శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jangaon - Aug 05, 2020 , 05:44:58

చురుగ్గా రైల్వే అండర్‌ బిడ్జి పనులు

చురుగ్గా రైల్వే అండర్‌ బిడ్జి పనులు

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్‌, ఆగస్టు 4: స్టేషన్‌ఘన్‌ఫూర్‌ డివిజన్‌ కేంద్రంలోని స్టేషన్‌ఘన్‌పూర్‌, శివునిపల్లి జంట పట్టణాల మధ్య ఉన్న రైల్వేగేటు సమస్య తీరనుంది. నిత్యం రైల్వేగేటు వద్ద ట్రాఫిక్‌ సమస్యతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు చేపట్టాలని డివిజన్‌ కేంద్రంలోని పలు సామాజిక, రాజకీయ, స్వచ్ఛంద, వ్యాపార, వాణిజ్య సంస్థలు రైల్వేశాఖ ఉన్నతాధికారుకు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మొరపెట్టుకోగా రైల్వేశాఖ స్పందించింది. స్టేషన్‌ఘన్‌ఫూర్‌ రైల్వేగేటు సమీపంలోనే పోచమ్మగుడి వద్ద నుంచి శివునిపల్లి వివేకానంద విగ్రహం వరకు రైల్వే అండర్‌బ్రిడ్జి పనులకు రూ.3 కోట్లు కేటాయించారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులను గత ఎడాది నవంబర్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైళ్లు వస్తుండడంతో గతంలో స్టేషన్‌ఘన్‌పూర్‌, శివునిపల్లి జంట పట్టణా మధ్య ఉన్న రైల్వేగేటు నిత్యం నాలుగైదు నిమిషాలకోమారు మూసేవారు. ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైల్వేగేటుకు ఇరు వైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడేవారు. తరుచూ ట్రాఫిక్‌ జాము అయ్యేది. ప్రధానంగా రైల్వేగేటు సమస్యను తీర్చడానికి అప్పటి ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖర్‌రెడ్డి స్వయంగా రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టూరు. మండల కేంద్రంలోని సైదవారి కుంట నుంచి శివునిపల్లి ఎస్సీ కాలనీ వరకు రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి  పనులు పూర్తి చేశారు. రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వల్ల పాంనూర్‌, నెమిలిగొండతోపాటు జఫర్‌ఘడ్‌, వర్ధన్నపేట, ఐనవోలు మండలాలకు వెళ్లడానికి మాత్రమే అనువుగా మారింది. స్టేషన్‌ఘన్‌ఫూర్‌ నుంచి శివునిపల్లి, విశ్వనాథపురం, తానేధార్‌పల్లి, ఇప్పగూడెం తదితర గ్రామాలతో పాటు పాలకుర్తికి మండలానికి వెళ్లేవారికి అనువుగా లేదు. ఆయా గ్రామాలకు వెళ్లే వారు అదనంగా మరో రెండు, మూడు కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి శివునిపల్లి మీదుగా వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజలు, వ్యాపార, వాణిజ్య వార్గాలు, స్వచ్ఛంద సంఘాలు, సంస్థలు, రాజకీయ పక్షాల వారు రైల్వే అండర్‌బ్రిడ్జి పనులు చేపట్టాలని పలుమార్లు నిరసనలు, రైల్వే జీఎం, డీఆర్‌ఎం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల డిమాండ్‌ మేరకు స్పందించిన రైల్వేశాఖ స్టేషన్‌ఘన్‌ఫూర్‌ రైల్వేగేటు పోచమ్మగుడి వద్ద నుంచి శివునిపల్లి కూరగాయల మార్కెట్‌ వరకు అండర్‌ రైల్వే బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టింది. బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. 

రూ.3 కోట్లతో రైల్వే 

అండర్‌ బ్రిడ్జి పనులు

రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ రూ.3 కోట్లు కేటాయించింది. పోచమ్మగుడి నుంచి శివునిపల్లి వైపు వివేకానంద చౌరస్తా వరకు 30 మీటర్ల వరకు పనులు చేపడుతున్నారు. 6 మీటర్ల ఎత్తు,  6 మాటర్ల వెడల్పుతో బ్రిడ్జి పనులు చేపట్టారు. మూడు నెలల్లోగా పనులు పూర్తవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

కూరగాయల వ్యాపారులకు ఇబ్బందులు 

రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం వివేకానంద చౌరస్తా వద్ద కూరగాయల విక్రయించే చిరువ్యాపారులకు ఇబ్బందిగా మారింది. వారికి ప్రస్తుతం అడ్డా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన రైల్వేశాఖ అధికారులు ప్రస్తుతం రోడ్డు పనులు పూర్తయ్యాక అడ్డాలను కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికే కొందరు చిరు వ్యాపారులు తాత్కాలిక అడ్డాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. logo