నీటిగోసతో అలమటించే కరవు నేలకు జలకళ తెచ్చి, దండగన్న సాగును పండుగలా మార్చేందుకు కేసీఆర్ చేసిన మేధోమథనం ఫలితంగా ఆవిర్భవించిన కాళేశ్వరం జలాశయాలతో కాంగ్రెస్ ఆటలాడుకుంటున్నది. సాకులతో పడావు పెట్టింది. చివరకు మరమ్మతులు చేసి ఉపయోగించుకుంటామని అంటున్నప్పటికీ అది జరిగేందుకు మరో రెండేండ్లు పట్టవచ్చు. ఈలోగా ఇసుక మాఫియా ఇష్టారాజ్యాన్ని చెలాయించేందుకు సర్కార్ ద్వారాలు తెరుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బరాజ్‌ల భద్రతను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసింది. జలాశయాల్లోని ఇసుకను తరలించే ముఠాలతో చేతులు కలిపి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నది. అధికారం అండ ఉంటే ఆపేది ఎవరు అన్న రీతిలో ఇసుక మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తుండటం గమనార్హం. బరాజ్‌ల భద్రత రీత్యా పెద్దఎత్తున ఇసుక తరలింపు ఆమోదయోగ్యం కాదనేది తెలిసిందే. అన్నారం బరాజ్ నుంచి ఇసుక తీయడానికి మైనింగ్ కార్పొరేషన్ టెండర్లు పిలువడం దుర్మార్గం. బరాజ్ మనుగడను కూడా ప్రశ్నార్థకం చేస్తున్న కాంగ్రెస్ పాలకుల వైఖరి కుట్రపూరితంగా కనిపిస్తున్నది. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్లు కుంగిన ఘటనపైనా అనుమానాలున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వివిధ బరాజ్‌ల వద్ద ఇసుక తోడటం ద్వారా వాటి మనుగడకు ముప్పు తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నారని అనుమానం.
ఇంతకూ ఇసుక తొలగింపు ఎందుకు జరుగుతున్నది అనేది పరిశీలిస్తే మనకు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ‘తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం’ అన్న చందంగా నీటిపారుదలశాఖ వింత సమాధానం చెప్తున్నది. అన్నారం బరాజ్ పియర్స్, ఫ్లోర్ భాగాల పరీక్షల కోసం ఇసుకను తొలగిస్తున్నామని ప్రకటించింది. రోజుకు 700 లారీల ఇసుకను యథేచ్ఛగా మార్కెట్‌కు తరలిస్తూ జేబులు నింపుకొంటుండటం వైపరీత్యమే.
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత వాగులను అడ్డాగా చేసుకుని అక్రమార్కులు బరితెగిస్తున్నారు. గత ప్రభుత్వం వాగులపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లను ఇసుక కోసం దుండగులు పేల్చివేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చెక్‌డ్యామ్‌ల కూల్చివేతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. చెక్‌డ్యామ్‌లు కూల్చివేతలపై నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కనీసం స్పందించని ఉదంతాలు చూశాం. పోలీసులపై పైస్థాయి నుంచి ఒత్తిడి వస్తున్నదని, ఇసుక మాఫియాకు పెద్దలు కొమ్ముకాస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించి, నిజాలు నిగ్గు తేల్చకపోవడంతో ఈ తరహా ప్రచారానికి బలం చేకూరుతున్నది. కూలిన చెక్‌డ్యామ్‌ల తీరు చూస్తుంటే వాటిని కుట్రపూరితంగా పేల్చివేసినట్టు స్పష్టమవుతున్నదని ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన రాజేంద్రసింగ్ క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత తెలిపారు. ఇరిగేషన్ నిపుణులు కూడా ఇదే వాదనను పలుసార్లు తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టి రైతులకు అందించాలనే సంకల్పంతో చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మానేరు, మున్నేరు, ఆకేరు, పాలేరు, స్వర్ణ, పెద్దవాగు, కూడవెల్లి, చలివాగు, నారింజవాగు, బొగ్గులవాగు వంటి పలు ముఖ్యమైన వాగులపై 1100 చెక్‌డ్యామ్‌లు నిర్మించింది. ఒక్క మానేరు నదిపైనే 114 చెక్‌డ్యామ్‌లు వెలిశాయి. మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులతో వీటిని అనుసంధానం చేసి, క్రమం తప్పకుండా నీటిని విడుదల చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు రాక ఇసుక మాఫియాకు పండుగలా మారింది. చెక్‌డ్యామ్‌ల వద్ద భారీగా మేటలు వేసిన ఇసుక లాభాల వేటకు బలవుతున్నది.. నీరు నిల్వ ఉన్నప్పుడు ఇసుక తవ్వకాలు అసాధ్యం కాబట్టి, ఏకంగా చెక్‌డ్యామ్‌లను పేల్చివేయడానికి కూడా వెనుకాడటంలేదు. ఇష్టారీతిన ఇసుక తోడివేయడం చెక్‌డ్యామ్‌లకు ప్రమాదమే. ఇప్పుడు తాజాగా బరాజ్‌ల వద్ద కాంగ్రెస్ పాలకుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 38 ద్వారా ఇసుక పాలసీ రూపొందించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేసి, ఇసుక నిర్వహణ అనుమతులపై పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ పాలకులు రాజకీయ కక్ష సాధింపుల కోసమో, గత ప్రభుత్వంపై బురదజల్లేందుకో ఇసుక అక్రమార్కులు ఇచ్చే ప్రయోజనాల కోసమో చోద్యం చూస్తే.. పర్యావరణం విధ్వంసమై, రైతుల జీవితాలు, వ్యవసాయం డోలాయమానంలో పడిపోతాయి.