జనగామ, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): జనగామ మున్సిపాలిటీని దొడ్డిదారిన హస్తగతం చేసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా దాదాగిరికి దిగింది. ప్రజాక్షేత్రంలో భంగపడిన కాంగ్రెస్.. తొలుత బెదిరింపులు, ప్రలోభాలకు దిగింది. అవికూడా పనిచేయకపోవడంతో చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ హాలులోనే ఆ పార్టీ దుశ్శాసన పర్వానికి తెరలేపింది. ఈ దుర్మార్గాన్ని కండ్లారా చూస్తూ ఉన్న ఉన్నతాధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దళిత మహిళా కౌన్సిలర్.. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతుగా ఎత్తిన చేతిని ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు బలవంతంగా కిందికి వంచి దౌర్జన్యకాండకు దిగారు.
మంగళవారం జనగామ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఎక్స్అఫీషియో హోదాలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కనుసన్నల్లో కాంగ్రెస్ సభ్యులు రెచ్చిపోయి యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఈ తతంగాన్ని దగ్గరుండి చూస్తున్న ప్రిసైడింగ్ అధికారి, జనగామ ఆర్డీవో, బందోబస్తును పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారి, పలువురు ఏసీపీలు, సీఐలు, తదితర అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. కాంగ్రెస్ సభ్యుల దౌర్జన్యాన్ని నిలువరించాల్సిన పోలీస్ యంత్రాంగం..
ఘటనపై నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు వెళ్తున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఏసీపీ వెనుక నుంచి గట్టిగా పట్టుకొని ముందుకు కదలకుండా అడ్డుకొన్నారు. ఎమ్మెల్యేపై కిడ్నాప్ కేసు పెట్టి మొదటిరోజు సోమవారం సమావేశంలో రభస సృష్టించి అప్రజాస్వామికంగా ఎన్నికను వాయిదా వేయించిన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. రెండోరోజూ కౌన్సిల్ హాలులో కాంగ్రెస్ సభ్యులను దాడికి ఉసిగొల్పారు. దీంతో దళిత మహిళ సందుపట్ల మంజులను కులం పేరుతూ దూషిస్తూ ‘చేయి పట్టి’ అనుచిత ప్రవర్తనతో నిండు సభలో కాంగ్రెస్ సభ్యులు దుశ్సాసన పర్వానికి తెరలేపారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కాంగ్రెస్.. అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.
కాంగ్రెస్ సభ్యుల అరాచకం
భారీ బందోబస్తు నడుమ జనగామ కౌన్సిల్ సమావేశాన్ని ప్రిసైడింగ్ అధికారి ప్రారంభించారు. తొలుత కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కడకంచి బాలమణికి మద్దతుగా ఎంపీ ఓటుతో కలిపి 16 మంది చేతులెత్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి గోపగోని సుగుణాకర్కు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా సహా 16 మంది చేతులెత్తారు. ఇదే సమయంలో పక్క గ్యాలరీలో ఉన్న కాంగ్రెస్ సభ్యుడు చెంచారపు కరుణాకర్‌రెడ్డి ఒక్క ఉదుటన లేచి వచ్చి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతుగా చేతిని ఎత్తిన దళిత మహిళ, ఇండిపెండెంట్ సభ్యురాలు సందుపట్ల మంజులపై దాడిచేసి ఆమె చేతిని బలవంతంగా కిందికి దింపాడు. దీంతో ఆమె గట్టిగా అరిచి మళ్లీ చేతిని పైకెత్తడంతో ఆమె వెనుక స్వతంత్రుల గ్యాలరీలో ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న మారబోయిన పాండు రెండోసారి ఆమెపై దాడిచేసి చేయిని బలవంతంగా కిందికి దింపి వరుసగా దౌర్జన్యకాండకు దిగారు. ఆ వెంటనే మరో కాంగ్రెస్ సభ్యుడు పాముకుంట్ల ప్రసాద్ సైతం మహిళా సభ్యురాలిపై దాడికి యత్నించినా ఆమె ప్రతిఘటించి మరోసారి బీఆర్ఎస్కు మద్దతుగా చేతి పైకెత్తింది.
ఎమ్మెల్యేపై పోలీస్ అధికారుల దౌర్జన్యం
బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచిన దళిత మహిళా సభ్యురాలిపై దాడిని నిరసిస్తూ ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లి నిరసన తెలిపి నిలదీసేందుకు ఆగ్రహంతో దూసుకువెళ్తున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై పోలీస్ అధికారులు దౌర్జన్యానికి దిగారు. కాజీపేట ఏసీపీ వెనుక నుంచి ఎమ్మెల్యేను గట్టిగా పట్టుకొని అడ్డుకోగా, ముందుకు వెళ్లకుండా మరో ఏసీపీ, ఇద్దరు సీఐలు అడ్డుగా నిలిచారు. దీంతో కౌన్సిల్ హాలులో బీఆర్ఎస్ సభ్యులు పోడియం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇరుపార్టీల సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు సముదాయించారు. కాంగ్రెస్ గూండాయిజం నశించాలని.. చైర్మన్ ఎన్నిక ప్రక్రియను రద్దు చేయాలని ఎమ్మెల్యే పల్లా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు.
ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఫిర్యాదు
దళిత మహిళపై దాడిచేసి చేతిని కిందికి దింపి ఆమెపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకొని వారి సభ్యత్వాలను రద్దు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధితురాలితో కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దళిత మహిళను తాకి అసభ్యకరంగా ప్రవర్తించి కులం పేరుతో దూషించి అవమానించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ఏసీపీ, డీసీపీ, ఎస్‌హెచ్‌వోలకు వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు.

జనగామ చైర్మన్ ఎన్నికను రద్దు చేయాలి
దళిత మహిళా కౌన్సిలర్‌పై దాడిచేసి ఓటు వేయకుండా చేసిన జనగామ మున్సిపల్ ఎన్నికను రద్దు చేయాలని జనగామ ఎ మ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిండు సభలో దుశ్శాసనుల్లా మారిన కాంగ్రె స్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను వెంట నే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి, దళిత మహిళా కౌ న్సిలర్ మంజులపై కాంగ్రెస్ అరాచకం చేసిందని, ఆమె ఎత్తిన చేతిని ఇద్దరు రౌడీషీటర్లు బలవంతంగా కిందికి దింపి దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ స భ్యుల ఓట్లు, తమకు మద్దతిస్తున్న వారిని కూడా ఓట్లు వేయనివ్వకుండా వాళ్ల ఇండ్లల్లోకి వెళ్లి భయపెట్టి, కుటుంబ సభ్యులను బెదిరించి దారికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు.
ఎన్నికకు ముందు రోజూ దళిత మ హిళా కౌన్సిలర్ ఇంటికి వెళ్లి ఆమె పిల్లలను కిడ్నాప్ చేసేందుకు యత్నించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. సోమవారం రాత్రి కూడా మంజుల ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. కౌన్సిలర్లుగా గె లిచిన ఆకు రౌడీ మారబోయిన పాండు, కుల దురహంకారి, రౌడీషీటర్ చెంచారపు కరుణాకర్‌రెడ్డి దళిత మహిళా కౌన్సిలర్ భు జంపై ఒకరు చేతిని గట్టిగా పట్టుకొని, మరొకరు చేతిని కిందికి లాగి తమకు ఓటు వేయకుండా అడ్డగించారని మండిపడ్డారు.
ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూశారని, పోలీసులు వాళ్లకే మద్దతు పలికారని మండిపడ్డారు. అధికారం చేతిలో ఉన్నదని కాంగ్రెస్ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కిడ్నాప్ కేసులో పోలీసులు ఎంత వేగంగా స్పందించారో? దళిత మహిళా కౌన్సిలర్‌పై జరిగిన దాడిపై కూడా అంతే వేగంగా స్పందించి చర్యలు తీసుకోకుంటే ప్రజలే వారిని శిక్షిస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అదృష్టంతో గెలిచినా.. నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టంచేశారు.