హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలు అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలకు వచ్చే వారికి ఓ కప్పు చాయ్ ఇచ్చేందుకు అక్కడి అధికారులు నానా తంటాలు పడాల్సి వస్తున్నదనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. ప్రతి చాయ్కీ, ప్రతి భోజనానికీ లెక్క చెప్పాల్సి రావడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. ఇంతకుముందు నోటి మాటగా చెబితే చాయ్ వచ్చేదని, కానీ, ఇప్పుడు ఇండెంట్పై సంతకం పెడితే తప్ప చాయ్ వచ్చే పరిస్థితి లేదని సమాచారం. అయితే, సచివాలయ ఆరో అంతస్తులో చాయ్, టిఫిన్, భోజనాల ఖర్చు భారీగా అవుతున్నదనే అభిప్రాయాలు ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమైనట్టు తెలిసింది.
ఇటీవల భోజనాలు సరఫరా చేసే కాంట్రాక్టర్కు భారీ మొత్తంలో బిల్లులు పెండింగ్లో పెట్టడంతో సదరు కాంట్రాక్టర్ ఆరో అంతస్తులోకి భోజనాల సరఫరాను నిలిపివేసినట్టు వార్తలొచ్చాయి. ఇది సచివాలయ వర్గాల్లో రచ్చ రచ్చ అయింది. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు తెలిసింది. చాయ్, కాఫీ, భోజనాల ఖర్చులు తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అందుకు ఇకపై లెక్క ప్రకారమే టీ, కాఫీ, భోజనాలు సరఫరా చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే టీ, కాఫీ, భోజనాల కోసం ఇండెంట్ పెట్టాలని ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సదరు అధికారులు సంతకం పెట్టి ఆర్డర్ ఇస్తేనే సరఫరా చేస్తున్నారని తెలిసింది. దీనిపై సీఎంవో, సీపీఆర్వో అధికారులు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కార్యాలయానికి వచ్చే వారి ముందు సంతకం పెడుతుంటే ఇజ్జత్ పోతున్నదని, తమను కలువడానికి వచ్చేవారికి కనీసం చాయ్ తాగించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఓ అధికారి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.