Sound Pollution | మన చుట్టూ ఉండే శబ్దాలకు శరీరం క్రమంగా అలవాటు పడుతుంది. ట్రాఫిక్, నిర్మాణ పనులు, పెద్ద శబ్దంతో సంగీతం, రద్దీగా ఉండే ప్రదేశాలు, క్రీడా కార్యక్రమాలు వంటి వాటికి తరచూ గురవుతుంటే కొంతకాలానికి అవి సాధారణంగానే అనిపిస్తాయి. అయితే శబ్దానికి అలవాటు పడడం అంటే అది ఆరోగ్యానికి మేలని అర్థం కాదు. అధిక శబ్దం పర్యావరణ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. ముఖ్యంగా ఎక్కువ శబ్దానికి పదేపదే గురికావడం వల్ల వినికిడి సమస్యలతోపాటు గుండె ఆరోగ్యం, రక్తపోటు, నిద్ర వంటి వాటిపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
అధిక శబ్దం వల్ల మొదటగా ప్రభావితమయ్యేది చెవులే. పెద్ద శబ్దాలు లోపలి చెవిలోని సున్నితమైన ఇంద్రియ కణాలను దెబ్బతీయడం ద్వారా శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది. చెవుల్లో నిరంతరం లేదా తరచూ గంట మోగుతున్నట్లుగా అనిపించడం, అంటే టిన్నిటస్ కూడా శబ్దానికి ఎక్కువగా గురికావడం వల్ల ఏర్పడే సాధారణ సమస్యల్లో ఒకటి. అయితే శబ్ద కాలుష్యం ప్రభావం చెవులకే పరిమితం కాదు. అధిక శబ్దం శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందనను పెంచి గుండె వేగం, రక్తపోటు వంటి శారీరక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. నిద్రకు అంతరాయం కలిగించడం ద్వారా కూడా శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది. ఎక్కువ కాలం ట్రాఫిక్ శబ్దానికి గురికావడం అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, పక్షవాతం, టైప్-2 మధుమేహం వంటి సమస్యలతో సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు సూచించాయి.
శబ్దం వల్ల కలిగే ప్రమాదం దాని తీవ్రతతోపాటు ఎంతసేపు, ఎంత దగ్గరగా దానికి గురవుతున్నామనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. బాణసంచా లేదా తుపాకీ కాల్పుల వంటి అత్యంత పెద్ద శబ్దాలు చాలా తక్కువ సమయంలోనే వినికిడిని దెబ్బతీస్తాయి. మరోవైపు పవర్ టూల్స్, పెద్ద శబ్దంతో సంగీతం, భారీ ట్రాఫిక్ వంటి వాటికి ఎక్కువసేపు గురికావడం వల్ల నష్టం క్రమంగా పేరుకుపోతుంది. వృత్తిపరమైన శబ్దానికి సంబంధించి ఎనిమిది గంటల వ్యవధిలో సగటున 85 డెసిబెల్స్ పరిమితిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి 3 డెసిబెల్స్ పెరుగుదలతో సురక్షితమైన ఎక్స్పోజర్ సమయం సగానికి తగ్గుతుంది. రోజులో వివిధ సమయాల్లో ఎదురయ్యే శబ్దాలు కూడా కలిపి మొత్తం శబ్ద ప్రభావాన్ని పెంచుతాయి.
శబ్ద కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి శబ్దాన్ని పూర్తిగా దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. రోజువారీ శబ్దానికి గురయ్యే సమయాన్ని తగ్గించడం ముఖ్యం. వీలైనప్పుడు తక్కువ శబ్దం ఉన్న ప్రదేశాలు, పరికరాలను ఎంచుకోవాలి. పెద్ద శబ్దం ఉన్న ప్రదేశాల్లో కొంతసేపు విరామం తీసుకోవడం, అవసరమైనప్పుడు చెవి రక్షణ పరికరాలు ఉపయోగించడం మంచిది. హెడ్ఫోన్లలో శబ్దాన్ని తక్కువ స్థాయిలో ఉంచడం, పెద్ద శబ్దం వచ్చే స్పీకర్లకు దూరంగా ఉండడం, పవర్ టూల్స్ ఉపయోగించేటప్పుడు చెవి రక్షణ ధరించడం వంటి చర్యలు సహాయపడతాయి. అయితే శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడానికి వ్యక్తిగత జాగ్రత్తలతోపాటు ప్రజా స్థాయిలో కూడా చర్యలు అవసరం. తక్కువ శబ్దం చేసే పరికరాల తయారీ, భవనాల రూపకల్పనలో శబ్ద నియంత్రణ, రవాణా శబ్దాన్ని తగ్గించే పట్టణ ప్రణాళిక, కార్యాలయాల్లో శబ్ద నియంత్రణ వంటి చర్యలు ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా మారుతాయని నిపుణులు సూచిస్తున్నారు.