తెలంగాణలో ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సల్బరీ స్ఫూర్తి విప్లవోద్యమం, వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో క్రమంగా క్షీణిస్తున్నది. 1967లో బెంగాల్‌లోని నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైన ఉద్యమం దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలకు విస్తరించింది. ఆ తర్వాత సీపీఐ (మావోయిస్టు) రూపంలో కొనసాగిన ఈ ఉద్యమం ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నట్టు కనిపిస్తున్నది.
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోగా, మరికొందరు వివిధ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లొంగిపోయిన వారిలో మల్లా రాజిరెడ్డి (దేవ్‌జీ), బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. వీరు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
ఆపరేషన్ కగార్ తర్వాత కూడా తెలంగాణకు చెందిన కొందరు మావోయిస్టుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపి ఉత్తర బస్తర్‌లో ఏరియా కమాండర్‌గా ఉన్నట్టు సమాచారం. అక్కన్నపేటకు చెందిన కాశబోయిన స్వరూప 25 ఏండ్ల్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లారు. నంగునూరు ప్రాంతానికి చెందిన రంగు అరుణ అలియాస్ పద్మక్క దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలో సభ్యురాలిగా పనిచేసినట్టు తెలిససింది. వీరు ఇంకా అడవిలోనే ఉన్నారా? భద్రతా బలగాలకు లొంగిపోయారా? ఎన్కౌంటర్లలో మరణించారా? అనేది నేటికీ స్పష్టత లేదు.
నాటి పీపుల్స్‌వార్, జనశక్తి దళాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అనేకమంది కీలక నేతలు ఉన్నారు. కాలక్రమేణా వారు పలు ఎన్కౌంటర్లలో మరణించగా, మరికొందరు పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి సుమారు 11 మంది నేతలు మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని జైళ్లలో వందల సంఖ్యలో వివిధ కేసులలో పలువురు వ్యక్తులు నిర్బంధంలో ఉన్నారు. కొందరు విచారణ ఖైదీలుగా కొన్నేండ్లుగా కారాగారాల్లోనే మగ్గుతున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన సంధ్యారెడ్డి 40 ఏండ్ల్ల క్రితం మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ఇంతవరకు ఆమె జాడ తెలియడం లేదు. సినీ రచయిత కాకరాల కుమార్తె దుర్గా జాడ కూడా కానరావడం లేదు. దుర్గా పటేల్ సుధాకర్‌రెడ్డి సహచరి. కాకరాల మరో కుమార్తె సునీత పోలీసులకు లొంగిపోయారు. సునీత శాంతి చర్చల ప్రతినిధి సుధాకర్ సహచరి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సీపీఐ ఎంఎల్ జనశక్తి పార్టీలోకి 28 ఏండ్ల క్రితం వెళ్లిపోయారు. ఇంతవరకు అతని ఆచూకీ లేదు. తల్లిదండ్రులు చనిపోయినా కడసారి చూపు కోసం తుమ్మలపల్లి శ్రీనివాస్ రాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రం అలియాస్ మహేశ్ 28 ఏండ్ల క్రితం నక్సల్స్‌లోకి వెళ్లిపోయారు.
నేటివరకు అతని ఆచూకీ కూడా లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల కాంతారావు అలియాస్ నవీన్ 30 ఏండ్ల క్రితం మావోయిస్టు పార్టీలోకి వెళ్లిపోయారు. దండకారణ్యం నుంచి ఆంధ్ర-ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ, సీపీఐ ఎంఎల్ జనశక్తి పార్టీలు ఏర్పాటైన సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన.. దగ్గు రాజలింగం వంటి పలువురు యువకుల జాడ కూడా కానరావడం లేదు. ఇటీవల కాలంలో వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు జరిగినా, ఈ తొమ్మిది మంది ఆచూకీ తెలియకపోవడంతో ఆయా కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. ‘కొడుకుల్లారా.. బిడ్డల్లారా.. ఎక్కడున్నా ఇంటికి రండి’ అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అదృశ్యమైన తమ వారి ఆచూకీపై స్పష్టత రాకపోవడం ఆ కుటుంబాల్లో ఆవేదనను పెంచుతున్నది. మావోయిస్టు మాజీ సిద్ధాంతకర్త మల్లోజుల వేణుగోపాల్ (సోను దాదా) వ్యాఖ్యల ప్రకారం.. సిద్ధాంతపరమైన పొరపాట్లు, వ్యూహపరమైన తప్పిదాలు పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి.
దేశంలో కమ్యూనిజం శతాబ్దకాలంపాటు ప్రయాణం చేసినప్పటికీ, నేటి వామపక్షాలు సంక్షోభంలో ఉన్నాయి. ప్రస్తుత తరంలో ఉద్యమాల పట్ల ప్రజల్లో ఆసక్తి తగ్గిందని విశ్లేషకులు చెప్తున్నారు. దశాబ్దాల క్రితంతో పోల్చితే నేటి సామాజిక స్థితిగతులు మారాయి. ముఖ్యంగా శాంతియుత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం, తొమ్మిదిన్నరేండ్లపాటు సాగిన కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలనతో ప్రజలకు ప్రజాస్వామిక పంథాపై విశ్వాసం పెరిగింది. యువత మావోయిస్టు పార్టీలోకి వెళ్లడం ఆగిపోవడానికి ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పవచ్చు. చదువు, ఉద్యోగం, కెరీర్‌పై ఫోకస్ పెరిగింది. అయితే, పీడిత వర్గాలు ఉన్నంతవరకు ప్రజాస్వామికంగా ప్రశ్నించే గొంతులు మూగబోవు. కానీ పోరాట పంథానే రూపాలు మార్చుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుధాలు పట్టుకోవడం, అడవికి వెళ్లడం సమాజంలోని సమస్యలకు పరిష్కారం కాదు. ప్రజాస్వామిక విధానంలో పోరాటం కొనసాగించాల్సిన తరుణమిది.