అనంతగిరి, జూలై 28 : వ్యవసాయానికి బంగారు బాటలు వేసిన రాష్ట్రంలో రైతు కన్నీరు పెడుతుంటే మనసు గోస పడుతుందని, రైతుల పక్షాన పోరాడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని, రైతు సమస్యల పరిష్కారానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. నాణ్యమైన విద్యుత్ రైతులకు అందించాలని డిమాండ్‌తో మంగళవారం అనంతగిరి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరా రిజిస్టర్‌ను పరిశీలించారు. విద్యుత్ ఏఈతో ఫోన్లో మాట్లాడి లో ఓల్టేజి సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయన్నారు. బోనస్ బోగస్ అని, రుణమాఫీ మాయమైపోయిందని, రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు అందజేశామని తెలిపారు. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో, లో వోల్టేజీతో విద్యుత్ సరఫరా అవుతుందని తద్వారా రైతుల మోటర్లు కాలిపోతున్నాయన్నారు. థర్మల్ విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. సాగునీరు విడుదల చేయకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కువ కాలం కొనసాగదని, రైతు సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస నాయక్, నాయకులు అఫ్జల్, పందిరి వీరయ్య, మట్టపల్లి సైదులు, పుల్లయ్య గౌడ్, వెంకటేశ్వర్లు, లచ్చయ్య, శ్రీకాంత్, చార్లెస్ పాల్గొన్నారు.

రైతుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్