లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో షోయెబ్ అక్తర్(Shoaib Akhtar) చేరబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సమీప భవిష్యత్తులో తానేమీ పీసీబీలో చేరడం లేదని పాక్ మాజీ బౌలర్ షోయెబ్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు. క్రికెట్ రాజకీయాలకు దూరంగా ఉండాలని తన తల్లి తనకు అడ్వైజ్ చేసినట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్ క్రికెట్‌కు చీఫ్ సెలెక్టర్ గానో లేక మరేదో కీలక పోస్టులో షోయెబ్ అక్తర్ రానున్నట్లు ఇటీవల సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలోనూ వార్తలు వ్యాపించాయి. అయితే ఆ ఊహాజనిత వార్తలను అక్తర్ ఖండించారు.
పాకిస్థాన్ రాజకీయాలతో పాటు పీసీబీకి దూరంగా ఉండాలని తన తల్లి ఇచ్చిన సలహాను పాటించనున్నట్లు అక్తర్ చెప్పారు. పీటీవీ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం తాను హూస్టన్ పర్యటనలో ఉన్నట్లు చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్‌కు బెస్ట్ విషెస్ చెప్పిన అతను, పాక్ క్రికెట్ బోర్డులో ఏ పొజిషన్లోనూ బాధ్యతలు చేపట్టబోనన్నాడు. పీసీబీ చైర్మెన్ మోషిన్ నఖ్వీని ఇటీవల కలిసినట్లు వస్తున్న వార్తల అంశంపై మాత్రం అక్తర్ స్పందించలేదు.