Pothana Bhagavatam Episode 98 | వివేకవంతుడు యవ్వనాన్ని, వృద్ధావస్థను విశ్వసింపక బాల్యం నుంచే బుద్ధిబలంతో భగవత్ ప్రాప్తికి మెండైన సాధనాలు- నిండైన భక్తి, కొండంత అండగా నిలిచే భాగవత ధర్మాలను భావగతం చేసుకొని- మనసులో నిల్పుకొని ఆచరించాలి. సుజ్ఞాని అయిన ప్రహ్లాదుని పరమ ఆహ్లాదకరమైన ఈ చరిత్ర ప్రపంచ ప్రజానీకానికి నేర్పే, అజ్ఞాన నాశకమైన ప్రజ్ఞామయ పాఠం ఇదే! సంతానానికి చిరంతన ధార్మిక, ఆధ్యాత్మిక చింతన, సంస్కారాలు బోధించే బాధ్యత తల్లిదండ్రులదే. దానిని విస్మరించి, వైదొలిగే మాతాపితరులు పుత్రులకు శత్రువులే. కని పారేసిన మాత్రంచే ఏ పుత్రుడూ విజ్ఞాన ఖని- పండితుడు కావటం లేదు కదా! వృద్ధాప్యంలో తనకు తన ‘దేహ సేవ’ కూడా సందేహాస్పదమైనప్పుడు ఆవశ్యకమే గాక అనివార్యమైన ‘దేవ సేవ’కు అవకాశం అరుదన్నది నిస్సందేహమేగా!
బ్రహ్మపుత్రుడు దేవర్షి నారదుడు పాండుపుత్రుడు రాజర్షి యుధిష్ఠిరుడితో.. మహారాజా! ‘ఎంతో ఆగ్రహంతో నేను పెట్టిన నిగ్రహాలు- యాతనల గురించి వీడు (ప్రహ్లాదుడు) విగ్రహాలు- అన్యాయంగా చేసిన అపకారాలుగా ఎవరితోనూ విన్నవించుకోడు. నిగ్రహం కోల్పోయి మనసులో కూడా అసహ్యించుకోడు. ఉపరి, వాటన్నిటిని అనుగ్రహాలు- ఉపకారాలుగానే భావిస్తాడు. అసలు వీడి గతమేమిటో, ఇప్పటి మనోగతమేమిటో నాకు ఏ మాత్రం అవగతం కావటం లేదు’ అన్నది సురవైరి సువర్ణ కశిపుని స్వగతం. ఈ స్థితి పుత్రుని పూర్వజన్మ సంస్కార ఆగతమన్న ఇంగిత జ్ఞానం ఇంచుకు కూడా ఆ శౌరి (విష్ణువు) శత్రువుకు లేదు. ‘చావడిదేమి చిత్రమో!’- కంటి మీద కునుకు లేకుండా అలా ఒంటరిగా కూర్చుని తుంటరి తనయుని గురించి దిగులు పడుతున్న దైత్యపతిని చూసి జంట గురువులు చండామర్కులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు..
శా॥ ‘శుభ్రఖ్యాతివి; నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర! రో
షభ్రూయుగ్మ విజృంభణమ్మున దిగీశవ్రాతముం బోరులన్
విభ్రాంతంబుగఁ జేసి యేలితి గదా విశ్వంబు! వీడెంత? యీ
దభ్రోక్తుల్ గుణదోష హేతువులు, చింతం బొంద నీకేటికిన్?’
ఈ సందర్భంలో మూల శ్లోకాల అర్థాన్ని ఇనుమడింపజేస్తూ, భావుక భక్తుల చిత్తాలు రంజిల్లగ, దుష్కర ప్రాసతో కూడిన రెండు వృత్తాల వర్ణ చిత్రాలను దానవ చక్రవర్తి దర్పాభివ్యంజకంగా అమాత్యుడు పోతన అతి సుకరంగా అనాయాసంగా గురుపుత్రులచే గీయించాడు- ‘అసుర వల్లభా! నీవు మహాకీర్తిశాలివి. నీ ప్రతాపం అతి అద్భుతం. నీ కనుబొమలు ముడిపడితే కదన రంగంలో దిక్పాలురు సైతం తోకముడిచి పారిపోతారు. లోకాన్నంతా ఏకచ్ఛత్రంగా ఏలే నీకు ఈ ‘తోకాయ-’ నీ పసికూన ఏ పాటివాడు? పెద్దలైన గురువుల వద్ద చదివిస్తే ఒద్దికతో వీడే బుద్ధిమంతుడు అవుతాడు. మంచి చెడు తెలియని వీని మాటలు విని నీవు అదేపనిగా ఇంతగా చింతపడటం మాకే వింతగా ఉంది. వయసుతోపాటు పోటీపడేలా దీటుగా వీనికి వాసవుని (ఇంద్రుని) పట్ల ద్వేషం నూరి పోస్తే సరిపోతుంది. మహారాజా! మీకు దేశికులు (గురువులు), మాకు పితృదేవులు అయిన శుక్రులు ఊరి నుంచి వచ్చేసరికి వీనికి సంక్రమించిన ‘చక్రి చింత’ అనే వక్రబుద్ధి కూడా తొలగి విక్రమోపేతుడు అవుతాడు’ అని పురోహితులు పలుకగానే పురందర (ఇంద్ర) ప్రత్యర్థి కొంత ప్రశాంతత పొందాడు. కుమారునికి ధర్మార్థ కామాలను మాత్రమే ఉపదేశించమని ఆదేశించాడు. వారూ అలానే బోధించారు. కాని, ప్రహ్లాదుని దృష్టిలో ఆ బోధలు సర్వథా బాధకాలే కాని సత్త (మనః) శోధకాలు, సత్య సాధకాలు, మనో మోదకాలు ఏ మాత్రం కావు. గురువులు గృహకృత్యాలకు వెళ్లిన సమయం గమనించి సురారి సుతుడు ప్రహ్లాదుడు అసుర బాలకులతో చనువుగా..
కం॥ ‘చెప్పఁడొక చదువు మంచిది
చెప్పెడిఁ దగులములు చెవులు చిందర గొనఁగా
నెప్పుడు మన యెడ నొజ్జలు
చెప్పదనొక చదువు వినుఁడు చిత్తము లలరన్’
‘మిత్రులారా! మనకు గురువులు చెవులు చిల్లులు పడేవిధంగా రాగద్వేషాలతో కలుషితమైన సంసార భోగ లంపటం పెంచే కల్లబొల్లి విషయాలే మళ్లీమళ్లీ నేర్పుతున్నారు. అంతకుమించి తీర్పుగా మంచి చదువు ఇంచుకైనా బోధించడం లేదు. మీ ఉల్లము (మనసు)లకు మిక్కిలి ఉల్లాసం, ఉత్తేజం కలిగించే మక్కువైన సర్వోత్తమ విద్యను నేను వివరిస్తాను వీనుల విందుగా, వింటారా?’ అంటూ వారందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకొని గుట్టుగా ఇలా బోధించాడు…
ఉ॥ ‘బాలకులారా! రండు మన ప్రాయపు బాలురు గొందరుర్విపైఁ
గూలుటఁ గంటిరే? గురుఁడు క్రూరుఁడనర్థ చయంబునందు దు
శ్శీలత నర్థకల్పనముఁ జేసెడి, గ్రాహ్యము గాదు శాస్త్రమున్
మే లెరిఁగించెదన్, వినిన మీకు నిరంతర భద్రమయ్యెడిన్’
‘బాలకులారా! నిన్న మొన్నటి వరకు మనకు తోడుగా ఉన్న మన ఈడు జోడు పిల్లలు కూడా కొందరు మనకళ్ల ముందే వల్లకాడు చేరుకోవడం మనం చూశాం కదా! కాన, మృత్యువుకు వయసుతో చెలిమి లేదు. మనకు చదువు చెప్పే గురుడు కూడా క్రూరుడు- మన బాగోగులు- మంచీ, చెడూ చూడకుండా చదువులు చెప్పే వెర్రిబాగుల వాడు. క్రూరుడే కాదు, దుశ్శీలుడు కూడా- మా తండ్రి వద్ద ధనం పుచ్చుకొని ఆయన చెప్పమన్న చదువులే చెబుతున్నాడు. సొమ్ముకు అమ్ముడు పోయినవాడు. వాని విద్యలన్నీ వమ్ములే (వ్యర్థములే)! అర్థం లేని విషయాలలో లేనిపోని అర్థాలు కల్పించి అనర్థకరంగా మనకు వ్యర్థంగా బోధిస్తున్నాడు. అవి మనం నేర్చుకోరాదు. శాస్త్రమంటే భగవత్ తత్తాన్ని బోధించేది. వీడు చెప్పేవి భవరోగం పెంచే భోగ విషయాలు. నా మాట వింటే మీకు మేలు చేకూరుతుంది. మిత్రులారా! మానవ జన్మ ఎంత అపురూపమో అంతకుమించి అనిశ్చితం కూడా. ఎప్పుడు అంతరిస్తుందో అంతుబట్టేది కాదు. అయినా, ఇందులో ఒక అపూర్వత- విశేషం ఉంది. ఇది మనిషికి పురుషార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని ద్వారా పరమాత్మను పొందవచ్చు. ఇది ‘తరల సలిల బుద్బుదంబు గాక’- చంచలమైన నీటి బుడగ వంటిది. కాన, బుద్ధిమంతుడు యవ్వనాన్ని, ముసలితనాన్ని నమ్మకుండా మసులుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే శ్వాసపై అస్సలు విశ్వాసం ఉంచక బాల్యం నుంచే భగవత్ ప్రాప్తిపై ధ్యాస పెట్టాలి.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
“Pothana Bhagavatam | చావడిదేమి చిత్రమో!”
“Pothana Bhagavatam | తండ్రి దురాగ్రహం.. తనయుడి సత్యాగ్రహం”
“Pothana Bhagavatam | చావు పుట్టుకల చర్విత చర్వణం”
Pothana Bhagavatam | భక్తిరసం కుమ్మరించిన బమ్మెర”
“Pothana Bhagavatam | | మాయా నర్తకీ-మాధవ కీర్తన”