ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా ప్రెసిడెంట్, సీఈవోగా జెన్సన్ హువాంగ్ తిరిగి నియమితులయ్యారు. ఆయన పునర్నియామకానికి బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది.
- పునర్నియామకానికి బోర్డు ఆమోదం
- తిరిగి చేర్చుకోబోమని ప్రకటించిన కొద్ది రోజులకే యూటర్న్
- ఎన్విడియా పగ్గాలు చేపట్టేందుకు జెన్సనే సరైన వ్యక్తి అని ప్రకటన
- నియామకాన్ని స్వాగతించిన ట్రంప్
- దూసుకెళ్లిన ఎన్విడియా షేర్లు
వాషింగ్టన్: ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా ప్రెసిడెంట్, సీఈవోగా జెన్సన్ హువాంగ్ తిరిగి నియమితులయ్యారు. ఆయన పునర్నియామకానికి బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. చైనా గూఢచారి అయి ఉండవచ్చన్న అనుమానాలున్న మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో జెన్సన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘ఎన్విడియాకు నాయకత్వం వహించడానికి జెన్సెనే సరైన వ్యక్తి అని, ఆయనను తిరిగి నియమించడం మా వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారుల ప్రయోజనాలకు అనుకూలమని బోర్డు భావిస్తున్నది’ అని బోర్డు చైర్మన్ హార్వే సి.
జోన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. జెన్సన్ పునర్నియామకం గురించి ఆదివారం ఆయనతో మాట్లాడానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సీఎన్బీసీతో మాట్లాడుతూ జెన్సన్ పునర్నియామకానికి తానే కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ‘నా జోక్యం చాలా ముఖ్యమైందని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు. జెన్సన్ తిరిగి రావడంపై జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలు లేవని తన ప్రభుత్వం ఎన్విడియాకు హామీ ఇచ్చిందని ట్రంప్ చెప్పారు. బోర్డు సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడారా అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పలేదు. అయితే, ‘సాధారణంగా చెప్పాలంటే బోర్డులో నాకు ప్రాతినిధ్యం ఉన్నది’ అని అన్నారు.
గౌరవంగా భావిస్తున్నా: జెన్సన్
కంపెనీకి తిరిగి రావడాన్ని ‘గౌరవంగా భావిస్తున్నానని’, ‘అత్యంత వినయంతో, కొత్త నిబద్ధతతో’ బాధ్యతలు స్వీకరిస్తున్నానని హువాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వల్పకాలం నెలకొన్న గందరగోళ సమయంలో నాయకత్వం వహించిన జోన్స్, తాత్కాలిక సీఈవో కొలెట్ క్రెస్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. క్రెస్ తిరిగి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్విడియా కార్యనిర్వాహక సిబ్బందికీ హువాంగ్ ధన్యవాదాలు చెప్పారు. ‘అసాధారణమైన మద్దతు ఇచ్చిన మా ఉద్యోగులు, వాటాదారులు, పరిశ్రమలోని నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములకు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని హువాంగ్ ప్రకటనలో పేర్కొన్నారు.
దూసుకెళ్లిన షేర్లు
జెన్సన్ తిరిగి వస్తున్నట్లు ప్రకటించిన కొద్ది క్షణాల్లోనే సోమవారం మార్కెట్ ప్రారంభంలో ఎన్విడియా షేర్లు 33 శాతం పెరిగి 165.57 అమెరికా డాలర్లకు చేరాయి. ఆ ధర అక్టోబర్‌లో షేరు చేరిన 239.24 అమెరికా డాలర్ల అత్యధిక స్థాయి కంటే చాలా తక్కువే. ట్రంప్‌కు హువాంగ్‌తో సన్నిహిత వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి కూడా ఆయనను తిరిగి నియమించాలని ట్రంప్ కోరారు. హువాంగ్ను తిరిగి నియమించడాన్ని ‘సరైన, సముచిత నిర్ణయం’గా ట్రంప్ అభివర్ణించారు. ‘కంపెనీ మాత్రమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ విజయం, సుసంపన్నతను నిర్ధారించడానికి ఎన్విడియాలో జెన్సన్ నాయకత్వం దేశానికి అవసరం’ అని ఆయన సోమవారం సామాజిక మాధ్యమాల్లో రాశారు. ఎన్విడియా తన అంతర్గత దర్యాప్తును కొనసాగించాలని కూడా కోరారు.
దర్యాప్తు జరపాలని డిమాండ్లు
చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో ఒకటి సహా వివాహేతర సంబంధాలు ఉన్నాయని జెన్సన్ హువాంగ్ అంగీకరించిన తర్వాత కంపెనీలో నెల రోజులు వేగంగా పరిణామాలు జరిగాయి. ఆలిస్ హువాంగ్ చైనా కోసం గూఢచర్యం చేసి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. ఈ అంగీకారం, దాని తర్వాత వాషింగ్టన్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా షేరు మార్కెట్లో ఒడిదొడుకులకు కేంద్రంగా మారింది.
జెన్సన్ హువాంగ్ ప్రవర్తన, ఎన్విడియా చిప్‌ల అమ్మకాలు, ఎగుమతి నియంత్రణల అమలుపై దర్యాప్తు జరపాలని చట్టసభ సభ్యులు, ఇతర ఎన్నికైన ప్రతినిధులు కోరారు. ఆలిస్ హువాంగ్ చైనా గూఢచారి కాదా అన్న అంశంపై న్యాయ విభాగం ఎలాంటి నిర్ధారణకు రాలేదని ఈ నెలలో సంబంధం లేని ఒక మీడియా సమావేశంలో బ్లాంచ్ విలేకరులకు తెలిపారు. ‘డీవోజే దర్యాప్తు చేస్తున్నది లేదా దీనిని పరిశీలిస్తున్నది అన్నది మాత్రమే నేను చెప్పగలను’ అని బ్లాంచ్ అన్నారు. ఆలిస్ హువాంగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన సింగపూర్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ మెగాస్పీడ్పై ఎగుమతి నియంత్రణల ఉల్లంఘన జరిగి ఉండవచ్చన్న అంశంలో న్యాయ విభాగం క్రిమినల్ దర్యాప్తు చేస్తున్నది.
ఉద్యోగుల మద్దతు
జెన్సన్కు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఆయన మద్దతుదారులు ఆన్లైన్లో పిటిషన్ ప్రారంభించారు. ప్రస్తుత, మాజీ ఎన్విడియా సిబ్బంది, పెట్టుబడిదారులు, ఎలాన్ మస్క్‌తో పాటు ఇతర సిలికాన్ వ్యాలీ మద్దతుదారులు దీనిపై పెద్ద సంఖ్యలో సంతకాలు చేశారు. కంపెనీ కోరితే తిరిగి రావడాన్ని ‘గౌరవంగా భావిస్తానని’ హువాంగ్ ఆన్లైన్లో సందేశం పెట్టారు. అయితే, ఆయనను తిరిగి నియమించే ఉద్దేశం లేదని అప్పట్లో బోర్డు సమాధానమిచ్చింది. పారదర్శకతపై ఆందోళనలతో టెక్ రంగ నాయకుడిని తొలగించి, ఉద్యోగులు నుంచి మద్దతు వెల్లువ రావడంతో కొద్ది రోజుల్లోనే తిరిగి నియమించడం ఇదే తొలిసారి కాదు. మూడేండ్ల కిందట అధికార పోరాటం మధ్య ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్‌మన్‌ను సీఈవో పదవి నుంచి తొలగించారు. ఉద్యోగులు తిరుగుబాటు చేయడంతో కొద్ది రోజుల్లోనే ఆయనను మళ్లీ నియమించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

