Katha – 2021 | “గణపతి దేవుడు.. ఏడి?”.. ఎవరో చిన్నగా అన్నారు.
“ఇక్కడే ఉన్నాడే!?”.
“అయ్యో .. ఏడి!?”.
“గణపతి దేవా! యువరాజా ఎక్కడున్నారు?”.
“గణపతి దేవా.. దేవా!”..
“అయ్యో.. కనపడటంలేదు. వెదకండి వెదకండి”..
సైనికులు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు.
అది యుద్ధభూమి. అక్కడ శవమై పడిఉన్నాడు కాకతీయ మహారాజు మహాదేవుడు. యుద్ధగజం అంబారీలో తండ్రి సరసనే కత్తి ఝళిపిస్తూ కనిపించిన యువరాజు గణపతిదేవుడు.. తండ్రి మరణించాక మాయమైపోయాడు. అంతకు ఐదుఘడియల ముందు కాకతీయ మహారాజు మహాదేవుడు కత్తిదూసి యుద్ధంచేస్తూ అంబారీ నుండి కిందికి దూకాడు. అప్పుడే వెనుకనుంచి ఓ శత్రుసేనాపతి విసిరిన బాణం దూసుకొచ్చి ఆయనకు ఎడమ డొక్కలో దిగబడింది. అయినా తట్టుకున్నాడు. మీదికి దూసుకొస్తున్న శత్రువీరులను ఎదుర్కొన్నాడు. కానీ, శక్తి క్షీణిస్తున్న మహాదేవుణ్ని శత్రు సైన్యాధ్యక్షుడు అత్యంత నైపుణ్యంతో, దూకుడుతో మీదికి వెళ్లి పోరాడి సంహరించాడు. చుట్టూ ఉన్న అంగరక్షకులు, కాకతీయ వీరులు ఆయనను రక్షించలేక పోయారు. నేలవాలిన తమ మహారాజు పార్థివశరీరాన్ని నీరునిండిన కన్నులతో చూడటం మినహా మరేమీ చేయలేక పోయారు.
పరుగుపరుగున వచ్చి పడ్డాడు రేచర్ల రుద్రయ.. కాకతీయ సైన్యాధ్యక్షుడు. అతణ్ని దూరంగా యుద్ధంలో నిమగ్నుణ్ని చేసి ఇక్కడ మహాదేవుణ్ని నిర్జించారు.
మహాదేవుణ్ని చూసి బావురుమన్నాడు రుద్రయ. మహారాజు శిరసును ఒడిలో జేర్చుకుని విలవిలలాడి పోయాడు.
“రెండు ఘడియలు.. రెండే రెండు ఘడియలు కాపాడలేకపోయారా నీచులారా! నేనే వచ్చి కాపాడుకునేవాణ్ని. మహారాజును పొట్టన పెట్టుకున్నాం కదరా. ఇప్పుడు అనుమకొండ ఎలా వెళ్లాలి!? మహారాజు మృతదేహంతో వెళ్లి కాకతీయ ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి!? ఎలా జవాబు చెప్పాలి!?”..
కుమిలిపోతున్నాడు అరివీర భయంకరుడు రుద్రసేనాని. మహాదేవుడి నిర్జీవశరీరాన్ని చూస్తూ తల్లడిల్లి పోతున్నాడు. శత్రువులను బూతులు తిట్టాడు. చేతకాని సైనికులపై అరిచాడు. గావుకేకలు వేశాడు.
యుద్ధభూమిలో తలోదిక్కున యుద్ధం చేస్తున్న మహామహా కాకతీయ వీరయోధులు పిల్లలమర్రి బేతిరెడ్డి, చెరుకు బొల్లయ, విరియాల సూరన, మల్యాల కాటయ నాయకుడు, కామిరెడ్డి, విరియాల బేతరాజు, చౌండ.. మహారాజు ధ్వజకేతనం కూలడం చూసి పరుగుపరుగున అక్కడికి వచ్చారు. మహాదేవరాజు శవమై రుద్రయ ఒడిలో ఉండటాన్ని చూసి దిగ్భ్రమతో నిలబడిపోయి.. ఆనక ఆయన శరీరంపై పడి ఏడవసాగారు.
అప్పుడు గొణిగాడు దళపతి నాచన..
“యువరాజు.. మన గణపతిదేవుడు!”..
చివ్వున చూశాడు రుద్రయ..
“ఏడి.. యువరాజు ఎక్కడ?”..
ఎక్కడా కనిపించలేదు.
“శత్రువులు అపహరించుకు పోయారు సేనానీ!”..
మరుక్షణం నాచన తల ఒక్కవేటుతో తెగి ఆవలపడింది.
ఆయన కరవాల ప్రహారానికి మరో తల అందకుండా అందరూ నేలపై పడిపోయారు.
“క్షమించండి మహాసేనాని.. క్షమించండి!”.
ఇప్పుడు అసలు సమస్య మహారాజు మరణించడం కాదు. ఇప్పుడు కాకతీయరాజ్యం రాజులేని శ్మశానరాజ్యం. ఎవ్వరూ లేని నిస్సహాయ. శత్రువులంతా తలో వైపు కమ్ముకుంటారు.
అటూ ఇటూ చూశాడు.
కాకతీయ మహారాజును చంపి యుద్ధంలో విజయం సాధించిన దేవగిరి మహారాజు జైత్రపాలుడు గానీ, దేవగిరి సైన్యాధ్యక్షుడు జల్లన, ప్రధానమంత్రి బసవరసుడు.. ఏరీ కనిపించరేం!? మహాదేవుడి పార్థివదేహాన్ని వదిలేసి వెళ్లి పోయారేం.. మహాదేవుడి శిరస్సును ఖండించి తమతో తీసుకుపోయి దేవగిరిలో కందుకక్రీడ ఆడటానికి ఎందుకు ఆసక్తి చూపలేదు.. కాకతీయ ఛత్ర కేతనాలను.. ఇతర రాజరిక హోదాలను స్వాధీనపరచుకోలేదు?.. గణపతి దేవుణ్ని తీసుకుని మాయమయ్యారంటే వాళ్ల ఆలోచన ఏమిటి..
రుద్రయ ముందు తేరుకున్నాడు. సేనానులను, దళపతులను చూస్తూ అన్నాడు..
“మహారాజు మహాదేవుల వారు వీరమరణం పొందారు. యువరాజు గణపతిదేవుడు కోటలో ఉన్నారు. ఇదే అందరికీ.. రాజధానిలోని సాధారణ ప్రజలందరికీ ఇదే చెప్పాలి. అర్థమైందా.. నేనన్నది విన్నారా.. ఏం చెప్పాలి?!.. యువరాజు కోటలో ఉన్నారు!!.. సరేనా!?”..
అందరికి అర్థమైంది. వాళ్లంతా సైనికులు. రాజు చనిపోయి, యువరాజు శత్రువులకు చిక్కాడంటే సాధారణ ప్రజల్లో కలిగే అలజడి, శత్రురాజుల్లో తొణికే రణోత్సాహం వారు అర్థం చేసుకోగలరు.
“అలాగే మహాసేనాని..” అన్నారు.
కళ్లు తుడుచుకుని లేచి అందరినీ మహాదేవరాజు శవంచుట్టూ నిలబెట్టి ప్రమాణం చేయించాడు.
“మనం యువరాజు గణపతిదేవుణ్ని తోడ్కొని మాత్రమే తిరిగి అనుమకొండ వెళతాం.. లేదా ఇక్కడే మరణిస్తాం. అప్పటి వరకూ స్కంధావారం విడిచి వెళ్లం. ఇది మన మహారాజు శ్రీశ్రీశ్రీ మహాదేవులవారి పార్థివశరీరంపై ఆన..” ఒంట్లో సలసల మండుతున్న రక్తం నిలువెల్లా పొంగుతుండగా.. అందరూ నిండు హృదయంతో, ముక్తకంఠంతో నినదించారు.
అనంతరం మహాదేవుని శరీరాన్ని రుద్రయ భుజాన వేసుకున్నాడు. స్కంధావారానికి చేరారు.
నిజానికి దేవగిరిపై యుద్ధం ప్రకటించి మొదట దండయాత్ర చేసినవాడు కాకతీయ మహాదేవరాజే. ఈయనకు ముందు కాకతీయరాజ్యాన్ని పాలించిన తన అన్న రుద్రదేవరాజు మరణానికి జైత్రపాలుడే కారణమని మహాదేవుడి అభిప్రాయం.
అనుమకొండకు పక్కలో బల్లెంలా ఉంది దేవగిరి రాజ్యం. ఇరు రాజ్యాలమధ్య ఐదేళ్లుగా నిరంతరం యుద్ధాలు తప్పడంలేదు. సేవణులుగా పిలవబడే యదువంశానికి రాజు జైతుగి అనబడే జైత్ర పాలకుడు.. శత్రు భీకరుడు. ఇటీవల కాకతీయులపై కత్తికట్టాడు. క్రీ.శ.1195లో రుద్రదేవుడి మరణంతో కాకతీయ రాజ్యానికి పరీక్షాకాలం ఎదురయ్యింది. రుద్రదేవుడు నిజమైన మహానేత. ప్రజలు రుద్రదేవుణ్ని మర్చిపోలేకపోతున్నారు.
సైన్యమంతా స్కంధావారానికి చేరేసరికి అనుమకొండ నుంచి మహాప్రధాని గంగాధర మంత్రి, మంత్రులు శాక్య శివుడు, భరద్వాజుడు తదితర ముఖ్యులు వార్త తెలియగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మహారాజు మరణించిన విషాదం కంటే.. యువరాజు అదృశ్యం వారిని మరింత భయపెడుతున్నది.
“యువరాజును కూడా ఆ దుర్మార్గులు సంహరించారేమో..?!!”..
రుద్రసేనాని ఆ మాటను ఖండించాడు. శత్రువును ఎవరైనా యుద్ధభూమిలోనే చంపుతారు. తమ కోటకు తీసుకుపోయి తీరుబడిగా చంపరు. కేవలం అధిక ప్రయోజన లావాదేవీల కోసమే రాజకుటుంబీకులను బందీలుగా తీసుకుపోతారు. కానీ, చిత్రంగా దేవగిరిరాజ్యం కాకతీయులపై గెలిచింది. కాబట్టి కాకతీయరాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు. సహజంగా యుద్ధానంతరం ఓడిన రాజ్యపు ఛత్ర కేతనాలను ఛిన్నాభిన్నం చేసి అవమానిస్తుంది.
సప్తాంగాలను స్వాధీన పరచుకుంటుంది. దీనిపై ఇరుపక్షాల సంధి విగ్రహిలు సమావేశం కావాలి. యుద్ధానంతర కార్యకలాపాలు ఏమీ జరగలేదు. కేవలం మహారాజును సంహరించి, యువరాజును బంధించి సైన్యంతోసహా వెళ్లిపోయాడు దేవగిరి మహారాజు జైత్రపాలుడు.
‘కిం కర్తవ్యమ్? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి??’..
* * *
“కిం కర్తవ్యం?” అంతవరకూ చెప్పి ప్రశ్నించాడు ఎలకుర్తి మండలేశ్వరుడు రేచర్ల రుద్రయ.
“చెప్పండి. అప్పుడు నా మనఃస్థితి.. ఇటు మహారాజు పార్థివదేహం, అటు యువరాజు అదృశ్యం, గెలిచిన రాజు వాళ్ల కోటలోకి వెళ్లి ద్వారాలు మూసుకోవడం.. మేమంతా ఓడిపోయి వాడి కోట ఈవల స్కంధావారంలో దిక్కుతోచక నిలబడిపోవడం. అప్పుడు నేనేమి చెయ్యాలో.. చెప్పండి..” అన్నాడాయన.
అప్పుడాయన ఆతుకూరిపురం గ్రామంలో రుద్రేశ్వర దేవాలయం ఆరుబయట రాతిబండలపై కూర్చుని ఉన్నాడు. ఆయన ముందు ఓ పాతికమంది వద్దంకులు కూర్చుని రెప్పవేయ్యకుండా ఆయన చెప్పేది వింటున్నారు. అందరి మనసులో అదే ప్రశ్న.. అప్పుడు రుద్రయ ఏమి చేసి ఉంటాడు?!
ఆయనను అడగడం ఉత్సుకత కొద్దీ అడిగేశారు గానీ.. ఆయనే ఇలా ప్రశ్నిస్తే ఏమి చెప్పాలో వాళ్లకు తోచలేదు.
ఆరోజు శ. సం. 1135 శ్రీముఖ నామ సంవత్సరం మధుమాస వసంత శుక్లపక్ష సప్తమి శనివారం.
తెల్లవారితే అంటే.. రేపే అష్టమి. ఆదివారంనాడు పుష్యమి నక్షత్రాన రుద్రేశ్వరుడి ప్రతిష్టాపన ముహూర్తం. (క్రీ.శ1213 మార్చి 31),
ప్రారంభించిన యాభై ఏళ్లకు రుద్రేశ్వరాలయం పూర్తయ్యింది. ప్రతిష్టాపనోత్సవానికి అలంకారాలు జరుగుతుండగా అక్కడక్కడా తుది మెరుగులు దిద్దుతున్నారు శిల్పులైన వద్దంకులు. దేవాలయ నిర్మాత, కాకతీయ సకల సైన్యాధ్యక్షుడు, మండలేశ్వరుడు రేచర్ల రుద్రయ పక్షం రోజులుగా అక్కడే ఉంటూ.. ముగ్గురు మహావ్యక్తులు కలలు గన్న ఆ దేవాలయ పూర్తిరూపాన్ని దగ్గరుండి తృప్తిగా చూసుకుంటున్నాడు. పక్కన రుద్రయ తల్లిదండ్రుల పేర్లపై నిర్మిస్తున్న కాటేశ్వర, కామేశ్వర ఉపాలయాలు, నంది మండపం, లిఖిత శాసనం, దానికోసం ప్రత్యేక మండపం. నిర్మాణం కూడా పూర్తయ్యాయి.
పొద్దు వాలింది. పటమటిగాలి చిందులు వేస్తూ రివ్వురివ్వున చక్కిలిగింతలు పెడుతున్నది.
దూరంగా ఆతుకూరు చెరువు తవ్వకం జరుగుతున్నది. చెరువులోని మట్టిని తట్టలతో ఎత్తి ఎడ్లబళ్లలోకి పోస్తున్నారు మట్టి మనుషులు. వారి పాటలు, మాటలు ఎడ్ల మెడల్లోని చిరుగంటల సవ్వడిలో కలగలిసి గాలిలో తేలి వస్తూ.. కర్షక లోకపు కల్యాణానికి నాందీ గీతాల్లా చెవులకు సోకుతున్నాయి.
ఇక్కడ శిల్పుల ఉలి శబ్దాలు రాతికి దెబ్బ తగులుతుందేమోనన్న స్పృహతో మంద్రంగా కళపెళలాడుతున్నాయి. అనుమకొండ వేయి స్తంభాల గుడి, ఈ ఆతుకూరు రుద్రేశ్వరాలయం రెండూ ఎప్పుడో మహారాజు రుద్రదేవుని ఊహల్లో పురుడు పోసుకున్నవే. క్రీ.శ.1163లోనే అనుమకొండ వేయిస్తంభాల గుడి పూర్తవ్వగా.. ఈ గుడి మరో యాభై ఏళ్లకు ఇప్పుడు పూర్తిరూపం దాల్చింది. పునాది నుంచి విమాన కలశం వరకూ అణువణువూ ప్రత్యేకతలతో యాభై ఏళ్లపాటు ఎందరో మహామహుల ఆలోచనలు, భావనలు కలగలిపి వాటికొక ఆకారం సాకారం చేసినవాడు ప్రధాన స్థపతి రామప్ప. ఎదురుగా సమున్నతంగా భాసిస్తున్న విమాన గోపురాన్ని చూస్తూ పులకించిపోతున్న రుద్రయకు దగ్గరగా ఓ ప్రశ్న వినవచ్చింది.
“మహాసేనానీ.. కాకతీయవంశం ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అహర్నిశమూ పోరాడుతున్న వంశంగా.. గణపతిదేవ మహారాజు కాబోయే చక్రవర్తి అని స్థపతి రామప్ప మాతో అన్నారు. అందుకు కారణం మీరేనని.. ఆనాడు గణపతిదేవుణ్ని శత్రుసేనలు బందీని చేసి తీసుకుపోతే మీరు చేసిన గొప్పనిర్ణయాల వల్లనే కాకతీయ కేతనం అవనతం కాకుండా తిరిగి సమున్నతంగా ఎగురుతున్నదని అందరూ చెప్పుకొంటారు. అంతటి క్లిష్ట సమయంలో ఇంటాబయటా మీరెంత కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారో.. గణపతి దేవులవారిని తిరిగి కాకతీయ సింహాసనంపై ఎలా ప్రతిష్టించారో.. తెలుసుకోవాలని కోరికగా ఉంది స్వామి”.. ఓ యువశిల్పి దగ్గరగా వచ్చి అన్నాడు.
విన్నాడు రుద్రయ. అప్పుడాయన చూపు గర్భాలయ ద్వారంపై భార్య అన్నమతో సహా చెక్కిన తమ మిథున శిల్పంపై నిలిచి ఉంది.
అతని ప్రశ్నకు రుద్రయ ఏమి జవాబు చెబుతారోనని, ఉలి శబ్దాల మధ్య ముచ్చట్లు చెప్పుకోవడం అలవాటున్న వద్దంకులంతా చెవులు రిక్కించారు. రుద్రయ నిశ్శబ్దంతో ఆ యువశిల్పి మరో ప్రశ్న సంధించాడు.
“మీరే ఎందుకు అనుమకొండ సింహాసనాన్ని ఆక్రమించలేదు. రేచర్ల వంశపాలనను ఎందుకు ప్రారంభించలేదు?”..
ఇబ్బందిగా కదిలాడు రుద్రయ.
ఈ ప్రశ్న ఎప్పుడూ ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. తనేదో గొప్ప త్యాగంచేశానని.. ఘనకార్యం సాధించానని చెప్పుకోవడం ఆయనకు సుతరామూ ఇష్టం ఉండదు. కానీ, ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో ఆయనకు చెప్పాలనిపించింది. కారణం ఆ శిల్పి అన్న ఒకమాట..
‘ఇంటా బయటా’..
అవును. అందరూ అడిగేది వినేది చూసేది బయట జరిగిన మంత్రాంగం.. యుద్ధాలు. కానీ, ఇంట జరిగిన సంఘటనలు ఎవరూ ఎప్పుడూ అడగలేదు. తనూ ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేదు. నిజానికి చెప్పకూడనివి!!
ఆనాడు తన ఇంట జరిగిన సంఘటనలు.. ఇంటిపోరు! గుర్తొచ్చి నవ్వుకున్నాడు రుద్రయ. ఆయన నవ్వు చూసిన శిల్పులంతా ఉలులు పక్కన పడేసి ఆయన పక్కకు చేరారు. ఇక చెప్పక తప్పింది కాదు రుద్రయకు.
* * *
ఆ క్లిష్టసమయం క్రీ.శ. 1199లో వచ్చింది.
దేవగిరిరాజు బంధించి తీసుకుపోయిన గణపతిదేవుణ్ని ఎన్నో టక్కుటమార విద్యలను ప్రదర్శించి తిరిగి కాకతీయ సింహాసనంపై కూర్చుండబెట్టిన సేనానుల బృందానికి అధినాయకుడు రేచర్ల రుద్ర సేనాని. కాకతీయ రాజ్యమే కాదు.. సర్వదేశాలు ఆయన తంత్రజ్ఞతను.. ముఖ్యంగా ఆయన త్యాగాన్ని వేనోళ్లా కీర్తించాయి.
గణపతి దేవుడయితే కన్నతండ్రిలా చూస్తాడు.
‘కాకతీయ రాజ్యభార ధౌరేయుడు’ అన్న బిరుదునిచ్చి, సైన్యంలో సర్వ సైన్యాధ్యక్షుడు పైన సకల సైన్యాధ్యక్షుడు అనే అత్యుత్తమ పదవి సృష్టించి జీవితాంతం ఆయనే ఉండేలా పేరోలగంలో ప్రకటించి తన కృతజ్ఞత చాటుకున్నాడు. రాజధాని అనుమకొండలో, నిర్మాణమవుతున్న కొత్త రాజధాని ఓరుగల్లులో.. రాజ్యంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఎదురయ్యే ప్రజల చూపుల్లో కనపడే ఆరాధన.. అభినందన ఆయన ఈ పదిహేనేళ్లుగా అనుభూతిస్తూనే ఉన్నాడు.
కానీ, రుద్రసేనాని స్థితప్రజ్ఞుడు. తొణకని నిండుకుండ. నిత్యమూ కాకతీయ ఛత్ర కేతనాల పరిరక్షణే ఆయన ధ్యేయం. చెరువుల, దేవాలయ నిర్మాణం దైవప్రేరిత ప్రసాదాలుగా భావిస్తూ నిర్మిస్తూ జీవితాన్ని చరితార్ధం చేసుకుంటూ సాగిపోతున్నాడా కర్మయోగి.
దేవగిరిపై యుద్ధానికి పోయి మహారాజు మహాదేవుడు మరణించడం, యువరాజు గణపతిదేవుడు అదృశ్యం కావడం, కాకతీయ స్కంధావారం ఏమి చెయ్యాలో తోచక నిలబడిపోయిన సంఘటన వరకు చెప్పి అడిగాడు రుద్రసేనాని.
‘కింకర్తవ్యం?’..
ఎవ్వరూ చెప్పలేనట్లు మాట్లాడలేకపోయారు. తనే కొనసాగించాడు.. బయట జరిగినవి చెబుతూ ఇంట జరిగినవి మనసులో మననం చేసుకుంటూ..
గెలిచిన రాజు ఓడిన యువరాజును బంధించి తీసుకుపోయి నిశ్శబ్దంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటి..? మన కాకతీయ మంత్రులు, సేనానులు తీవ్రంగా బుర్రలు పగలగొట్టుకుంటున్నారు
ధావారంలో. కలుగులో దాగిన ఎలుకను ఎలా బయటికి లాగాలి అనేది అందరి ఆలోచన. సాధారణంగా జరిగే దౌత్యవిధానం సంధివిగ్రహిని పంపడం. అదే చేశాడు రుద్రసేనాని. సంధివిగ్రహి పాపయ భట్టారకుడు వెళ్లి పక్షం రోజులయినా తిరిగి రాలేదు. కానీ, మహాప్రధాని గంగాధరమంత్రి ఉద్దండుడు. ఓరుగల్లు నగర అధ్యక్షుడు ఇందులూరి పెదమల్లనను, నియోగాధిపతులను, బాహత్తరనియోగాధిపతి దమ్మవీరను.. అందరినీ హెచ్చరించాడు. ప్రజల దైనందినంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉండరాదని ఆజ్ఞలు జారీచేశాడు. రాజ్యమంతటా ఎక్కడా నిత్యావసరాల కొరత ఉండకూడదని వర్తక సమయాల శెట్టిలందరికీ వర్తమానం పంపాడు. రాజ్యమంతా ప్రశాంతత ఉన్నా ఏదో నిగూఢమైన బాధ.. రాజ్యమంతా వ్యాపించి ఉన్నది.
రోజురోజుకూ రుద్రయ అల్లకల్లోలమై పోతున్నాడు. మహాయోధుడైన రుద్రయకు అద్భుతమైన పోరాటపటిమ తప్ప రాజకీయం చేతకాదు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం లేదు. అదే అన్నాడు గంగాధరమంత్రితో. ఆయనతో ఘడియ ఘడియకూ చర్చిస్తున్నాడు. వార్తాహరులు అటూఇటూ అశ్వాలపై పరుగులు పెడుతున్నారు చర్చల లేఖలతో.
“మనం తెగించి కోట మీదికి పోదామంటే మనం కోట ఘడియలు తెరిచేలోగా!”..
“వద్దు వద్దు.. నీ భయం నిజమే! యువరాజుకు ఏదైనా కీడు తలపెట్టవచ్చు జైతుగి..” అన్నాడు గంగాధరుడు.
ఆ గంగాధరుడే మరునాడు ఓ వ్యక్తిని వెంటబెట్టుకుని స్కంధావారానికి వచ్చాడు.
“రుద్రా.. ఇతను మన చారుడు. దేవగిరికోటలో పూలమాలవాడుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వార్తలు మనకు చేరవేస్తాడు. జైతుగి గురించి ఆసక్తికరమైన సంగతి చెబుతున్నాడు.. విను..” అన్నాడు.
రుద్రయ ఆసక్తిగా చూశాడు..
“చిత్తం మహాసేనాని. జైత్రపాలుడు పెద్ద గందరగోళం మనిషి. బంధించి తెచ్చిన యువరాజు గణపతిదేవులవారిని ఏమి చెయ్యాలో తెలియడం లేదాయనకు. కొన్ని రోజులు రాజమందిరంలో ప్రత్యేక గదిలో ఉంచుతున్నాడు. కొన్నిరోజులు కారాగారంలో సంకెళ్లతో కట్టి వేయిస్తున్నాడు. ‘అసలు ఎందుకు బంధించామూ!?’ అని సేనాపతులను అడుగున్నట్లు వినవచ్చింది”..
రుద్రయ ఆశ్చర్యపోయాడు. గంగాధరమంత్రితో, ఇతర యుద్ధసేనానులతో చర్చించి దేవగిరిరాజు జైత్రపాలుని గందరగోళానికి తగినట్లు తమ యుద్ధతంత్రాలు ఉండాలని నిర్ణయించారు.
అ మర్నాడు రుద్రయ ఊహించని సంఘటన జరిగింది.
ఉదయాన్నే రుద్రయ భార్య అన్నమ ముగ్గురు కొడుకులు లోకచమూపతి, పెద్దగణపతి, కాటయలను వెంట బెట్టుకువచ్చింది. స్వతస్సిద్ధమైన వీరత్వంతో ఎదిగిన ముగ్గురూ చమూపతులుగా కాకతీయ సైన్యంలో గౌరవం పొందుతున్నారు. వారి ముఖాలు వెలిగి పోతున్నాయి. మహారాజు మరణించిన విషాదంగానీ, యువరాజు బందీ అయిన బాధగానీ లేదు సరికదా.. వారి ముఖాలలో తెలియని ఆనందం తుళ్లిపడుతున్నది.
ఆమె రుద్రయ గొల్లెనలో ఉన్న వారందరినీ బయటికి వెళ్లమని సంజ్ఞ చేసింది. వెళ్లాక ఏకాంతంగా దగ్గరికి వచ్చి అన్నది..
“అనుమకొండ అంతటా.. మీరే కాబోయే మహామండలేశ్వరులని చెప్పుకొంటున్నారు”.
తుళ్లిపడ్డాడు రుద్రసేనాని. అప్పుడర్థమయ్యింది వాళ్ల ముఖలలోని వెలుగుకు ఆధారం. ఇలాంటి మాట ఏదో ఇక్కడ స్కంధావారంలో కూడా గుసగుసగా అనుకుంటున్నట్లు చెవిన పడింది. కానీ, పెడచెవిన పెట్టాడు.
“అలాంటిది ఏమీలేదు. వెళ్లండి. ఇది చెప్పడానికా యుద్ధభూమికి వచ్చింది?!..” అన్నాడు తీవ్రంగా.
ముగ్గురూ తండ్రి ఇలాగే అంటాడని ఊహించగల యుక్తవయస్కులే.
‘తండ్రిగారి ఈ కోపం మనం ముందే అనుకున్నాం కదా!’ అన్నట్లు నలుగురూ ముఖాలు చూసుకున్నారు.
పెద్దకొడుకు లోకయ చమూపతి అన్నాడు..
“తండ్రీ.. మన రేచర్లవంశ చరిత్ర, మన తాతముత్తాతల ఉన్నత వీరత్వాలు.. అన్నీ మీకు తెలుసు. మీ శక్తి యుక్తులు జగద్విఖ్యాతమే కదా! మీరు అనుమకొండ సింహాసనాన్ని అధిరోహించినట్లయితే ఎదురు ప్రశ్నించే వారెవ్వరూ లేరు. మీరు ఆ దిశగా ఆలోచన చేయకూడదా?! కాకతీయ రాజ్యం తిరిగి మీ నాయకత్వాన రేచర్ల రాజ్యంగా ప్రభవిస్తుంది”..
“నోర్ముయ్.. ఎవరు నీకు ఈ ఆలోచన నూరిపోసింది? పొండి వెళ్లిపొండి..” అరిచాడు రుద్రసేనాని.
మరో కొడుకు అన్నాడు..
“ఇది మా అభిప్రాయమే కాదు నాన్నగారూ. మీకు చెప్పలేక ఎందరో మీ వెనుక అనుకుంటున్నారు”.
ఉద్వేగమూ రౌద్రమూ కలగలిసిన ఆయన ముఖం చూసి మౌనంగా నిష్ర్కమించారు నలుగురూ.
ఇది వీళ్లకు పుట్టిన బుద్ధా.. లేక ఇతరులు కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తపరుస్తూ ఇదే కాకతీయ రాజ్యానికి మంచి, సులభమైన పరిష్కారంగా భావిస్తున్నారా?! వాళ్లు భావిస్తున్నట్లే తను రాజ్యాధికారం ప్రకటించుకుంటే తప్పేముంది.. ఇప్పటికే తనొక మండలేశ్వరుడు.. పరిపాలనలో తగినంత అనుభవముంది. తమ రేచర్ల వంశానికి, కుటుంబానికి ఎంతో ఘనచరిత్ర ఉంది.
ఎందులో? అవును ఎందులో..??
విశ్వసనీయతలో! తిరుగులేని యుద్ధ కౌశలంలో!!
కానీ, విశ్వాసఘాతుకంలో లేదు. అతనికి వెంటనే రేచర్ల ముచ్చారెడ్డి గుర్తొచ్చాడు. స్వయంగా అతని అన్న.
ఆయన చేసిన విశ్వాసఘాతుకానికి మహారాజు రుద్రదేవుడు ఎంత వ్యధను అనుభవించాడో రుద్రయకు నరనరానా వ్యాపించి ఉంది. తను ఎప్పుడూ ఆ తప్పు చెయ్యడు. కాకతీయ సామ్రాజ్య స్థాపన పరిపూర్ణం కావాలి. తెలుగు మాట్లాడేవారి ప్రాంతమంతా ఏకరాజ్యంగా ఏకఛత్రం కిందికి రావాలి. కొత్తగా నిర్మిస్తున్న ఓరుగల్లు మహానగరమై.. ఆంధ్ర ప్రజల రాజధానిగా జగత్ప్రసిద్ధం కావాలి.
రుద్రదేవుడు తనను ప్రాణప్రదంగా చూశాడు. మహాదేవుడు, గంగాధరుడు, తను.. ముగ్గురం సొంత అన్నదమ్ముల్లా అన్యోన్యంగా ఉండటం చూసి ఆయన ఎంతో ఆనందించేవాడు.
“మనం ఆంధ్రసామ్రాజ్యం స్థాపించాలి రుద్రా! అందుకు మనం ఎంతో పోరాడాలి. అప్పుడే మన ఆశయం రూపు దాలుస్తుంది. సమాజం ఎన్నో తరాలు మనల్ని కొలుస్తుంది. చరిత్ర మనకొక అధ్యాయం లిఖిస్తుంది”..
ఎంత అద్భుతమైన భావన.. ముగ్గురిలో అవి నరనరానా ఇంకిపోయాయి. ముఖ్యంగా గణపతిదేవుడు ఆయనకు ప్రతిరూపంగా ఎదుగుతున్నాడు. అందుకే ఆయన తమ్ముడి కొడుకైన గణపతిదేవుణ్ని దత్తత తీసుకున్నాడు. మహాదేవుడు కూడా అన్నమాటకు ఏనాడూ ఎదురాడి ఎరుగడు.
కానీ, ఊహాతీతంగా మూడేళ్లలోనే పరిస్థితులు తిరగబడ్డాయి. ఇప్పుడు తనను అనుమకొండ సింహాసనాన్ని ఆక్రమించమని కోరుతున్నారు. ఆక్రమించాలట.. తను ఎలా అంగీకరిస్తాడు?!
రుద్రయ ఆలోచనలను భగ్నపరుస్తూ మహాప్రధాని గంగాధరమంత్రి మరో గూఢచారిని వెంటబెట్టుకు వచ్చాడు. వెనుక బేతిరెడ్డి, బొల్లయ, మల్యాల చౌండ తదితర సేనానులు, మండలేశ్వరులు..
“రుద్రా.. ఈ గూఢచారి చెప్పేది విను. మనం మన ప్రజలకోసం గణపతిదేవుడు కోటలోనే ఉన్నాడని చెబితే అక్కడ జైతుగి అది నమ్మేసి కంగారు పడుతున్నాడట. ‘గణపతిదేవుడు కోటలోనే ఉంటే మరి మనం బంధించింది ఎవరిని? అసలైన కాకతీయ వారసుడినా లేక మరొకడినా!?’ అని అందరి మీదా అరుస్తున్నాడట”..
గూఢచారి అవునన్నట్లు తల ఊపాడు వినయంగా.
రుద్రయతోపాటు ఇతర సేనానుల ముఖాల్లోకూడా విభ్రమ!
“అసలే గందరగోళం గాడు.. యువరాజుకు ఏదైనా ఆపద తలపెడితే!”.. చెరుకు బొల్లయ సంశయించాడు.
అందరూ ఆ భయసంశయంలో ఉండగా గంగాధరుడు అన్నాడు..
“వాడికి అడ్డుకట్ట వెయ్యడానికి మన పాపయ భట్టారకుడు ఉన్నాడుకదా”.
అంతా ఆయనవంక చూశాడు.
“సంధివిగ్రహిగా వెళ్లిన పాపయ భట్టారకునికి దేవగిరి ప్రధానమంత్రి బసవరసుడు తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన మనపట్ల కొంచెం సావధానంగా ఉన్నాడు. జైతుగి.. ఆయన మాట జవదాటడు. అందువల్ల పాపయ అక్కడ ఉన్నంతకాలం యువరాజు గణపతిదేవుని ప్రాణాలకు ముప్పు రాదు”..
అంతా ఊపిరి పీల్చుకున్నారు. గంగాధరమంత్రిని ప్రశంసాపూర్వకంగా చూశారు.
“మరొక విషయం.. దేవగిరి మరో మంత్రి హేమాద్రి పంత్ కుమార్తెకు మా కుమారుణ్ని ఇచ్చి వివాహం చెయ్యడానికి నిశ్చయ తాంబూలాలు అయ్యాయి. ఈలోగా ఈ యుద్ధం ముంచుకు వచ్చింది. వచ్చే మాఘమాసంలోనే ముహూర్తం!” వివరించాడు గంగాధరమంత్రి.
బేతిరెడ్డి నవ్వాడు.
“రుద్రదేవ మహారాజు యుద్ధనీతినే నువ్వూ పాటిస్తూ శత్రురాజ్యంతోనే వియ్యమాడుతున్నావన్న మాట.. గంగాధరా!”..
“అవకాశం అలా వచ్చింది బేతిరెడ్డీ”.
“ఇవ్వాళ శత్రురాజ్యం.. రేపు మిత్రరాజ్యం కావచ్చు కదా బేతిరెడ్డీ..” అన్నాడు మల్యాల కాటయ.
రుద్ర సేనాని కొంచెం తెప్పరిల్లాడు. అతనికి తన వీరత్వానికి – గంగాధరుని వ్యూహచాతుర్యం బాగా జతకలుస్తుందని నమ్మకం. ఈ పెళ్లి బంధుత్వం అందరిలో కొత్త యుద్ధవ్యూహాలకు ఊపిరులూదింది. అందరూ తీవ్రంగా ఆలోచిస్తుండగా అన్నాడు గంగాధరుడు.
“నాకొక ఆలోచన వచ్చింది”..
అందరి వంక చూసి చెప్పాడు.
“మన రుద్రయ కొడుకు గణపతిని కొంతకాలం యువరాజుగా సింహాసనంపై కూర్చోబెడదాం. మనకోటలో కూడా దేవగిరి గూఢచారులున్నారు. అందువల్ల అక్కడ కొంత గందరగోళం కొనసాగించవచ్చు..”
అందరూ చప్పట్లు కొట్టారు.
“భేష్ గంగాధరా.. ఎంతైనా రుద్రదేవులవారి అనుంగు శిష్యుడవు. ఆయన బుర్ర పూర్తిగా నీకు వచ్చేసింది..” అంతా ఆనందంగా తలొక మాటా అన్నారు. కానీ, రుద్రయ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. కారణం అతనికి తప్ప ఎవ్వరికీ తెలియదు.
అందరూ బయటికి వెళ్లాక లోపలికి వచ్చి రుద్రయకు చేతులెత్తి నమస్కరించాడు గణపతి.. రుద్రసేనాని రెండవ కుమార రత్నం.
నవ్విన రుద్రయ ముఖంలో జీవంలేదు. తన కొడుకు నిజంగానే యువరాజుగా సింహాసనంపై కూర్చోబోతున్నాడు. అతనికి కుటుంబ సహకారమే కాదు అపరచాణక్యుడు గంగాధరుని ఆశీస్సులు కూడా ఉన్నాయా??
* * *
మరునాడు భార్య అన్నమ వచ్చింది. ముఖం మధ్యాహ్న సూర్యబింబంలా వెలిగిపోతున్నది.
“తండ్రిగారి ఆశీస్సులు లభించాయని మీ ముద్దులకొడుకు మురిసిపోతున్నాడు..” అన్నది.
ఏమి చెప్పాలి? తనెందుకు ఈ పరిణామాలకు సంతోషించడం లేదు??
“తండ్రి అధిరోహించని సింహాసనం కుమారుడు అధిరోహించడం! భలే.. ఆశ్చర్యంగా ఉంది కదూ! నాకైతే గొప్ప గర్వంగా ఉంది స్వామీ!”.. తల్లిగా పులకించిపోతున్నది. ఇది మూడునాళ్ల ముచ్చట అని వీళ్లకు తెలియదా!?
వీళ్లతో గంగాధరమంత్రి కూడా చేతులు కలిపాడా.. ఆయన ఆ రాజ్య మంత్రితో వియ్యమందబోతున్నాడు. ఆయన గణపతికి మాట ఇచ్చాడా.. వీళ్లంతా కలిసి తనపేరు చాటున గూడుపుఠాణి చేస్తున్నారా.. అయితే యువరాజు గణపతిదేవుణ్ని ఏమి చెయ్యబోతున్నారు. వీళ్లే ఏదో చేసి జైతుగి మీదికి తోసేస్తే?!
అన్నమ అన్నది..
“నా కొడుకు సింహాసనంలో కూర్చోబోతున్నవేళ వాడివెంట కాకతీయ కేతనం, ఛత్రం, వీవెనలు, పంచశబ్దాలు.. లాంటి సకల లాంఛనాలూ ఉంటే.. అది కన్నులపండువగా ఉంటుంది. మహారాజు మహాదేవునితో అవన్నీ ఇక్కడే యుద్ధభూమికి వచ్చాయట. మీరే వాటిని భద్రపరచారట. స్వామీ.. మీ కొడుకు సింహాసనం అధిష్టించేవేళ..” ఆమె మాటలను తొట్రుపాటుతో ఖండించాడు రుద్రయ.
“లేవు లేవు. అవి మహారాజు పార్థివదేహంతోపాటు ఆరోజే గంగాధరమంత్రి అనుమకొండకు తీసుకువెళ్లాడు. నా దగ్గర లేవు. అయినా తొందరపడుతున్నావు అన్నమా! మన గణపతి కాకతీయ సింహాసనంపై కూర్చోవడం నాకు అంగీకారం కాదు. కుక్కపని కుక్క చెయ్యాలి.. గాడిద పని గాడిద చెయ్యాలి!”..
“నా కొడుకు కుక్క, గాడిద కాదు. జవనాశ్వం.. మహాయుద్ధ గజం..” రోషంగా అన్నదామె.
అనునయంగా ఆమె భుజంపై చెయ్యివేసి..
“చూడు అన్నమా.. కొడుకు ప్రయోజకుడైతే సంతోషించని తండ్రిని కాను నేను. కానీ, మన వంశ దృక్కోణం అది కాదు. నాకు ఇష్టంలేని దానిని నువ్వు ఆచరిస్తావా.. చెప్పు!?”.
అతని మాటలోని మమత, గొంతులోని మార్దవానికి ఆమె జవాబు చెప్పలేక భోరున ఏడ్చింది.
పరిపూర్ణమైన రుద్రయ వ్యక్తిత్వం ఆమెకు తెలుసు. భర్త అడుగుజాడల్లో కదిలే సాధ్వీలలామ ఆమె. ఎదిగిన కొడుకులను చూసుకుని ఆనందించే సగటు రాచరికపు తల్లి. కళ్లు తుడుచుకుని వెళ్లిపోయింది. నిరుత్తరుడై నిలబడిపోయాడు రుద్రయ.
తన సంశయాత్మక చిత్తం, నిర్ణయం తీసుకోవడంలో డొల్లదనం ఆయనకే తెలుస్తున్నది.
రాజు ఉన్నాడో లేడో తెలియని స్థితిలో బలహీనమైన కాకతీయరాజ్యం పట్ల ప్రధాన రాజ్యాలు చూస్తూ కూర్చోలేదు. అన్ని వైపులా దాడికి సమాయత్తమౌతున్నాయని వార్తలొస్తున్నాయి. వార్తలకన్నా వేగంగా శత్రుసేనలు నలుమూలలా చుట్టుముడుతున్నారు. వెలనాడు పృథ్వీశ్వరుడు పక్కనున్న మన సామంతరాజ్యాలను ఆక్రమించుకుంటున్నాడట. తూర్పునుంచి కులోత్తుంగచోళుడు ఓరుగల్లు వైపు దూసుకొస్తున్నాడట. పడమర ముదిగొండ నాగతిభూపాలుడు కొరివి మండలంవరకూ వచ్చేసినట్లే! దక్షిణాన మరొకడు.. మరొకడు..
అంతర్గతంగా కూడా వేర్వేరు ఆశావహులు వాళ్లతో చేతులు కలుపుతున్నట్లు అనుమకొండలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రుద్రయకు మళ్లీ సందేహం.. తన కొడుకు గణపతి చమూపతి ఎవరితోనైనా చేతులు కలుపుతున్నాడా.. ఎవరైనా సేనానులు, మండలేశ్వరులు అతనిని ఆమోదిస్తున్నారా.. ప్చ్.. ఇలా అలోచించడం రుద్రయకు కొత్త.. ఈ కుట్రలు కుతంత్రాలు ఊహకందవు. యుద్ధభూమిలోకి దూకడమే సులువు.
మహాసేనానులు, ప్రధాని గంగాధరుడు, ఇతర మంత్రులు కూడా సమాయత్తమై యుద్ధతంత్రం రూపొందించారు.
అందరి ఆశయం ఒక్కటే.. కాకతీయ కేతనం సముజ్వలంగా ఎగిరి తీరాల్సిందే! కాకతీయ ఛత్రం సింహాసనం వెనుక సమున్నతంగా నిలబడాల్సిందే!
ఒక ఓటమి చవిచూసి విజయంకోసం పరితపిస్తూ స్కంధావారంలోనే ఉన్న కాకతీయసేనలు సమధికోత్సాహంతో మహాయోధుల నాయకత్వాన నలువైపులా దూసుకుపోయాయి.
అన్నివైపులా శత్రువులను నిలువరించడం, తరమడం ప్రారంభమైంది. దేవగిరి దగ్గర స్కంధావారంలోనే ఉంటూ అన్నివైపులా యుద్ధంచేస్తున్న కాకతీయసైన్యాన్ని సమన్వయం చేస్తున్నాడు రుద్రసేనాని. అన్నివైపులనుంచి శుభవార్తలే వినవస్తున్నాయి. కసితో ఉన్న సైన్యం వీరవిహారం చేస్తున్నది.
ఆ సమయంలోనే గంగాధరమంత్రి మళ్లీ మతి చెడగొట్టాడు.
“నీ కొడుకు.. అదే.. మన యువరాజు గణపతి చమూపతి.. గొప్పగా నటిస్తున్నాడు. నిజమైన యువరాజు గణపతిదేవుడు కూడా అలా ప్రవర్తించలేడేమో!? దేవగిరి గూఢచారులను గుర్తించి వారిముందు మరీ జీవిస్తున్నాడు అచ్చమైన యువరాజులా”..
మళ్లీ దిగులు ఆవహించింది రుద్రయను.
రేపు అసలైన యువరాజు వచ్చాక వీడు సింహాసనం దిగను అంటే..
గంగాధరమంత్రి కూడా వీడినే కూర్చోబెట్టేలా ఉన్నాడు. ఆయన విజయవంతంగా తిరిగి వస్తే అప్పుడు ఏమి జరుగుతుందో.. రుద్రేశ్వరా.. నువ్వే దిక్కు..
కాకతీయసైన్యం తలో దిక్కునా మోహరించి శత్రుసైనికులను ఎదుర్కోవడం అనుమకొండ వాసుల్లో ఆనందం కలిగించింది. కారణం యువరాజు గణపతిదేవుడు మంచి యుద్ధతంత్రాలతో నాయకత్వం వహిస్తున్నాడని ప్రజలు భావించడం. అది తెలిసి రుద్రయ మరీ గందరగోళమై పోయాడు.
అప్పుడే గంగాధరుడు స్కంధావారానికి వచ్చాడు.
“రుద్రా.. నాకో ఆలోచన వచ్చింది. నిజానికి దేవగిరి సేవుణులకు ప్రధానశత్రువు మనం కాదు. హొయసల బల్లాలుడు. ఇప్పటికే ఆయన సేవుణుల రాజ్యంలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాడు. జైతుగి ఏమీ చెయ్యలేక నిస్సత్తువగా ఉండగా, తగుదునమ్మా అని మనం దేవగిరిపై దండెత్తి అన్నీ పోగొట్టుకుని దిక్కులు చూస్తున్నాం. నువ్వంటే బల్లాల మహారాజు ఇష్టపడతాడు. నువ్వే స్వయంగా వెళ్లి మన పరిస్థితి వివరించి ఆయన సహాయం అర్థిస్తే..”
ఇక చెప్పనక్కరలేదు. యుద్ధతంత్రంలో దీనికి తిరుగులేదు. దేవగిరికి తూర్పున అనుమకొండ ఉంటే దక్షిణంగా హొయసలరాజ్యం ఉంది. హొయసల బల్లాలుడు మహాయోధుడు. దేవగిరి సేవుణులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇప్పటికే కొంతభాగాన్ని ఆక్రమించాడు. ఆయనకు రుద్రదేవుడు, ఆయన తండ్రి రెండవ ప్రోలరాజు సామంతులుగా విశ్వసనీయులుగా ఉండేవారు. రుద్రసేనాని వీరోచిత యుద్ధ నైపుణ్యం ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటాడు కూడా.
అప్పటికప్పుడు ముఖ్య అంగరక్షకులతో హొయసల వైపు కదిలాడు రుద్రసేనాని.
“ఇక్కడి వార్తలు ఎప్పటికప్పుడు నీకు చేరవేస్తాను. కార్యం విజయవంతంగా నిర్వహించుకుని రా రుద్రా..” అన్నాడు గంగాధరుడు.
అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి..
“జైతుగి చావు మూడింది..” అన్నాడు బల్లాల మహారాజు.
“సమయం మాకు తెలియజెయ్యి రుద్రా.. మీకు సహాయంగా దేవగిరిపై దాడి చెయ్యడం తథ్యం..” అంటూ అభయమిచ్చాడు.
అక్కడ ఉండగానే మరోవార్త పంపాడు గంగాధరుడు. ముదిగొండ చాళక్యరాజు నాగతిభూపాలుడు విసురునాడు (కొరవి) మండలాన్ని స్వాధీన పరచుకున్నాడు. అనుమకొండ వైపు సాగివస్తున్నాయి అతని సేనలు.
‘నాగతికి అంత ధైర్యం లేదు. అనుమకొండలోనే ఎవరో సహకరిస్తున్నారు!’.. గంగాధరుడి సమాచారం.
‘కోటలో ఏవేవో జరుగుతున్నాయి. మన గణపతిమీద కూడా నాకు సందేహాలు కలుగుతున్నాయి!”.. అన్నమ సమాచారం.
ఈ వార్తకు రుద్రసేనాని ఉగ్రుడయ్యాడు. ముదిగొండ కుసుమాయుధుడిని, వాడి తమ్ముడు ఈ నాగతిని రుద్రదేవుడు ఎన్నోసార్లు తిప్పితిప్పి కొట్టాడు. అయినా వాడు సమయంచూసి ఇప్పుడు మళ్లీ ఆక్రమణ ప్రారంభించాడు. వాడికి జీవితాంతం గుర్తుండే అవమానం చెయ్యాలి.
ముఖ్య మహాసేనానులంతా వేరువేరు దిక్కులలో శత్రువులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తనే వాడి భరతం పట్టాలి. పట్టరాని క్రోధంతో వాయువేగ మనోవేగాలతో అనుమకొండకు వచ్చిపడ్డాడు. అప్పటికే ఓ అక్షౌహిణీ సేనను రుద్రయకోసం సిద్ధంచేశాడు ఆయన సేనాపతి రాజనాయకుడు. రుద్రయ యుద్ధశంఖం పూరించే నాటికే నాగతి ససైన్యంగా వికటాట్టహాసాలతో అనుమకొండలోకి చొచ్చుకు వచ్చాడు. అతని ధాటికి అనుమకొండ పురవాసులు భయంతో భీతిల్లిపోతున్నారు.
అయితే కేవలం ఒక్కపూట కాలంలో నాగతి తోక విరిచేశాడు రుద్రసేనాని. రుద్రయ రాకతో రెచ్చిపోయిన కాకతీయ సైనికులు నాగతి సైన్యాన్ని కకావికలు చేశారు. అనుమకొండ వీధుల్లో వెంటపడి నరికి చంపారు. నాగతిని పట్టి బంధించారు. అతణ్ని తన రథంవెనక చక్రానికి కట్టివేశాడు రుద్రయ. నాగతి ఛత్రాన్ని, కేతనాన్ని చింపి.. తన అశ్వాల కాళ్లకు కట్టాడు. ఓ ముక్కచింపి తన తమ్మిపడగ (ఉమ్మిబుట్ట)కు చుట్టాడు. జంట అశ్వాలు పూన్చిన తన రథాన్ని అనుమకొండ వీధివీధికీ తిప్పుతూ తమ్మిపడగలో ఉమ్మివేస్తూ.. తీవ్రాతితీవ్రంగా అవమానించి, అనుమకొండ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ఆ సమయంలో స్థానికంగా నాగతికి సహాయపడిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కనిపిస్తే ఒట్టు. తన కొడుకులు ఎక్కడైనా కనిపిస్తారని ఓ కంట వెదికాడు రుద్రయ. ఎవ్వడూ కనిపించలేదు. నాగతిని, అతని సైన్యాన్ని కొరివి దాటి, ముదిగొండ దాటి పది ఆమడల దూరం తరిమి తరిమి కొట్టి.. ఆనక శాంతించాడు.
ఈ సంఘటనతో కాకతీయ పౌరుషం, కాకతీయ సేనానుల స్వామిభక్తి గురించి తెలుగురాజ్యాలలో ఆశ్చర్యంగా చెప్పుకొన్నారు. అన్ని దిక్కులలో ఆక్రమించుకోవడానికి వచ్చిన శత్రువులు తోక ముడిచారు.
అనంతరం తిరిగి దేవగిరి పొలిమేరల్లో ఉన్న స్కంధావారానికే వెళ్లిపోయాడు రుద్రయ.
* * *
మరునాడు అన్నమ భర్తకు భోజనం తీసుకువచ్చింది.
“ఊరిలోకి వచ్చి ఇంటికి రాకపోవడం నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించారా..?!” అన్నది రోషంగా.
“నేను అనుమకొండకు పెళ్లికి రాలేదు అన్నమా! అయినా నేను తిరిగి అనుమకొండ వచ్చేది యువరాజులవారి తోనే..” అన్నాడు.
ఎన్నో రోజుల తర్వాత భార్య చేతి భోజనం. తృప్తిగా తిన్నాడు. ఆమె.. కొడుకుల ప్రస్తావన తెస్తుందని ఎదురుచూశాడు. చివరికి తనే తెచ్చాడు, “ఏమంటున్నారు నీ కొడుకులు?”.
“తండ్రి వీరవిహారం చూసి గడగడ వణకుతున్నారు”.. ఆ ఒక్కమాటతో మౌనంగా నిష్క్రమించింది అన్నమ.
అతని మనసు ఏదో శంకిస్తూనే ఉంది. చారులను నియోగిద్దామంటే తన ఇంట్లోకి తనే చారులను పంపడం..
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు కదా!!
అనుమకొండలో నాగతికి జరిగిన అవమానం తెలిసి దేవగిరి జైత్రపాలుడు క్రోధంతో రగిలిపోయాడని వార్త. గణపతిదేవుణ్ని కూడా రథానికి కట్టి దేవగిరిలో తిప్పి అవమానించాలని సమాలోచనలు చేస్తున్నట్లు వేగులు వార్తలు తెచ్చారు. గణపతిదేవుణ్ని ఎలా వదిలించుకోవాలో చెప్పండని మంత్రులను అడిగినట్లు మరో వార్త.
* * *
దేవగిరి పట్టణం బ్రాహ్మణవీధిలో హేమాద్రి పంత్ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి.
అత్యంత రమణీయంగా అలంకరించిన వివాహవేదిక.. పక్కగా ఉజ్వలంగా మండుతున్న అగ్నిహోత్రం.. అన్ని పక్కలా కూర్చుని ఏకకంఠంతో వేదగానం చేస్తోన్న వేదవేదాంగ పారంగతులు, మహారుషులు. అదొక బ్రాహ్మణ వివాహవేడుక కావటాన అక్కడ అట్టహాసాల కన్నా వైదిక శాస్త్రీయతే ఎక్కువ ద్యోతకమాడుతున్నది.
అయితే జరుగుతున్నది సాధారణ బ్రాహ్మణుని ఇంట పెళ్లి కాదు. సాక్షాత్తూ మహారాజుగారి ఆంతరంగిక సలహాదారు, మహామంత్రి హోదా కలిగిన పండితోత్తముడు, మహాకవి, శాస్త్రకోవిదుడు హేమాద్రి పంత్‌గారి ఇంట పెళ్లి.
వియ్యాలవారు కూడా సామాన్యులు కారు. కాకతీయరాజ్య మహాప్రధాని గంగాధరమంత్రి గారు.
హేమాద్రి పంత్ చేసిన ఏర్పాట్లకు తగ్గట్లు వియ్యాలవారు కూడా భారీగానే తరలివచ్చారు. నాలుగురోజుల పెళ్లికి పక్షంరోజులుగా అనుమకొండ నుంచి దేవగిరి వరకు మేనాలు, పల్లకీలు, అశ్వరథాలు, అంబారీల ఏనుగులు, గూడు ఎడ్లబళ్లు.. ప్రవాహంలా వస్తూనే ఉన్నాయి. అంతమంది తరలిరావడం ఆశ్చర్యంగానే ఉంది దేవగిరి వాసులకు.
కానీ, వారంతా బంధువుల రూపంలో ఉన్న మహాసేనానులు, అరివీర విక్రములైన యుద్ధవీరులు, మెరుపు వీరులైన లెంకలు, ఒంటరులు.. కన్నుమూసి తెరిచేలోగా ఒక్కొక్కరూ వందమందిని నోరెత్తకుండా మట్టు బెట్టగల కాకతీయ వీరాధివీరులు.. అని దేవగిరివాసులకు తెలియదు.
తమ యువరాజును రక్షించుకోవడానికి అంత్యయుద్ధానికి సమాయత్తమై మైలారదేవుడికి, రుద్రేశ్వరుడికి, పద్మాక్షికి మొక్కి.. చావోరేవో తేల్చుకోవడానికి మృత్యుగహ్వరం లాంటి శత్రువు కోటలోకి ప్రవేశించారు. నున్నని గుండ్లు.. మీసాలులేని మూతులు.. పరమ భాగవతోత్తముల్లా జంధ్యాలు సవరించుకుంటూ బ్రాహ్మణ వేషాలతో!
“అనుమకొండ శత్రువుల తాకిడితో అల్లకల్లోలంగా ఉంది. అందువల్ల యువరాజు, సేనానులు, యుద్ధ వీరులు ఎవ్వరూ రావడం లేదు. కేవలం మన బ్రాహ్మణ బంధువులే! అతిథ్యం అదిరిపోవాలి సుమా..” అన్నాడు గంగాధరుడు.. హేమాద్రి పంత్‌తో.
ఆయన హాయిగా నిట్టూర్చి..
“మా మహారాజు గందరగోళంగాడు కాబట్టి అంగీకరించాడు గానీ, పక్కలో బల్లెంలా ఉన్న కాకతీయమంత్రితో వియ్యమంటే.. మరో మహారాజు అంగీకరిస్తాడా బావగారూ..” అంటూనే ఏర్పాట్లు భారీగానే చేశాడు పంత్.
కాకతీయ యోధులు మెల్లమెల్లగా నగరమంతా తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. ఒక బృందం రాజకోటలోకి, స్త్రీవేషాలతో ఉన్న మరో బృందం అంతఃపురంలోకి కూడా చొచ్చుకుపోయారు. అందరూ లోదుస్తుల్లో బాగా నూరిన చురికలు దాచుకున్నారు. ఏ క్షణమైనా వివాహవేదిక రణవేదిక చెయ్యడానికి పెళ్లి కుమారుడితో సహా.. అందరూ సంసిద్ధులై ఉన్నారు. అందరి ధ్యేయం ఒక్కటే.. గణపతిదేవుని విడిపించుకు పోవాలి. లేదా ఇక్కడే చావాలి!
అప్పటికే లోపలనున్న వేగులు గణపతిదేవుణ్ని ఎక్కడ బంధించారో రుద్రయకు చేరవేశారు. ఆ మందిరమంతా మెరుపుయోధుల్ని నియోగించాడు రుద్రయ. పండితోత్తముడిగా పేరున్న హేమాద్రి పంత్ ఇంట వివాహం కావడంతో వేగులు, సైనికులు అక్కడ ఎవ్వరూ లేరు.
గణపతిదేవుణ్ని ఎలా తప్పించాలి.. వెంట ఎవరు ఉండాలి.. ఏ అశ్వరథం అధిరోహించాలి.. ఆ రథం ఎంత వేగంగా పోవాలి.. ఎన్ని ఘడియల్లో దేవగిరి పట్టణం దాటాలి.. చుట్టూ ఉండాల్సిన ప్రత్యేక ఒంటరి మెరుపు యోధులు.. వారి అశ్వాలు.. ఆయుధాలు.. అన్నీ ప్రణాళిక ప్రకారం సంసిద్ధం!!
అప్పుడే పెళ్లిమండపం వద్దకు యాదవుల యువరాణి సోమలదేవి వచ్చింది. సుమారు ఎత్తులో అంతంత మాత్రపుఛాయలో నిండైన అలంకరణలో రాణితనపు హోదాతో హుందాగా ఉన్న సోమలను అందరూ చూస్తుండగా.. కాకతీయయోధులు ఆ వివాహ మందిరమంతా విస్తరించి కమ్మేశారు.
తుది పోరాటానికి బయల్దేరే ముందే హొయసల బల్లాలుడికి వర్తమానం పంపి.. తమ ఎత్తుగడ వివరించాడు రుద్రయ.
హొయసల సైన్యం కూడా దేవగిరి వైపు కదిలింది.
పెళ్లి మండపం వద్దకు మహారాజు జైత్రపాలుడు వచ్చాడు. హేమాద్రి పంత్ తన బంధువులతో ఎదురేగి ఆహ్వానించి మహారాజును ఉచితాసంలో కూర్చుండబెట్టాడు. ఆయన అక్కడున్న పండితులతోనూ, కవులతోనూ ముచ్చట్లాడుతున్నాడు.
మేళతాళాలు మారుమోగుతున్నాయి. పెళ్లికుమారుడు విడిదినుంచి సన్నాయిమేళం మధ్య వచ్చి అందరికీ నమస్కరించి పెళ్లిపీటలు ఎమెక్కాడు. పెళ్లి కూతురిని మేనమామలు బంగారుతాపడం చేసిన పెళ్లిబుట్టలో మోసుకుని తెస్తున్నారు. పెళ్లి కుమార్తెతో యువరాణి సోమలదేవి మేలమాడుతూ వెంటరాగా.. నవ్వులతో సరదాలతో వేదఘోషతో ఆ పెళ్లిపందిరి అంతా కళకళలాడుతున్నది.
మరో రెండుఘడియలకు సర్వసేనాని జల్లన పరుగున వచ్చి మహారాజు చెవిలో చెప్పాడు..
“హొయసల బల్లాలుడు మనపై దండెత్తి వచ్చాడు మహాప్రభూ! బల్లాలుని మహాసైన్యం దేవగిరి పొలిమేరలకు చేరింది”..
గందరగోళమై పోయాడు జైతుగి. ఊపిరి బిగబట్టి చూస్తున్నారు కాకతీయ మెరుపువీరులు.. అప్పుడప్పుడూ చురికలపైకి వెళ్తున్నాయి వాళ్ల చేతులు. అందరిచూపు కీగంట రుద్రయ వైపే. ఆయన కనురెప్ప కదిలిస్తే చాలు.. జైతుగి వైపు ఉరకడానికి సన్నద్ధం.
దేవగిరి మహాప్రధాని బసవరసుడు, ఇతరమంత్రులు, సేనానులందరూ పరుగున అక్కడికి చేరుకున్నారు జైతుగి అనుజ్ఞ కోసం.
అప్పుడొచ్చాడు హొయసల సంధివిగ్రహి కన్నడదాసు. వెంట కాకతీయ సంధివిగ్రహి పాపయ భట్టారకుడితోపాటు సేవుణుల సంధివిగ్రహి చముండశర్మ.
జైతుగికి తనను పరిచయం చేసుకుని..
“దేవగిరి మహారాజు జైత్రపాలుర వారికి హొయసల మహారాజు బల్లాల దేవుని వారి ప్రతిపాదన. తక్షణం కాకతీయ యువరాజు గణపతిదేవుని బేషరతుగా విడిచిపెట్టాలి. లేకుంటే సంకుల సమరమే! పొలిమేరల్లోని కొన్నిగ్రామాల స్వాధీనం కాదు. ఏకంగా దేవగిరి స్వాధీనమే హొయసల వీరుల తక్షణ కర్తవ్యం!”.. స్పష్టం చేశాడు సంధివిగ్రహి కన్నడదాసు.
జైతుగి కోపంతో ఊగిపోతూ..
“ఇది కాకతీయ, సేవుణుల మధ్య సమస్య. బల్లాలునికి ఏమి పని?”.
మరుక్షణం రుద్రయ ఎగిరి దూకి.. జైతుగి నడుముదొరక బుచ్చుకుని చురిక ఆయన కంఠానికి గురిపెట్టాడు
కనురెప్ప వేయకముందే.. కాకతీయ మెరుపుయోధులు అక్కడున్న సేవుణముఖ్యులపైకి లంఘించి అందరి కంఠాలకు తమ చురికలను ఆనించారు. ఇదంతా క్షణంలో వెయ్యోవంతు కాలంలో జరిగిపోయింది.
పెళ్లి మండపం బిర్రబిగదీసుకుపోయింది. మహిళలు హాహాకారాలు, కెవ్వుకేకలతో మేళతాళాలు, వేదపఠనాలు ఆగిపోయాయి.
రుద్రయ అరిచాడు..
“రాజనాయకా! యువరాజులవారిని బంధ విముక్తులను చెయ్యి. కారాగారం నుంచి తప్పించి ఇక్కడికి తోడ్కొని రావాలి”..
అందరూ చిత్తరువులై నిలబడిపోగా.. మరి మూడు ఘడియలకు కాకతీయ యువరాజు గణపతిదేవుడు మెరుపువీరుల మధ్య వివాహ మండపానికి విచ్చేశాడు.
తమ యువరాజును చూసుకుని కాకతీయ యోధుల కన్నుల్లో ఉద్వేగం.. ఆనందబాష్పాలు..
రుద్రయ అరిచాడు..
“గంగాధరా.. చెప్పు జైత్రపాలుడి తల తుంచివేయనా.. అనుజ్ఞ ఇవ్వు!”..
“రుద్రా.. ఆగాగు! ఇది వేదమంత్రాలతో ఘోషిస్తున్న పవిత్ర వివాహ వేదిక. దీనిని రక్తసిక్తం కావించొద్దు. యువరాజును తీసుకుని నువ్వు వెళ్లిపో. నా కొడుకు వివాహం ప్రశాంతంగా జరగనివ్వు..” గంగాధరుడు కంగారుగా అన్నాడు..
దేవరసుడు, హేమాద్రి పంత్ కూడా రుద్రసేనాని ముందు మోకరిల్లారు చేతులు జోడించి.
జైతుగి ఏమీ చెయ్యలేక హుంకరించాడు..
“ఆనాడే ఈ గణపతిదేవుణ్ని నరికిపారేసి అనుమకొండ స్వాధీనం చేసుకుని రావాల్సింది. తప్పు చేశాను”..
“ఇప్పుడు మేమా తప్పుచెయ్యం జైత్రపాలా! శత్రుశేషం లేకుండా దేవగిరినంతా అగ్నిప్రీతం చేసి వెళతాం!”..
యుద్ధావేశంతో ఊగిపోతున్నాడు రుద్రయ.
అప్పుడు వినిపించింది మరో కంఠం.
“రుద్రసేనా.. జైత్రపాల మహారాజుల వారిని విడిచిపెట్టు!”..
అది హొయసలరాజు బల్లాలునిది. అప్పటికే వచ్చి ఉన్నాడాయన.
“ఇది వివాహ వేడుక. అందునా బ్రాహ్మణ పెళ్లి. ఇక్కడ కత్తులకు, చురికలకు ప్రవేశంలేదు. జరిగింది జరిగిపోయింది. కాకతీయుల వీరత్వం మాకు తెలుసు. జైత్రపాలుడు మీపై గెలిచాడు. మహాదేవరాజును సంహరించి యువరాజును బంధించారు. అలా వారూ విజయులే! కాబట్టి ఇరువురూ యుద్ధావేశాలు వదిలేయండి. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోండి..” అని చెప్పి ఆగాడు.
ఉద్రిక్తత కొంచం తగ్గింది. రుద్రయ, గంగాధరుడు గణపతిదేవుని దగ్గరికి వెళ్లారు.
జైత్రపాలుడు బల్లాలుని వద్దకు వచ్చి.. ఆయనను గొనిపోయి ఉచితాసంపై కూర్చోబెట్టి గౌరవించాడు.
సోమలదేవి తండ్రి వద్దకు వచ్చి నిలుచుంది.
అంతా చేష్టలుడిగి నిలుచుండి పోయారు. సమస్యకు ముగింపు ఏమిటో ఎవ్వరికీ స్పష్టం కావడం లేదు.
బల్లాలుడు సోమలదేవిని పరిశీలనగా చూశాడు.
ఆమెను దగ్గరికి పిలిచాడు. సాలోచనగా చెయ్యి పట్టుకుని..
నాదొక సంధి ప్రతిపాదన. కాకతీయ మహానేత, ఒకప్పటి మా సామంతుడు, మా విశ్వాసపాత్రుడు రుద్రదేవుడు నిర్వహించినదే! వివాహ బంధం. కాకతీయ యువరాజు గణపతిదేవునికి, దేవగిరి యువరాణి సోమలదేవికి వివాహం. ఇది నా ప్రతిపాదన. ఇరు పక్షాలు దీనికి అంగీకరించాలి..” అన్నాడు.
ఇందులో ‘కాదు! వద్దు!’ అనడానికి ఎవ్వరికీ అవకాశం లేదు.
“పురోహితులారా.. ఆ వివాహపీఠానికి పక్క మరొక పీఠం వెయ్యండి. ఊ.. వెళ్లండి పీఠం అలంకరించండి”..
రెండు ఘడియలు నిశ్శబ్దం. అనంతరం పుత్రికను స్వయంగా జైతుగే వేదిక పైపు తీసుకువెళ్లాడు.
రుద్రయ ముఖంలోని అంగీకారం చూసి వివాహవేదిక వైపు కదిలాడు గణపతిదేవుడు.
“ఊ.. మోగించండి భజంత్రీలు..” అంటూ అందరిలో ఉత్సాహం కలిగించి, మందిరంలో వివాహశోభ పునరుద్ధరించాడు హొయసల బలాల్లుడు.
యుద్ధతంత్రం వివాహమంత్రాలతో ముగించడం రుద్రదేవుడు నిర్వహించిన గొప్ప దౌత్యవిధానం.
కాకతీయ, యాదవుల వైరం కూడా చివరికి వివాహబంధంతోనే ముగిసింది.
స్కంధావారానికి చేరుకున్న నూతన వధూవరులతో కాకతీయ సైనికపటాలం విజయవంతంగా కదిలింది అనుమకొండ వైపు. అప్పటివరకూ దాచిపెట్టిన కాకతీయ ఛత్రం, కేతనం బయటికి తీశాడు రుద్రసేనాని. అభిషిక్త యువరాజు గణపతిదేవుని అశ్వరథానికి ముందు.. తన అశ్వంపై కేతనం చేతపట్టి పంచశబ్దాలైన భేరీ, బాకా, డోలు, ఘటం, శంఖాలు చేస్తున్న విజయధ్వానాల మధ్య సైనికులు జయజయ శబ్దాలు చేస్తుండగా కదిలాడు మహా సేనాని రేచర్ల రుద్రయ అనుమకొండ వైపు.
* * *
“చివరికి మా హొయసల మహారాజుగారు సైన్యాన్ని పొలిమేరల్లో ఉంచి సంధి ప్రయత్నం చేస్తేనే జైతుగి అంగీకరించాడన్నమాట..” అన్నాడు రుద్రేశ్వరదేవాలయ స్థపతి రామప్ప.
ఆయన ఎప్పుడు వచ్చాడో.. ఏమి విన్నాడో గానీ.. రుద్రయ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు.
“విన్నది చాలు లేవండి. రేపే సుముహూర్తం. కాకతీయ మహారాజు గణపతిదేవులవారు స్వయంగా విచ్చేస్తున్నారు.. దైవప్రతిస్థాపన నిమిత్తం. రుద్రసేనాని నిలబెట్టిన కాకతీయకేతనం, ఛత్రం రేపు మనమంతా చూద్దాం”.. అన్నాడాయన.
అంతా కదిలారు. రుద్రయ, రామప్ప దేవాలయ ప్రాంగణమంతా కలియతిరుగుతూ గర్భాలయం వరకు వెళ్లి అక్కడ ఆగారు.
“మీ దంపతుల మిథునశిల్పం అందరినీ ఆకర్షిస్తున్నది. మీరేమో.. ‘వద్దు! అది తీసివేయండి!’ అని పోట్లాడుతున్నారు”..
“అవును రామప్పా! అది రేపు ప్రభువులు చూస్తే”..
“ఈ దేవాలయ అద్భుతాలలో నిర్మాణదారు జంటశిల్పం కూడా ఒకటి. ముందు చక్రవర్తులవారిని చూడనివ్వండి మహాసేనాని. ప్రభువులకు మీరంటే ఎంతో గౌరవం. పితృసమానులుగా గౌరవిస్తారు. ఆ విగ్రహ ఏర్పాటు గురించి గతంలోనే వారికి విన్నవించాం. సంప్రదాయ విరుద్ధం కాబట్టి తొలగించమంటే అప్పుడు ఆలోచిద్దాం..” ఇలా రెండేళ్లుగా నచ్చజెబుతున్నాడు రామప్ప.
రుద్రయ, అన్నమల మిథునశిల్పం చెక్కి గర్భాలయ ప్రవేశ ఎడమద్వారంపై ఏర్పాటు చేశాడు రామప్ప.
అన్నమ శిల్పాన్ని చూస్తుంటే.. స్కంధావారం నుంచి అనుమకొండ వచ్చాక జరిగిన సంభాషణ గుర్తొచ్చింది రుద్రయకు.
* * *
కాకతీయ మహారాజుగా గణపతిదేవుణ్ని సింహాసనంపై కూర్చోబెట్టేవరకూ విశ్రాంతి లేదు రుద్రయకు.
శాస్త్రోక్తంగా సమస్త లాంఛనాలతో విధివిధానాలతో అభిషిక్తుడయ్యాడు గణపతిదేవుడు.
కాకతీయచరిత్రలో మరో అధ్యాయం ప్రారంభమయ్యింది.
ఆ రాత్రి భోజనాలవేళ ఎప్పటినుంచో మనసులో ఉన్న భావనలు బయటికొచ్చాయి.
“ఆనాడు.. గంగాధరుని కొడుకు పెళ్లికి ఆహ్వానించినా దేవగిరి ఎందుకురాలేదు నువ్వూ.. నీ కొడుకులు?”.. మెల్లగా, మెత్తగా అడిగాడు రుద్రయ. ఉహించని ప్రశ్న హఠాత్తుగా వచ్చేసరికి ఖంగుతిన్నది అన్నమ.
“పిల్లల యుద్ధతంత్రాలు, ప్రయాణాలు నాకు తెలియదు. అక్కడ జరగబోయే బీభత్సం ఉహించే నేను రాలేదు”..
“ముదిగొండ నాగతికి.. మన తాత్కాలిక యువరాజు సహాయపడ్డాడని నా సందేహం.. నిజమేనా?”.
“నాకూ సందేహమే! కానీ, వాడు మీ కొడుకు. రేచర్ల బిడ్డ. తప్పుచెయ్యడు.. కానీ కానీ..” ఆమె కంఠం వణికింది.
ద్రయకు కూడా సంభ్రమం. ఏం జరిగి ఉంటుంది.. చెప్పమన్నట్లు చూశాడు ఆమెవైపు.
“ప్రతిరోజూ నన్ను రాజప్రాసాదానికి రమ్మని పల్లకి పంపేవాడు. ఆరోజు పిలుపు లేదు. పల్లకి రాలేదు. సందేహం కలిగి నేనే వెళ్లాను.. భోజనం తీసుకుని మరీ..”
“అదేమిటి? రాజనగరానికి నువ్వు భోజనం తీసుకెళ్లడం ఏమిటి?”.
“అవును. వాడికిష్టమైన దద్ద్యోజనం వండి విషం కలిపి తీసుకెళ్లాను. వాడేమైనా తండ్రి మాటను జవదాటుతు న్నాడేమోనన్న సందేహం.. ఎక్కడో.. మనసు మూలల్లో! అదే జరిగితే వాడికి ముద్దలు చేసి తినిపిద్దామని..” ఆమె ఒక్కసారిగా బిగ్గరగా ఏడ్చింది.
“నాబిడ్డ అలాంటివాడు కాదు మహాసేనాని.. కాదు..” అలా చాలాసేపు భారం తగ్గేవరకు ఏడ్చిఏడ్చి తలతిప్పి భర్తను చూసింది.
ఉత్తరీయంతో కళ్లు తుడుచుకుంటున్నాడు మహాసేనాని రుద్రయ.
* * *
నడుముకున్న ఉత్తరీయం తీసి కళ్లొత్తుకున్నాడు రుద్రసేనాని.
“ఆమె.. ఈ దేవాలయంలో ఉండాల్సిందే! నీతో అంగీకరిస్తున్నాను స్థపతి”..
మరునాడు.. ముహూర్తం సమీపిస్తున్నది. దేవాలయ ప్రాంగణమంతా మామిడితోరణాలతో, అరటి స్తంభాలతో అలంకరించారు.
మంత్రులు, సేనానులు, మండలేశ్వరులు, శిల్పాచార్యులు, పండితులు, కవులు, రాజ్య, మండల ప్రముఖులు, ఆతుకూరు గ్రామస్తులు.. తొలిసారి దేవాలయ ప్రాంగణంలో తిరుగాడుతూ ఆలయ విన్నాణానికి, నిర్మిత విధివిధాలకు, శిల్పాల అందచందాలకు, విభిన్న అంశాలను ఏర్చి కూర్చిన రూపకల్పనకు దిగ్భ్రమలో ఉండిపోతున్నారు.
స్థపతి రామప్ప, నిర్మాణదారు రేచర్ల రుద్రసేనాని హడావుడిగా తిరుగుతూ ఎక్కడా తప్పులు దొర్లకుండా పరికిస్తున్నారు.
రాచబాటపై కలకలం.. కాకతీయచక్రవర్తి, మహా మండలేశ్వరుడు, దాయగజకేసరి శ్రీశ్రీశ్రీ గణపతి దేవుల వారి ఆగమన సందోహం..
అందరూ ఎదురు చూస్తున్నట్లే దూరంగా ఎగురుతూ ముందు కనిపిస్తున్నది కాకతీయ కేతనం.. సముజ్వలంగా సమున్నతంగా!
ముందు కేతనంపట్టి అశ్వంపై వస్తున్నవాడు రేచర్ల మండలేశ్వరుడు, రుద్రసేనాని వారసుడు గణపతి చమూపతి.
వెనక సప్తాశ్వరథ సమారూఢమైన రథంపై గణపతిదేవుడు.. ఆయనకు వెనగ్గా పైయెత్తున అటూ ఇటూ కదలుతున్నాయి రెండు కాకతీయ ఛత్రాలు.. చేతపట్టినవారు లోకచమూపతి, కాటయ చమూపతి. రేచర్ల ఘనవంశ వారసులు.. రుద్రయ కుమారులు.
ఎత్తయిన రుద్రేశ్వర దేవాలయ అంచున నిలబడి ఆ మనోహర దృశ్యాన్ని సజలనయనాలతో వీక్షిస్తున్నవారు రేచర్ల రుద్రయ – అన్నమ పుణ్య దంపతులు.
* * *
మత్తి భానుమూర్తి మచిలీపట్నంలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ (ఎకనామిక్స్), థియేటర్ ఆర్ట్స్‌లో నటన, దర్శకత్వంలో డిప్లొమా చేశారు. ఈనాడు దినపత్రికలో రెండేళ్లు, స్టేట్ బ్యాంక్‌లో నలభై ఏళ్లు ఉద్యోగం చేశారు. రాసిన కథలు తక్కువే అయినా.. అవన్నీ పాఠకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే! యండమూరి వీరేంద్రనాథ్లో కలిసి ఓ నవల రాశారు. కొన్ని నాటికలు, రేడియో, టీవీ, సినిమాలకు పనిచేసిన అనుభవం ఉన్నది. ‘కాకతీయ కేతనం’.. కాకతీయ రాజ్యచరిత్రలోని ఓ అతిముఖ్య ఘట్టాన్ని తెలియజెప్పే చారిత్రక అంశాన్ని తీసుకుని రాసిన కథ. ‘చారిత్రక కాల్పనిక సాహిత్యంలో నవలలు పుంఖానుపుంఖంగా రాసినా.. కథలు రాయడం చాలా కష్టం! దానిని గుర్తించి బహుమతి నివ్వడం గొప్ప విషయం’ అంటున్నారు రచయిత. నమస్తే తెలంగాణ – బతుకమ్మ మ్యాగజైన్లో వీరి నవల.. ‘జాయసేనాపతి’ ప్రస్తుతం ధారావాహికగా వస్తున్నది.