Temper | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో మలుపు తిప్పిన సినిమాల జాబితాలో ‘టెంపర్’కు ప్రత్యేక స్థానం ఉంటుంది. 2015లో విడుదలైన ఈ చిత్రం తారక్‌ను నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లిందనే అభిప్రాయం అభిమానుల్లో ఇప్పటికీ బలంగా ఉంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా కేవలం కమర్షియల్ విజయమే కాకుండా, ఎన్టీఆర్లోని నటనకు కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల నిర్మాత బండ్ల గణేష్ నటుడు రాజా రవీంద్ర నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ‘టెంపర్’ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా “ఇప్పుడు ‘టెంపర్’ విడుదలై ఉంటే కచ్చితంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించేది” అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘బాద్షా’ తర్వాత ఎన్టీఆర్‌కు వచ్చిన ‘రామయ్య వస్తావయ్యా’, ‘రభస’ చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటి సమయంలో రచయిత వక్కంతం వంశీ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, ఆ కథను దర్శకుడు పూరీ జగన్నాథ్ దగ్గరకు తీసుకెళ్లినట్లు చెప్పారు. కథ విన్న వెంటనే పూరీ జగన్నాథ్.. “ఇది నీకు మరో ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమా అవుతుంది” అని చెప్పారని బండ్ల గణేష్ వెల్లడించారు. ఆ తర్వాత అదే కథ ‘టెంపర్’గా రూపుదిద్దుకుని ఎన్టీఆర్ కెరీర్లో అత్యంత కీలక చిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమైన అసలు అంశం మాత్రం రూ.1000 కోట్ల కామెంట్. నిజంగా ఇప్పటి పరిస్థితుల్లో అదే కథతో ‘టెంపర్’ విడుదలై ఉంటే అంత భారీ వసూళ్లు సాధించేదా? అనే ప్రశ్నపై సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. 2015లో ఉన్న మార్కెట్ పరిస్థితులకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు భారీ తేడా ఉంది. అప్పట్లో పాన్ ఇండియా మార్కెట్ అంత బలంగా లేకపోవడం, ఓటీటీ ప్రభావం తక్కువగా ఉండడం, టికెట్ ధరలు కూడా ప్రస్తుత స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం థియేట్రికల్ బిజినెస్, ఓవర్సీస్ మార్కెట్, డిజిటల్ రైట్స్ అన్నీ భారీ స్థాయిలో పెరిగాయి.
అలాగే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా హిందీ మార్కెట్లో కూడా తారక్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో అదే స్థాయి కంటెంట్‌తో ఇప్పుడు సినిమా వస్తే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. అయితే రూ.1000 కోట్లు అనేది మాత్రం చాలా పెద్ద సంఖ్య అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘టెంపర్’ కథలో అవినీతిపరుడైన పోలీస్ అధికారి దయా పాత్రలో ఎన్టీఆర్ నటన సినిమాకు ప్రధాన బలం అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ కోర్టు సీన్లో తారక్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ సన్నివేశం తెలుగు సినీ చరిత్రలో గుర్తుండిపోయే క్లాసిక్ మూమెంట్లలో ఒకటిగా నిలిచింది. ఏదేమైనా.. బండ్ల గణేష్ చేసిన రూ.1000 కోట్ల వ్యాఖ్య కాస్త అతిశయోక్తిగా అనిపించినా, ‘టెంపర్’ మాత్రం ఎన్టీఆర్ కెరీర్లో ఒక స్పెషల్ మూవీ అనే విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.