హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుందర్బన్ డెల్టా ప్రాంతంలో 20వేల మ్యాన్‌గ్రోవ్ మొక్కలు నాటినట్టు వెల్లడించారు. కేసీఆర్ స్ఫూర్తితో అడవుల తీరాన్ని కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ బృహత్కర కార్యక్రమం రాబోయే తరాలకు చేరాలన్నదే తమ లక్ష్యమని సంతోష్‌కుమార్ తెలిపారు. కేసీఆర్ పాలనలో పర్యావరణ పరిరక్షణను విధిగా భావించారని, రాష్ట్రంలో నాటిన కోట్ల మొక్కలు వృక్షాలుగా మారాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, తొలి ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా.. పర్యావరణంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండాలని శ్రమించిన హరిత కార్మికుడు కేసీఆర్ అని కొనియాడారు.
కేసీఆర్ హయాంలో పెరిగిన అడవుల విస్తీర్ణం
కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన హరిత హారం సత్ఫలితాలు ఇవ్వడంతోపాటు ఆకుపచ్చ తెలంగాణకు బాటలు వేసిందని సంతోష్‌కుమార్ తెలిపారు. కొత్త రాష్ట్ర పునాదులు పర్యావరణ పరంగా దృఢంగా ఉండాలనే ఉక్కు సంకల్పంతో నాడు కేసీఆర్ అడవుల విస్తీర్ణాన్ని పెంచినట్టు వివరించారు. కేసీఆర్ ప్రేరణతోనే గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం పురుడుపోసుకున్నదని తెలిపారు. హరితహారంతో రాష్ర్టానికి ఆకుపచ్చ సొబగులు అద్దిన కేసీఆర్‌కు సంతోష్‌కుమార్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ 72వ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన వెల్లడించారు.
సుందర్బన్ అడవుల్లోనే ఎందుకంటే..?
తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడటం, అలల తీవ్రతను అడ్డుకోవడం, జీవవైవిధ్యాన్ని కాపాడడంలో ఈ మడ అడవుల పాత్ర ఎనలేనిదని చెప్పారు. ప్రస్తుతం మడ అడవుల మనుగడకు విఘాతం కలుగుతున్నందున వీటికి మరింత శక్తిని కూడగట్టే ప్రక్రియకు కేసీఆర్ జన్మదినం ప్రత్యేక వేదికగా మారుతున్నట్టు వెల్లడించారు.