INDIA bloc : దేశంలో ఇకపై బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని ఇండియా బ్లాక్ కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు విన్నవించనున్నట్లు కూటమి నేతలు చెప్పారు. సర్ ప్రక్రియలో అవకతవకలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా సహా పలు అంశాలపై ఇండియా బ్లాక్ కూటమి నేతలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ సెంటర్ భవనంలో జరిగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.
ఈ సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శివసేన ఉద్ధవ్ థాక్రే, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. దాదాపు మూడు నుంచి నాలుగు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్ణయించిన కీలక విషయాలివి. దేశంలో ఎన్నికల్ని బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలి. ఈ అంశంపై త్వరగా విచారణ జరపాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలి. సర్కు అవకతవకలు వంటి అంశాలపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు.
ఈ అంశాలన్నింటిపై అవగాహన కలిగించేలా అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాల వద్ద అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఆందోళనల్లో పాల్గొంటారు. అక్టోబర్ 6న ఎన్నికల సంఘం కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తారు. నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఆధ్వర్యంలో అనేక చోట్ల ఇండియా బ్లాక్ కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు చేపడతారు. దీనికి సంబందించిన డేట్లు, వేదికల వివరాల్ని కూడా త్వరలోనే నిర్ణయిస్తారు. సీఈసీ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ప్రతిపక్షాలు తెలిపాయి.