ఆచారాన్ని అంటి పెట్టుకోకుండ కులం లేదు, మతం లేదు. అవ్విటిని వట్టుకొని అబద్ధాల కత్తి మొన మీద బతకాలంటే నాతోని గాదు. గందుకే ఇయ్యాల్టి సంది నేనే మీకు దూరం ఉండాలనుకుంటున్న. మీ అందరినీ నా నుంచి బహిష్కరించి, నాకు నచ్చిన బతుకు బతుకుత. నా ఇంట్ల ఏ దావత్, సావు అయినా మీరు రావద్దు అని మనవి చేస్తున్న!’ అని ఉత్తరం రాశాడు. దాన్ని మసీదులో ఇచ్చాడు.
ప్రతిఒక్కరికీ ఒక రోల్ మోడల్ ఉంటారు. తనకు మాత్రం.. తల్లి తాహేరాబేగం రోల్ మోడల్ అంటారు సంఘీర్. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా హుమాయూన్ సంఘీర్ సుపరిచితులు. కామారెడ్డి (ఉమ్మడి నిజామాబాద్) జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ స్వస్థలం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రచయితగా ఇప్పటివరకు 45కుపైగా కథలు రాశారు. పలు పత్రికల కోసం కవితలు, వ్యాసాలు, పజిల్స్ రాశారు. ‘కామునికంత’, ‘గెంటీలు’ ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. సినిమారంగంలోనూ సహ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేక సినిమాలకు పనిచేశారు. 50 వరకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. కొన్నిటికి దర్శకత్వం వహించారు. నటుడిగా ‘మూలుగుబొక్క’ వెబ్ సిరీస్, ‘దొరసాని’ చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూ, మాటలు అందిస్తున్నారు.