బొట్టు పెట్టి.. ‘దీక్షా దివస్’కు ఆహ్వానం!
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కి ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైన రోజు అది. 2009 నవంబర్ 29న దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను పోలీసులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తా వద్ద అరెస్టు చేసి ఖమ్మం తరలించారు.
- తెలంగాణ ఉద్యమ చరిత్రకు సాక్షిగా నిలిచిన అలుగునూర్ n కేసీఆర్‌ను అరెస్టు చేసిన చోటే భారీ బహిరంగ సభ
- 29న సభ సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ నేతల సన్నాహాలుహాజరు కానున్న కేటీఆర్
- భారీగా జన సమీకరణ
- కరీంనగర్లో బొట్టు పెట్టి ఆహ్వానించిన ఎమ్మెల్యేలు గంగుల, సంజయ్ కల్వకుంట్ల
కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కి ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైన రోజు అది. 2009 నవంబర్ 29న దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను పోలీసులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తా వద్ద అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. ఆ ఘటన తో తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం మరింత ఉధృతమైంది. అలాంటి చారిత్రక ఘట్టానికి సాక్షిగా నిలిచిన అలుగునూర్లోనే ఇప్పుడు దీక్షా దివస్ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉద్యమ చరిత్రను మరోసారి గుర్తుచేస్తూ.. ఆ పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 29న అలుగునూర్ వద్ద భారీ బహిరంగ సభకు పార్టీ సమాయత్తమవుతున్నది. సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ జన సమీకరణకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
అలుగునూర్తో విడదీయలేని అనుబంధం
2009 నవంబర్ 29.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైన రోజు. ప్రత్యేక రాష్ట్ర సాధ న కోసం అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. సిద్దిపేటలో దీక్ష ప్రారంభించేందుకు కరీంనగర్ నుంచి బయలుదేరిన ఆయ న్ను పోలీసులు అలుగునూర్ చౌరస్తా వద్ద అడ్డుకొని అరెస్టు చేశారు. అనంతరం ఖమ్మం జైలుకు తరలించారు. ఈ అరెస్టు వార్త తెలంగాణ ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా విద్యార్థు లు, యువత, ఉద్యోగులు, వివిధ ప్రజా సం ఘాల నాయకులు ఆందోళనలకు దిగారు. తెలంగాణ సాధన కోసం సాగుతున్న పోరాటం మరింత విస్తృతం కాగా, అరెస్టు అనంతరం ఖమ్మం జైలులోనూ కేసీఆర్ దీక్ష కొనసాగించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినప్పటికీ ఆయన నిరాహార దీక్ష కొనసాగించారు. దీంతో డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వా త చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, డిసెంబర్ 23న కేంద్రం చేసిన తదుపరి ప్రకటనతో ఉద్యమం మరింత విస్తరించింది. చివరకు కేసీఆర్ సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్టుకు వేదికైన అలుగునూర్‌లో దీక్షా దివస్ సభ నిర్వహించడం ద్వారా నాటి ఉద్యమ ఘట్టాన్ని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. గతంలో కేసీఆర్‌ను అరెస్టు చేసిన చౌరస్తా.. ఇప్పుడు దీక్షా దివస్ సభకు వేదిక కావడం ఈ కార్యక్రమానికి చారిత్రక నేపథ్యాన్ని జోడిస్తున్నది.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్
దీక్షా దివస్ సభను బీఆర్ఎస్ పార్టీ ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్షకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ఉద్యమంలో పాల్గొన్న పార్టీ నాయకు లు, కార్యకర్తల పాత్రను ఈ సభ ద్వారా గుర్తుచేయనున్నది. ముఖ్యంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజకీయంగా చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో ఉద్యమ చరిత్రను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడం బీఆర్ఎస్కు రాజకీయంగా, సంస్థాగతంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ భారీ బహిరంగ సభకు కేటీఆర్ హాజరుకానుండటంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టిసారించింది.
ఇంటింటికీ బొట్టు.. ఆత్మీయ ఆహ్వానాలు
సభకు ప్రజలను ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు బొట్టు పెట్టి దీక్షా దివస్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్లో మహిళలతో కలిసి మాజీ మంత్రి గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో ఇంటింటికీ బొట్టు పెట్టే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజలను వ్యక్తిగతంగా కలిసి సభకు ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నారు. ఇదే సమయంలో వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. డప్పు చప్పుళ్లతో ప్రజలకు సభ గురిం చి తెలియజేసేలా ప్రణాళికలు రూపొందించారు. సామాజిక మాధ్యమాల్లో సభకు సం బంధించిన పోస్టర్లు, ఫొటోలు, వీడియోలు, ప్రచార సమాచారాన్ని విస్తృతంగా పంచుకునేలా పార్టీ శ్రేణులకు సూచనలు చేస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా సమావేశాలు
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెం బ్లీ నియోజకవర్గాల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు ఆయా నియోజకవర్గ ఇన్చార్జీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సభ విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు దీక్షా దివస్ ప్రాధాన్యాన్ని వివరించాలని సూచిస్తున్నారు.
అలుగునూర్‌లో ముమ్మరంగా ఏర్పాట్లు
మరోవైపు తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తా వద్ద సభా ప్రాంగణం సిద్ధం చేసే పనులు ప్రారంభించారు. భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున మైదానాన్ని చదును చేస్తున్నారు. సభా వేదిక, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రవాణా, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలపై పార్టీ నాయకులు దృష్టిసారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించేందుకు సమన్వయ చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా దీక్షా దివస్ చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడంతోపాటు కేసీఆర్ అరెస్టుకు సాక్షిగా నిలిచిన అలుగునూర్లోనే సభ నిర్వహించడం ద్వారా నాటి ఉద్యమ జ్ఞాపకాలను నేటితరానికి తెలుపడానికి బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటున్నది. ఇంటింటికీ బొట్టు పెట్టి ఆహ్వానించడం నుంచి గ్రామస్థాయి సమావేశాలు, సామాజిక మాధ్యమాల ప్రచారం వరకు పార్టీ శ్రేణులు విస్తృత కార్యాచరణ చేపట్టాయి. ఇదే సమయంలో విభిన్న వర్గాలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడానికి సమాయత్తం అవుతుండటంతో సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎందుకంత ప్రాధాన్యం?
రాష్ట్ర సాధన కోసం సాగిన మలి దశ ఉద్యమంలో నవంబర్ 29 ఒక మలుపుగా నిలిచింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమి తి ఆవిర్భవించినప్పటి నుంచి రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వివి ధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో ఉద్యమం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. కేసీఆర్ అరెస్టు, ఖమ్మం జైలు పరిణామా లు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు తెలంగాణ సమాజంలోని వివిధ వర్గాలను ఉద్యమంలోకి తీసుకొచ్చాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళలు, యువత, ప్రజా సంఘాల నాయకులు పెద్దఎత్తున ఉద్యమంలో భాగస్వాములయ్యారు. మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్‌రోకో, వంటావార్పు, బంద్‌లు, సకల జనుల సమ్మె వంటి కార్యక్రమాలతో తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా విస్తరించింది. ఒక నాయకుడి దీక్షను గుర్తుచేసుకునే రోజు గా కాకుండా.. రాష్ట్ర సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలను కూడా స్మరించుకునే రోజుగా బీఆర్ఎస్ నాయకులు అభివర్ణిస్తున్నారు.

ఆకట్టుకుంటున్న వాల్‌రైటింగ్స్
ఈ నెల 29న కరీంనగర్‌లోని అలుగునూరులో నిర్వహించే దీక్షాదివస్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో వాల్‌రైటింగ్స్ ద్వారా ప్రజలకు సభ వివరాలను తెలియజేస్తున్నారు. గ్రామాల్లో వాల్‌రైటింగ్స్, పోస్టర్లను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పలు గ్రామాల్లో కేసీఆర్ పోస్టర్లను చూసి ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు.
స్టాఫ్ ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

