కారేపల్లి, అక్టోబర్ 03 : ఖమ్మం పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సెప్టెంబర్ 29న నిర్వహించిన అస్మిత సిటీ రగ్బీ లీగ్ పోటీల్లో కారేపల్లికి చెందిన వైరా మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అండర్-15 విభాగంలో రన్నరప్‌గా నిలవగా, అండర్ -18 విభాగంలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విద్యార్థులు సాధించిన విజయాల పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ డి.సావిత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విజేత విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా శిక్షణ అందిస్తూ, వారిలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేసిన పీఈటీ, పీడీలను ప్రత్యేకంగా ప్రశంసించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.