నల్లగొండ, ఆగస్టు 13 : వయసు పైబడి కడుపున పుట్టిన పిల్లలు పట్టించుకోక ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే పండుటాకులకు రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకంలో అవకాశం ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేలు…మిగిలిన వారికి నాలుగువేలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రేసోళ్ల మాటలు నమ్మి ఓటు వేసిన వారిలో మొదటి స్థానం వృద్ధులదే. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఇప్పటికి ఒక్క పింఛన్ ఇవ్వని ప్రభుత్వం ఈ నెలలో ఇస్తామని చెబుతూ ఆ పథకానికి వృద్ధులను దూరం చేసింది. దీంతో చరమాంకంలో ఉన్న పండుటాకులు కుమిలిపోతున్నారు. అన్ని వర్గాల వారికి పింఛన్ ఇస్తామంటున్న కాంగ్రెస్ సర్కార్ తమపై ఎందుకు సీతకన్ను వేసిందో అర్థం కాక మథనపడుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికే ‘చేయూత’ఇవ్వాలని సర్కార్ నిర్ణయించుకోగా..రాష్ట్రంలో అర్హులైన వృద్ధులే సుమారు నాలుగు లక్షల మంది ఉన్నారనే ప్రాథమిక అంచనాతో వారిని పక్కన పెట్టి మిగిలిన వారికి ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ నెల 31 వరకు పింఛన్ కోసం మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జిల్లాలో ప్రస్తుతం వివిధ విభాగాల కింద మొత్తం పింఛన్ తీసుకుంటున్న వారు 199 087 మంది ఉంటే వారిలో వృద్ధులే 69 507 మంది ఉన్నారు. బీఆర్ఎస్ సర్కార్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా 2022లో నల్లగొండ జిల్లాలో అందరికీ ఆసరా పథకం కింద పింఛన్ ఇవ్వటంతో అర్హులైన వారికి ఇప్పటి వరకు పింఛన్ అందుతోంది. అయితే నాలుగేండ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వకపోవటంతో ఆశావహుల జాబితా పెరిగింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పింఛన్ దరఖాస్తు ఫారాల్లో ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత, డయాలసిస్, పైలేరియా తదితర వ్యాధులు ఉన్న వారు స్థానిక పంచాయతీ కార్యదర్శికి ఇస్తే వారు ఎంపీడీవో కార్యాలయాల్లోని ఆపరేటర్ల ద్వారా సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఆన్లైన్ చేస్తున్నారు. దరఖాస్తుల అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కొత్త పింఛన్ ఇవ్వనున్నారు. చేయూత పథకం అందని వృద్ధులే ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అర్హులైన వారికి పింఛన్ ఇవ్వటంతో పాటు దివ్యాంగులకు రూ.6 వేలు, ఇతర వర్గాల వారికి రూ.4 వేలు ఇస్తామని ఎన్నికలకు ముందు ఖమ్మంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. పింఛన్ పెంపును పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేండ్ల తర్వాత ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే పండుటాకులకు మాత్రం మొండి చేయి చూపిస్తోంది. ఈ నెల 31వరకు దరఖాస్తు సమయం ఇవ్వ గా.. రెండు లక్షలే ఇస్తామన్న సర్కార్ అంతకు మించి దరఖాస్తులు వస్తే ఏం చేస్తుందో వేచి చూడాలి. రెండున్నరేండ్లకు కొత్త పింఛన్‌కు ఇస్తామంటున్న సర్కార్ ఆ పింఛన్‌ను ఎప్పు డు పెంచుతుందో వేచి చూడాల్సిందే.
నాకు 63 ఏండ్లు. అయ్యాల గెల్వంగనే కొత్త పింఛన్ ఇస్తామన్న కొంగ్రెసోళ్లు రెండున్నరేండ్లు దాటినా ఇప్పటికీ ఒక్క పింఛన్ ఇవ్వలేదు. ఇప్పుడిస్తామని చెబుతున్నరు.. కానీ మా ముసలోళ్లకు ఇస్తలేరంట. మేమేం పాపం చేశాం. మేము ఓట్లు ఎయ్యనిదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండా..మాకు అసలు ఎందుకు ఇస్తలేడు. అందరితో పాటు మాకు కూడా ఇస్తూ నాలుగువేలకు పెంచి ఇయ్యాలి. లేకుంటే మా శాపం ఈ ప్రభుత్వానికి తగులుద్ది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయూత పథకం కింద ఈ నెల 31వ తేదీ వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి వృద్ధులకు అవకాశం కల్పించనందున వారు దరఖాస్తు చేసుకోవద్దు. మిగిలిన వారు సంబంధిత ధృవ పత్రాలతో గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎంపీడీవో కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకుంటే సెప్టెంబర్ ఒకటి నుంచి వెరిఫికేషన్ చేసి అర్హులకు కొత్త పింఛన్లు ఇస్తాం.