Panjab University : పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో దారుణం జరిగింది. పంజాబ్ యూనివర్సిటీలో విద్యుత్ షాక్‌తో 28 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థిని మరణించింది. ఈ ఘటన పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్‌లోనే మంగళవారం ఉదయం జరిగింది. మృతురాలిని హరియాణాలోని రేవారికి చెందిన జ్యోతిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం జ్యోతి తన గల్స్ హాస్టల్ నుంచి మైక్రోబయాలజీ క్లాస్ కోసం బయల్దేరింది. అయితే, అక్కడ అక్కడ రోడ్డుపై, గోతుల్లో నీరు నిలిచింది.
ఈ నీళ్లలో నడుస్తుండగా జ్యోతి విద్యుత్ షాక్‌కు గురై పడిపోయింది. ఇది గమనించిన తోటి విద్యా్ర్థులు వెంటనే స్పందించి, ఆమెను పక్కకు తీశారు. అనంతరం చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఉదయం నుంచి అక్కడ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్డంతా నీటితో నిండిపోయింది. ఈ నీటిలోనే కరెంట్ షాక్‌కు గురైంది జ్యోతి. ఈ ఘటనపై పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ వీసీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జ్యోతి మృతి ఘటనకు బాధ్యత వహించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ ఆందోళన సందర్భంగా కొన్ని ఆస్తుల్ని కూడా విద్యార్థులు ధ్వంసం చేశారు.
అయితే, ఈ నీళ్లలో కరెంట్ ఎలా ప్రసరించింది, ఆమెకు ఎందుకు కరెంట్ షాక్ తగిలింది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తోపాటు చండీగఢ్‌కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.