Kangana Ranaut | బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ మరోసారి తన ముక్కుసూటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద అంశాలపై స్పందించే కంగనా.. ఈసారి నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు మద్దతుగా నిలిచి ట్రోల్స్‌పై తీవ్రంగా స్పందించారు. ఇటీవల కేన్స్ 2026 ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య చేసిన స్టైలిష్ ఎంట్రీ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. అయితే ఆమె ఫ్యాషన్ ఎంపికల కంటే, శరీరాకృతిపై కొందరు చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ప్రత్యేక రాయల్ బ్లూ గౌన్‌లో కనిపించారు. తన స్టైలిష్ లుక్‌తో ఆమె అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, కొందరు నెటిజన్లు ఆమె ఫిజిక్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా, గతంతో పోలిస్తే ఆమె లుక్ మారిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.
ఈ ట్రోలింగ్‌పై స్పందించిన కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా గట్టి సందేశాన్ని ఇచ్చారు. “ఫ్యాషన్, స్టైల్ అనేవి వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే ఒక మార్గం. ప్రతి మహిళ తన ఇష్టానుసారం జీవించే హక్కు కలిగి ఉంటుంది. ఎవరినీ సంతోషపెట్టడానికి ఆమె జీవించాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. అంతేకాదు, ఐశ్వర్య చాలా అందంగా కనిపిస్తోంది. ఆమెను విమర్శించే వారు ముందు తమ సత్తా ఏంటో చూపించాలి. పెద్ద వయసు ఉన్న మహిళలు కూడా రెడ్ కార్పెట్‌పై ధైర్యంగా కనిపించడం సహజం. దానికి అలవాటు పడాల్సిన సమయం వచ్చింది” అంటూ కంగనా ట్రోల్స్‌కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ ఈసారి వరుసగా పలు విభిన్న లుక్స్‌తో ఆకట్టుకున్నారు. మొదట రాయల్ బ్లూ గౌన్‌లో మెరిసిన ఆమె, తర్వాత పౌడర్ పింక్ గౌన్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం వైట్ ప్యాంట్సూట్తో సొగసైన స్టైల్‌ను ప్రదర్శించారు. ఈ ఫ్యాషన్ ప్రయోగాలు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటుండగా, కంగనా మద్దతుతో ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారింది.