గుడి గుట్టు రాజన్నకెరుక!
కార్తీకమాసంలో ‘హరహర మహాదేవ.. శంభోశంకరా’ అంటూ శివనామస్మరణతో మార్మోగాల్సిన దక్షిణకాశీ వేములవాడలో రాజన్న గర్భగుడి గోపురం కూల్చివేతను చూసి భక్తులు ‘శివ శివా ఇదేం పని’ అంటూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మంగళవారం.. అష్టమి నాడే రాజేశ్వరుడి గర్భగుడి శిఖరాన్ని తొలగించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. గర్భగుడిని ముట్టుకొనేది లేదని ముందుగా ప్రకటించిన సర్కార్.. తీరా ఇప్పుడు హరిహరారాధనకు అత్యంత విశిష్టమైన కార్తీకమాసంలో.. అదీ మంగళవారం పూట గర్భగుడి గోపురంపైకి ఎక్కి మరమ్మతుల పేరుతో శిఖర కలశాన్ని తొలగించడం పట్ల భక్తులు, వేములవాడ వాస్తవ్యులు విస్తుపోతున్నారు.
- పునర్నిర్మాణమా.. పురాతన ఆనవాళ్ల విధ్వంసమా?
- ఎములాడ ఆలయ నిర్మాణం.. అంతా గోప్యం!
- మంగళవారం, అష్టమినాడు శిఖరం తొలగింపు
- శిఖర దర్శనానికి వేములవాడలో ఎంతో ప్రాధాన్యం
- భక్తుల మనోభావాలు పట్టక అష్టమినాడు కూల్చివేత
- నాడు ముట్టుకోబోమని చెప్పి నేడు మరమ్మతులు
- స్థపతుల సలహా లేకుండా పనుల నిర్వహణపై వివాదం
- ఏం పనులు చేస్తున్నరు? ఎంత ఖర్చు చేస్తున్నరు?
- రెండేండ్లు కావస్తున్నా భక్తులకు కరువైన స్పష్టత
- కోటిలింగాలు, కాలభైరవ స్వామి, హనుమాన్
- విగ్రహాల మార్పు వ్యవహారంపై అనేక సందేహాలు
కార్తీకమాసంలో ‘హరహర మహాదేవ.. శంభోశంకరా’ అంటూ శివనామస్మరణతో మార్మోగాల్సిన దక్షిణకాశీ వేములవాడలో రాజన్న గర్భగుడి గోపురం కూల్చివేతను చూసి భక్తులు ‘శివ శివా ఇదేం పని’ అంటూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మంగళవారం.. అష్టమి నాడే రాజేశ్వరుడి గర్భగుడి శిఖరాన్ని తొలగించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. గర్భగుడిని ముట్టుకొనేది లేదని ముందుగా ప్రకటించిన సర్కార్.. తీరా ఇప్పుడు హరిహరారాధనకు అత్యంత విశిష్టమైన కార్తీకమాసంలో.. అదీ మంగళవారం పూట గర్భగుడి గోపురంపైకి ఎక్కి మరమ్మతుల పేరుతో శిఖర కలశాన్ని తొలగించడం పట్ల భక్తులు, వేములవాడ వాస్తవ్యులు విస్తుపోతున్నారు.
కరీంనగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేదల దేవుడిగా, దక్షిణ కాశీగా భక్తుల నీరాజనాలు అందుకునే వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనులు భక్తుల్లో కొత్త ఆందోళనలకు తెరలేపుతున్నాయి. ఆలయానికి కొత్త రూపునిచ్చి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులు రెండేండ్లకు చేరువవుతున్నా.. వాటి పురోగతి, ఖర్చు, నిర్మాణ ప్రణాళికలపై సమగ్ర వివరాలు మాత్రం అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏయే కట్టడాల ను తొలగిస్తున్నారు? కొత్తగా ఏమి నిర్మిస్తున్నారు? పురాతన నిర్మాణాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకూ ఎంత ఖర్చు చేశారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు భక్తులకు లభించడం లేదు. మరోవైపు కోటిలింగాలు, కాలభైరవ, హనుమాన్ విగ్రహాల మార్పులు, పురాతన రాతి కట్టడాల తొలగింపుపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోలు పలు సందేహాలకు తావిస్తుండగా, మంగళవారం ఏకంగా గర్భాలయ గోపురం తొలగింపు పనులకు పూనుకోవడం కలకలం రేపుతున్నది. ప్రణాళిక లేకుండా చేస్తున్న నిర్మాణ పనులకు ఇదో నిదర్శమన్న విమర్శలు వస్తున్నాయి. రాజన్న దర్శనాలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక భక్తులు ఒకవైపు ఆందోళన వ్యక్తంచేస్తుండగా.. మరోవైపు, గోప్యంగా జరుగుతున్న పనుల తీరుపై పలు విమర్శలొస్తున్నాయి.
శంకుస్థాపనకు రెండేండ్లు
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024 నవంబర్ 20న శంకుస్థాపన చేశారు. నాటి నుంచి పనుల ప్రారంభం, టెండర్లు, నిర్మాణాల అమలు తదితర అంశాలపై భిన్నమైన వివరాలు ప్రచారంలోకి వస్తున్నాయి. తొలి దశలో రూ.76 కోట్లతో పనులు చేపట్టినప్పటికీ.. కాంట్రాక్టు మాత్రం రూ.52 కోట్లకే ఖరారైందని స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి టెండర్ అగ్రిమెంట్, పనుల వారీగా కేటాయింపులు, ఇప్పటివరకూ చేసిన వ్యయంపై అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉన్నది. ఆలయ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను బహిర్గతం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, ఇటీవల సిరిసిల్లకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ రూ. 99.4 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులను సైతం గోప్యంగానే ఉంచుతున్నారు. ఈ నిధులతో ఏ పనులు చేస్తారో వెల్లడించకపోవడం విమర్శలకు దారితీస్తున్నది.
నిపుణుల సూచనలు తీసుకోకుండా..
ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ముందస్తుగా తయారు చేసిన డీపీఆర్‌లో అసలు సిమెంట్ నిర్మాణాలు, వాటి ఎత్తు తదితర అంశాలపై సమగ్ర పరిశీలన చేయకుండా, నిపుణుల సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్మాణాలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని వల్లనే ప్రస్తుతం గర్భాలయ గోపురం భక్తులకు చిన్నదిగా కనిపించేవిధంగా మారిందన్న విమర్శలున్నాయి. చరిత్ర ప్రకారం చూస్తే.. 1974 సంవత్సరంలో చేపట్టిన పునరుద్ధరణ పనుల్లోనే గర్భాలయ గోపురాన్ని కూడా పునరుద్ధరించారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రణాళికా లోపంతో జరిగిన సిమెంట్ కట్టడాల నిర్మాణాలు.. గోపురాన్ని మించి పోతుండటంతో ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కొత్త రాగం ఎత్తుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అందులో భాగంగానే గర్భాలయ తొలగింపు పనులు చేపట్టినట్టు తెలుస్తున్నది. గర్భాలయ గోపురాన్ని రాతి కట్టడంతో నిర్మిస్తామని, ఇటీవలే శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్లి అనుమతి పొందామని సంబంధితవర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో భక్తులకు శిఖర దర్శనం కలిగించేందుకు గోపురం ఎత్తును పెంచుతామని చెబుతూ.. తమవల్ల జరిగిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
నిర్మాణాలన్నీ సిమెంట్ కట్టడాలతో చేపడుతూ.. కేవలం గర్భాలయ శిఖరాన్ని రాతి కట్టడంతో కడుతామని చెప్పడం చూస్తే.. జరిగిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రక్రియ చేపట్టారన్న విమర్శలు వస్తున్నాయి. దాదాపు 854 సంవత్సరాల క్రితం రాతితో నిర్మాణం పూర్తి చేసుకున్న నాగిరెడ్డి మండపాన్ని కూడా తొలగిస్తుండగా.. ఇదే సమయంలో స్వామి వారి గర్భాలయాన్ని కూడా తొలగించే పనులు ప్రారంభం కావడంతో నిర్మాణ పనులపై భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నది. గోపురాన్ని రాతితో నిర్మాణం చేసే ఉద్దేశమే ఉంటే.. ఈ విషయాన్ని ముందుగానే ఎందుకు వెల్లడించలేదు? డీపీఆర్‌లో ఎందుకు చేర్చలేదన్న ప్రశ్నలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

పురాతన కట్టడాలకు ముప్పు?
ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా చారిత్రక ప్రాధాన్యం కలిగిన పురాతన నిర్మాణాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న విధానంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. ఎనిమిది శతాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన నాగిరెడ్డి మండపం రాతి కట్టడాల పరిరక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1974లో ఆలయ నిర్మాణ పనులు చేపట్టిన సమయంలోనూ ఈ మండపం చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించి తొలగించకుండా అప్పటి అనువంశిక అర్చకులు అభ్యంతరం చెప్పారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అలాంటి కట్టడం ప్రస్తుత పునర్నిర్మాణంలో కనుమరుగవుతున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆలయంలోని కోటిలింగాలను ఇప్పటికే తొలగించారని, కాలభైరవ స్వామి, హనుమాన్ విగ్రహాల స్థానాల్లో మార్పులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది. సోమేశ్వర, ఉమామహేశ్వర, బాలా త్రిపురసుందరి ఆలయాల విషయంలోనూ భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దక్షణామూర్తి ఆలయాన్ని కూడా తొలగించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుండగా.. భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తొలగించడానికి లేదా మార్చడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వాటి పునఃప్రతిష్ఠ ఎప్పుడు, ఎక్కడ చేపడుతారు? పాత రాతి కట్టడాలను యథాతథంగా పరిరక్షించేందుకు ఏం చేస్తున్నారు? అన్న వివరాలను అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉన్నదని భక్తులు కోరుతున్నారు.
సిమెంట్ నిర్మాణాలపై అభ్యంతరాలు
రాజన్న ఆలయానికి చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నది. ఇలాంటి క్షేత్రంలో పునర్నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు సంప్రదాయ నిర్మాణ శైలికి ప్రాధాన్యం ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో సిమెంట్ కట్టడాలు, ఆధునిక నిర్మాణ పద్ధతులు కనిపిస్తుండటంతో ఆలయం అసలు రూపం మారిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గర్భాలయ గోపురం ఎత్తు, ఇతర నిర్మాణాల నిష్పత్తులపై కూడా చర్చ జరుగుతున్నది. గర్భాలయ గోపురం ఇతర కొత్త నిర్మాణాలతో పోలిస్తే చిన్నదిగా కనిపిస్తున్నదన్న అభ్యంతరాల నేపథ్యంలో దానిని మార్చే అంశంపై అధికారులు శృంగేరి పీఠాన్ని సంప్రదించారు.
అలయ పునర్నిర్మాణ పనుల్లో స్వామివారి గర్భాలయ గోపురం ఎత్తు దాటి సిమెంట్ కట్టడాలు ఉండటంతో.. ఇప్పుడు నిర్మాణం పేరుతో అందులో ప్రధానంగా రాతికట్టడం పేరుతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గోపురం ఎత్తు, నిర్మాణాల విస్తీర్ణం, రాతి నిర్మాణాల విధానం వంటి అంశాలపై స్పష్టమైన వివరాలు వెల్లడించకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే కార్త్తిక మాసంలోనే గర్భాలయ గోపురాన్ని తొలగించాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయానికి ఎలాంటి భంగం కలుగకుండా ఆగమశాస్త్రం, వాస్తు నిబంధనలకు అనుగుణంగానే పనులు చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ.. ఆ ప్రణాళికను భక్తులకు అందుబాటులో ఉంచకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
దర్శనాలు ఎప్పటినుంచో..?
2025 నవంబర్ 12 నుంచి అధికారులు ప్రధాన ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. అప్పటినుంచి భక్తులకు సమీపంలోని భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు కల్పించారు. ప్రధాన ఆలయంలో నిత్యపూజలు కొనసాగుతున్నప్పటికీ.. రాజన్నను యథావిధిగా దర్శించుకునే అవకాశం లేకపోవడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా మొక్కులు చెల్లించుకునేందుకు, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చే భక్తులు ప్రధాన ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుందోనని ఎదురుచూస్తున్నారు. గత జూన్‌లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం 2027 ఆగస్టు నాటికి పనులు పూర్తిచేసి భక్తులకు దర్శనాలు కల్పిస్తామని చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం పనుల పురోగతి, మిగిలిన నిర్మాణాల స్వరూపం, దర్శనాల పునరుద్ధరణకు అనుసరించనున్న కార్యాచరణపై సమగ్ర వివరాలు ఇంకా అందుబాటులో లేవు. దీంతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తవుతాయా? భక్తులకు ఎప్పటి నుంచి రాజన్న దర్శనం కల్పిస్తారు? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
గర్భాలయ గోపురం తొలగింపు!
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయ పునరుద్ధరణ పనుల్లో స్పష్టత లేదనే అంశం మరోసారి రుజవైంది. స్వామివారి ఆలయ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులకు ఆలయంలో ఏర్పాటుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్వామివారి గర్భాలయ గోపురాన్ని తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదు. కానీ, తాజాగా మంగళవారం అకస్మికంగా తొలగింపు చర్యలు చేపట్టడంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రణాళిక లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్లే ప్రస్తుతం గర్భాలయ గోపురాన్ని తొలగించాల్సి వస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించినప్పుడే పూర్తిగా శోధించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి పనులు మొదలుపెట్టాలి. కానీ, వేములవాడ క్షేత్రంలో మాత్రం అది కనిపించడం లేదని చెప్పడానికి తాజాగా గర్భాలయ గోపురం తొలగింపే నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. స్వామివారి ప్రధానాలయం చుట్టూ సిమెంట్ కట్టడాలను నిర్మించారు. దీనివల్ల ప్రస్తుతం రాజగోపురం శిఖర దర్శనం భక్తులకు కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించారు. దీంతో కొత్త సాకులు వెదుకుతున్నట్టు తెలిసింది.
పోలీస్ పహారా మధ్య నిత్యపూజలు
ప్రధాన ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేసినప్పటికీ స్వామివారికి నిత్యపూజలు కొనసాగుతున్నాయి. పూజలు నిర్వహించేందుకు విధులు కేటాయించిన అర్చకులు, సంబంధిత సిబ్బందికి మాత్రమే ఆలయంలోకి అనుమతి ఇస్తున్నారని తెలుస్తున్నది. వారు ఆలయంలోకి వెళ్లే సమయంలో పోలీసు భద్రత కూడా ఉంటున్నది. పునర్నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో సాధారణ భక్తులకు ప్రవేశం లేకపోవడం, లోపల ఏయే పనులు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. భద్రతాపరమైన కారణాలతో ఆంక్షలు విధిస్తున్నారా? లేక నిర్మాణ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించకూడదన్న నిర్ణయం వెనుక ఇతర కారణాలున్నాయా? అనే చర్చ జరుగుతున్నది.
సీఎం పర్యటనలోనూ పరిశీలన కరువు?
ఆలయ అభివృద్ధి పనులకు స్వయంగా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలోనూ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పనుల పర్యవేక్షణ, నిధుల వినియోగం, నిర్మాణాల నాణ్యతపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరుగాలని అభిప్రాయపడుతున్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధి అంటే కేవలం కొత్త మండపాలు, కట్టడాలు నిర్మించడం మాత్రమే కాదు. ఆలయ ప్రాచీనత, చారిత్రక ఆనవాళ్లు, ఆధ్యాత్మిక విశిష్టతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధులు, తొలగించిన పురాతన కట్టడాలు, విగ్రహాల పునఃప్రతిష్ఠ, మిగిలిన నిర్మాణాల ప్రణాళిక, దర్శనాల పునరుద్ధరణ తేదీపై అధికారులు సమగ్ర వివరాలను బహిర్గతం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
రాతి కట్టడాలను కూల్చి కాంక్రీట్‌తో నిర్మాణాలా..?
చారిత్రాత్మక విశిష్టత కలిగిన వేములవాడ రాజన్న ఆలయంలోని పురాతన కట్టడాలను కూల్చి సిమెంట్ కాంక్రీట్‌తో నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం? ఆలయ నిర్మాణ ప్రాంతాన్ని ఒక నిషేధిత ప్రాంతంగా ప్రకటించి అసలు పురాతన ఆలయాలు స్వామి వారి ప్రతిమలు ఉన్నాయో లేవో కూడా తెలియని అయోమయ పరిస్థితిలోకి భక్తులను నెట్టారు. రాజన్న ఆలయ అర్చకులకు, అనువంశిక కుటుంబాలకు కూడా సమాచారం ఇవ్వకపోవడం చూస్తే ఇది అభివృద్ధి కాదని, విధ్వంసమేనని అర్థమవుతున్నది. భక్తులకు కూడా ఆలయ అభివృద్ధిపై ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడం వెనుక రహస్యం ఏంది? లోక కల్యాణార్థం జరుగాల్సిన నిర్మాణం.. వ్యక్తి ప్రతిష్ట కోసం చేస్తున్నట్టుగా మాత్రమే ఉన్నది.
-చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి
ఆలయ నిర్మాణంపై స్పష్టత లేదు
వేములవాడ రాజన్న ఆలయ పునరుద్ధరణ నిర్మాణ పనులపై ఇప్పటికీ స్పష్టత లేదు. నిర్మాణం చేపట్టే సమయంలో ఆరు నెలల్లో భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పి ఏడాది అయిపోయినా ఇప్పటివరకూ ఏ నిర్మాణం ఎకడి వరకు పూర్తయిందో అధికారికంగా వెల్లడించలేదు. ఆలయ నిర్మాణాన్ని స్వాగతిస్తాం. అయితే, అభివృద్ధి పనులపై కూడా స్పష్టత ఉండాలి కదా? నిర్మాణ వివరాలను బహిర్గతం చేయాలి. ఇది భక్తులకు సంబంధించిన అంశం. ఆదాయం కోసం మాత్రమే దేవాదాయ శాఖ చూడకుండా భక్తుల మనోభావాలకు కూడా గౌరవం కల్పించే విధంగా అభివృద్ధి చేయాలి. అసలు ఆలయం ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఎప్పటిలోగా భక్తులకు దర్శనాలు కల్పిస్తారో అధికారికంగా ప్రకటన చేయాలి. ఆలయ అభివృద్ధి పేరుతో ప్రధాన ఆలయాన్ని మూసివేయడంతో భక్తుల మీదే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నది. అభివృద్ధితోపాటు ఆలయ నిర్మాణం, భక్తులకు దర్శనం కల్పించే అంశాలపై కూడా అధికారులు స్పష్టతనివ్వాలి.
-ప్రతాప రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

