హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో జతకట్టడం వల్ల కొత్తగూడెం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తీసుకోలేకపోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. బీఆర్ఎస్ తమకు సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, కానీ తాము తీసుకోలేకపోయామని అన్నారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అది చేపట్టే ప్రజావ్యతిరేక చర్యలను చూస్తూ ఊరుకోమని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలు జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, ఈటీ నరసింహతో కలిసి కూనంనేని మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్‌కు సామాన్య ఆటోడ్రైవర్‌ను కొత్తగూడెం మేయర్‌గా చేశామని చెప్పారు. తాము కొత్తగూడెంలో ఒంటరిగా పోటీ చేసి 22 స్థానాలను గెలుచుకున్నామని, సీపీఐ మద్దతుతో ఒక ఇండిపెండెంట్ కూడా గెలిచాడని తెలిపారు. కమ్యూనిస్టులు పరాన్న జీవులు, ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ ఉన్నదని కూనంనేని ప్రశ్నించారు. కొత్తగూడెంలో బీజేపీకి అడ్రస్సే లేదని ఎద్దేవా చేశారు. రాబోయే పరిషత్ ఎన్నికల్లో తాము కోరిన సీట్లు ఇస్తే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామని, లేకుంటే పార్టీకి బలం ఉన్న చోట ఒంటరిగా బరిలోకి దిగుతామని వెల్లడించారు.
ప్రజాస్వామ్యమా.. పోలీసు రాజ్యమా?
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పోలీసుల తీరుపై కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఎర్రచొక్కా వేసుకుంటే పోలీసులు అడ్డుకున్నారని, ఇది ప్రజాస్వామ్యమా.. పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ ఒక సీఐ తుపాకీ గురిపెట్టారని ఆరోపించారు.