హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘దవాఖానలో రోగులను పరామర్శించడాన్ని కూడా రాజకీయం చేస్తరా? ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అరాచక పాలనను సాగిస్తున్నది’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్ ఎంజీఎం దవాఖాన లో పైకప్పు పెచ్చులూడి పడి గాయాలపాలైన రోగులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్పై పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.
కష్టాల్లో ఉన్న బాధితులను ఓదార్చేందుకు వెళ్లిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధిపై పోలీసులు మానవత్వం లేకుండా దౌర్జన్యానికి దిగ డం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని మండిపడ్డారు. వే ధింపులు, అరాచకాలనే నమ్ముకుం టే ప్రజల మద్దతును శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులు గుర్తెరుగాలని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు, పోలీసులు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.