నల్లగొండ, ఆగస్టు 13 : ‘ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడేలా లేవు.. వరి సాగు చేయొద్దు.. దండం పెడుతున్నా.. అర్థం చేసుకొని మా ఆవేదన వినండి’ అని నల్లగొండ జిల్లా ఉదయ సముద్రం చెరువు కింద నాట్లు వేస్తున్న రైతులకు మోకాళ్లపై కూర్చొని దండం పెడుతూ విజ్ఞప్తి చేశారు పానగల్ ఏఈవో దేవేందర్. అయితే ఈ వేడుకోలుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో రైతులతోపాటు నెటిజన్లు సదరు ఏఈవోతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతూ వ్యతిరేక పోస్టులు పెట్టారు.
‘ఎల్ నినో ప్రభావం ఉంటే అసలే వర్షాలు రాకుండా ఉంటలేదు కదా? బోరు బావులు కింద కూడా వ్యవసాయం చేయొద్ద్దా? ఉదయ సముద్రంలో తాగునీటికి నీళ్లిస్తే ఆ జాలుకే కింది పొలాలు పారుతాయి’ అనే కోణంలో విమర్శలు చేస్తూ రైతులతోపాటు నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతటితో ఊరుకోక ఇటీవల నల్లగొండలో పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నిండినా సాగు నీరు ఇవ్వలేమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
వరి సాగు చేయొద్దన్నా రైతులు వినకపోవడంతో అధికారులతో ఇలాంటి వేడుకోలు కార్యక్రమాలకు తెర తీయించాడా? అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. 2014లో బీఆర్ఎస్ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 510 అడుగుల్లో నీటి నిల్వలు ఉంటే.. నాటి మంత్రి హరీశ్‌రావు సాగర్‌కు వచ్చి నీటిని విడుదలు చేశారని, ఇప్పుడు 521 అడుగులు ఉన్నా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణలో రైతులు వ్యవసాయం చేయొద్దనే కుట్ర చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.