Pothana Bhagavatam Episode 108 | ‘స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణం, నృసింహ మద్భుతం వందే పరమానంద విగ్రహమ్’ (శ్రీధరాచార్య)- తన భక్తుని యందలి పక్షపాతంతో స్తంభంలో ప్రత్యక్షమై విపక్షమైన హిరణ్యకశిపుని వక్షఃస్థలం చీల్చివేసిన మోక్షరూప అక్షయ ఆనంద విగ్రహుడైన, విలక్షణ అద్భుత ఆకారం గల నృసింహునికి నమస్కారాలు.
పితాపుత్రుల మధ్య మత (అభిప్రాయ) భేద సంఘర్షణ పతాకస్థాయికి చేరింది. కాంతమైన శాంతరసం ముందు విర్రవీగిన రౌద్రరసం వీగిపోయింది. భద్రమైన శుద్ధ సత్తగుణం ముందు క్షుద్రమైన రజోగుణం శిరసు వంచింది. దానవపతి హిరణ్యకశిపుని దంభంతో కూడిన ఉద్రేకాన్ని స్తంభింపజేయడానికి, భక్తపాలన కళాసంరంభంతో అంభోరుహనేత్రుడు హరి, అరివీర భయంకర స్ఫూర్తియై స్తంభంలో నుంచి నృకేసరి (నరసింహ) మూర్తితో సంభవిస్తాడు.
‘నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం
నమామ్యహమ్’- మృత్యువుకు మృత్యువైన
నరహరి అంతరంగం భయహరమైన కరుణ
రసంతోను, బహిరంగం భీషణమైన వీర రసంతోను విరాజిల్లుతున్నాయి.
నారద మహర్షి రాజర్షి ధర్మరాజుతో.. నరనాథా! కట్టలు తెంచుకొన్న కినుక (కోపం)తో దితిపట్టి కనకకశిపుడు భయానక అట్టహాసంతో హుంకరించి భక్తుని గట్టిగా ధిక్కరించాడు. ‘ఇందులో నీ హరిని చూపరా’ అని అరచేతితో సభామంటపంలో భాసమానమగు (వెలుగుతున్న) స్తంభాన్ని బలంగా చరిచాడు విష్ణు విరోధి. ఆనాడు వైశాఖ శుద్ధ చతుర్దశి. వేటుపడగానే ఆ స్తంభం బీటలువారి పెటిల్లున పగిలిపోయింది. గుండెలవిసి బ్రహ్మాండ భాండం బద్దలయినట్లయింది. అందులోనుంచి దివ్య తేజఃపుంజం (కాంతి సమూహం)తో భ్రాజమానుడై- వెలిగిపోతూ, అవ్యాజ కరుణామూర్తి, దీనబంధువు, దయాసింధువు కంజలోచనుడు హరి భక్తులకు కనువిందు చేస్తూ ఉగ్రనరసింహుడై ఉద్భవించాడు. ఈ సందర్భంలో స్వామి విశ్వతోముఖ ఉగ్రరూపాన్ని భక్తకవులలో అగ్రేసరుడైన పోతన, సంస్కృత కాదంబరీ గద్యకావ్యశైలిలో మూలంలోని అష్టశ్లోకాల ఆధారంగా శబ్ద, అర్థ- ఉభయ ఆలంకారిక సుభగమైన ప్రౌఢ సమాస భూయిష్ఠంగా, సాహితీ ప్రియంభావుకులకు బహుఇష్టంగా సుదీర్ఘమైన గద్యలో సమగ్రంగా అభివర్ణించాడు. గద్యంలో కూడా పద్యకావ్య స్వారస్యాన్ని హృద్యంగా, అనవద్యంగా ఆస్వాదింపజేశాడు సహజ పాండిత్యుడు పోతన అమాత్యుడు. ఆ భీకరాకారుని వాడితేలి వంకరలు తిరిగిన గోళ్లు గోళ్లు కావు. రక్కసి మూకల ఉక్కడగించే, వారి ధైర్యమనే తీగలను తెగనరికే కొడవళ్లు. దైత్యరాజుల బండబారిన గుండెలనే పొలాలను దున్నే పదునైన నాగళ్లు. పగవారి (శత్రువుల) కళ్లకు మిరుమిట్లు గొల్పుతూ మండే నెగళ్లు. స్వామి గర్జనకు సుప్రతీక, సార్వభౌమాది దిగ్గజాల చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఆయన శరీరకాంతులు భ్రాంతులైన శక్ర (ఇంద్ర) శత్రువుల గర్వమనే ధ్వాంతు (చిమ్మచీకట్ల)లను చీల్చి చెండాడుతున్నాయి. అదృష్టపూర్వమైన ఆ అద్భుత ఆకారం చూచి, అసురరాజు హిరణ్యకశిపుడు హడలిపోయి పసచెడి ఆయాసపడుతూ అవాక్కయి (మాటలుడిగి) ఇలా అనుకున్నాడు..
కం॥‘నరమూర్తి గాదు, కేవల
హరిమూర్తియుఁగాదు మానవాకారముఁ గే
సరి యాకారము నున్నది
హరిమాయా రచితమగు యథార్థము చూడన్’
ఇది నరరూపమూ కాదు, కేవలం కేసరి (సింహ) రూపమూ కాదు. యథార్థంగా ఇది ‘నర’ ఆకారం, హరి (సింహ) ఆకారం- ఈ రెండూ కలిసి కానబడిన శ్రీహరి మాయా రూపం. ప్రహ్లాదుని మాటలు నీటిమూటలు కావని తేటతెల్లం చెయ్యడానికి, తన సర్వవ్యాపకత్వాన్ని (అంతటా ఉనికిని) సిద్ధపరచడానికి స్వామి స్తంభంలో ఆవిర్భవించాడు. నన్ను శిక్షించడానికే విచ్చేశాడు. ఈయన చేతిలో నాకు మరణమే శరణమనిపిస్తోంది. అయినా, ఇందరిముందు పొందికగా నా రణ పరాక్రమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి నా పరిపంథి (శత్రువు)ని వధిస్తా.
కాయాధవుని (ప్రహ్లాదుని) పుణ్యమూ, కనకకశిపుని పాపమూ, రెండూ కలిసి నృకేసరిగా ఉద్భవించడం సంభవించింది. సర్వత్ర ఉన్నదానికి వన్నె చిన్నెల రూపము ఉండదు. అది అరూపం. అరూపమే దాని స్వరూపం. అలాకాక, ఏకత్ర-ఒకానొక చోట, స్తంభాదులలో కనిపించాలంటే అది ఒక విశేష రూపాన్ని సంతరించుకోవాలి. దానికే ‘విభూతి’ అని పేరు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపనే దాని ప్రయోజనం. భగవదవతారాలన్నీ ఆయన విభూతులే. ఈ స్వరూప విభూతులు రెండూ తానే. స్వరూపం అవ్యక్తం, విభూతి వ్యక్తరూపం. ఇక్కడ స్వరూపమే విభూతిగా వ్యక్తమయింది. ఇదే మాయిక రూపం. ‘భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్’- దేవతలచే కానీ, దానవులచే కానీ, మృగాలచే కానీ, ఖగాల (పక్షుల)చే కానీ, నరులచే కానీ, నాగేంద్రాలచే కానీ తనకు మరణం రాకుండా హిరణ్యకశిపుడు విధాత నుంచి వరాలు పొందాడు. కనుక, వీనిలో ఏదీ కాని ఒకానొక విచిత్ర విలక్షణ రూపంలో వచ్చి వానిని సలక్షణంగా సంహరించాలి. అందుకే మాయారచితమైన ఈ ‘నరమృగ’కాయం! ‘నృహింసాయాం’ అనే ధాతువు నుంచి పుట్టిన ‘నర’ శబ్దానికి ‘హింసించేది’ అని అర్థం. ఎవరిని? జీవులను. అదే నరత్వం, జీవత్వం, దేహాత్మ బుద్ధి, అవిద్య, అజ్ఞానం, ప్రమాదం- ప్రమత్తత (ఏమరుపాటు). అంతిమంగా మృత్యువు. ‘హింసాయాం సింహః’- అనే వ్యుత్పత్తి ప్రకారం ‘సింహ’ శబ్దానికి కూడా ‘హింసించేది’ అనేదే అర్థం. ఏతావతా- ‘హింసించే దాన్ని హింసించేది’ అని ‘నరసింహ’ నామానికి పారమార్థిక తాత్పర్యం. అనగా మృత్యువును హింసించి- మరణ భయం తొలగించి అభయపదాన్ని- మోక్షాన్ని ప్రసాదించేది అని పిండితార్థం- పరమార్థం!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
Pothana Bhagavatam Episode 107 | స్తంభంబున జూపఁగలవె? చక్రిన్ గిక్రిన్
Pothana Bhagavatam Episode 106 | ఎందెందు వెదకినఅందందే కలడు..
Pothana Bhagavatam EPisode 105 | వెదకంగా నేల నీ యా యెడన్
Pothana Bhagavatam Episode 104| ..మరి వాఁడెందుండురా? దుర్మతీ!
Pothana Bhagavatam Episode 103 | ఇంద్రజిత్తు కన్నా.. ఇంద్రియజిత్తు మిన్న
“Pothana Bhagavatam Episode 102 | ఇంపు సొంపైన ముగింపు మాటలు”