ఖైరతాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 4: మాదిగ సామాజికవర్గానికి చెందిన కొందరు ఉద్యోగులు స్వలాభం కోసం ఈనెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ కృతజ్ఞత సన్మానసభ పెట్టారని, దానిని బహిష్కరిస్తున్నామని మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద దేవేంద్ర ప్రసాద్ మాదిగ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 30 ఏండ్ల సుధీర్ఘ పోరాటం ద్వారా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వర్గీకరణను సాధించారని అన్నారు. కొందరు మందకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ పేరును వాడుకుంటూ ముఖ్యమంత్రికి సన్మానం చేయడాన్ని సహించమన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.
మాదిగల ద్రోహి ప్రొఫెసర్ కాశీం..
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం మాదిగల ద్రోహిగా మారాడని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సోమశేఖర్ మండిపడ్డారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మాదిగ ఉద్యోగుల పేరుమీద సీఎం రేవంత్‌రెడ్డికి చేయబోతున్న సన్మానానికి మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఉద్యమాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము శేఖర్, ఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.